నలుగురూ నాలుగు దారులు

23 Apr, 2014 03:11 IST|Sakshi

సాక్షి, అనంతపురం :  హిందూపురం తెలుగుదేశం పార్టీలో ఉన్న నలుగురు నాయకులు ప్రస్తుతం ఒక్కొక్కరు ఒక్కోదారి వెతుక్కుంటున్నారు. నాయకుల మధ్య సమన్వయం పూర్తిగా కొరవడింది. బాలక్రిష్ణ సోదరుని కుమారుడు సినీ నటుడు నందమూరి తారకరత్న ప్రచారం కోసం అనుమతి తీసుకోకపోవడం ఇందుకు అద్దం పడుతోంది. మంగళవారం ఉదయమే ఆయన హిందూపురం చేరుకున్నారు. వచ్చీ రాగానే పట్టణంలో రోడ్ షోలో పాల్గొనే విధ ంగా ముందుగానే రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. అయితే స్థానిక నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత కలహాల కారణంగా ఎవరూ తారకరత్న రోడ్ షోకు పర్మిషన్ తీసుకోలేదు.
 
 దీంతో తారకరత్న చేసేదిలేక లాడ్జికే పరిమితం అయ్యారు. ఎన్నికల వేళ ఏమి మాట్లాడాలో ఆయన కూడా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసుకోకుండా నవ్వులపాలయ్యారు. రోడ్ షో నిర్వహించేందుకు అనుమతి తీసుకోక పోవడంతో ఎటూ సమయం దొరికింది కదా అని మీడియాతో మాట్లాడుతూ బాబాయిని సీఎంగా చూడాలన్నదే తన కోరిక అని తన మనసులో మాటను బయటకు వెల్లడించాడు. ఆ వెంటనే తేరుకొని కాదు కాదు ముఖ్యమంత్రి పదవి విషయమై మామ చంద్రబాబు నాయుడు, బాబాయ్ బాలక్రిష్ణలు కూర్చొని మాట్లాడుకుంటారని చెప్పారు. ఇలా ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడటంతో స్థానిక నాయకులు దిక్కులు చూస్తుండిపోయారు. రోడ్‌షోకు పోలీసులు సాయంత్రం అనుమతి ఇవ్వడంతో తారకరత్న రోడ్డుపైకొచ్చారు. అయితే ఆయన రోడ్‌షోలో జనం కంటే పోలీసులే ఎక్కువగా కనిపించారు.
 
 పనైపోయింది..
 హిందూపురంలో ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే గెలుపుపై ఆశలు వదిలేసుకోవాల్సిందేనని టీడీపీ నేతల మధ్య చర్చ మొదలైంది. ఇక్కడి గ్రూపు తగాదాల గోల భరించలేక.. బాలక్రిష్ణ నామినేషన్ వేసిన అనంతరం ఇతర జిల్లాలో ప్రచారం కోసమని వెళ్లిపోయారు. అప్పటి నుంచి స్థానిక నేతలు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీ కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరి విజయం కోసం ప్రచారం చేస్తున్నారు. ఇదిలా వుండగా చేనేత వర్గానికి చెందిన హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్పను సన్మానం చేస్తామని ముదిరెడ్డిపల్లిలో వున్న చేనేత కుటుంబాలు సోమవారం రాత్రి  పిలిపించి మరీ హెచ్చరించారు.
 గతంలో మంత్రిగా, ఎంపీగా వున్నా చేనేత కార్మికులకు చేసింది శూన్యమని, చేనేత కార్మికులకు దక్కాల్సిన నిధులు చాలా చోట్ల పక్కదారి పట్టినా వాటి గురించి స్పందించలేదని గట్టిగా నిలదీశారు. ఈ హఠాత్పరిణామంతో నిమ్మల కిష్టప్ప షాక్‌కు గురయ్యారు. మాజీ ఎమ్మెల్యేలు రంగనాయకులు, సీపీ వెంకటరాముడు, సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్దుల్ ఘని, అంబికా లక్ష్మినారాయణలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటున్నారు.
 
 వీరు దూరంగా ఉండటానికి కారణం వారిలో నెలకొన్న విభేదాలు ఒకటైతే... ప్రజల వద్దకు వెళ్తున్నా స్పందన కన్పించకపోవడంతోనే దూరం దూరంగా ఉంటున్నారనేది మరో కారణం. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈ సారి తెలుగుదేశం పార్టీలో స్తబ్దత నెలకొనడంతో ఎంతో కొంత చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో తారకరత్న రెండు మూడు రోజులు హిందూపురంలోనే ఉండి ప్రచారం చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి రోజే స్థానిక నాయకులు హ్యాండ్ ఇవ్వడంతో ‘అదేంది బాబాయ్.. ఇక్కడ మన పార్టీ వాళ్లు ఇలాగున్నార’ం టూ బాలకృష్ణకు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేసినట్లు ఓ టీడీపీ నేత వెల్లడించారు.
 

మరిన్ని వార్తలు