అందరిలో ధీమా !

2 May, 2014 01:33 IST|Sakshi

నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో మొత్తం 16 మంది బరిలో ఉంటే.. ప్రధాన పార్టీల అభ్యర్థులు కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్), యెండల లక్ష్మీనారాయణ (బీజేపీ), మధుయాష్కీ గౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్‌ఆర్ సీపీ)లు ప్రచారం నిర్వహించారు. అయితే పోలింగ్ నాటికి టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొనగా.. ఇద్దరూ గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నా కొద్దిపాటి తేడాతో ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటపడ వచ్చన్న చర్చ జరుగుతోంది.

 జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి సురేశ్‌కుమార్ షెట్కార్ (కాంగ్రెస్), భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్ (టీఆర్‌ఎస్), కె.మదన్‌మోహన్‌రావు (టీడీపీ), మహమూద్ మొహియొద్దీన్ (వైఎస్‌ఆర్ సీపీ)లు ప్రధాన పార్టీల నుంచి పోటీ పడగా.. ఇక్కడ నూటికి నూరుశాతం టీఆర్‌ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ బయట పడే అవకాశం ఉందని అంటున్నారు.

 అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొనగా టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా గడ్డం ఆనందరెడ్డి మూడో స్థానంలో నిలుస్తారంటున్నారు. అయితే డి.శ్రీనివాస్, బాజిరెడ్డి గోవర్ధన్‌లలో ఎవరో ఒకరు స్వల్ప ఆధిక్యతను చాటుకునే  అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

నిజామాబాద్ అర్బన్‌లో అంతిరెడ్డిశ్రీధర్‌రెడ్డి(వైఎస్సార్‌సీపీ), బిగాల గణేశ్‌గుప్త (టీఆర్‌ఎస్), బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ (కాంగ్రెస్), డి.సూర్యనారాయణగుప్త(బీజేపీ), మీర్ మజాజ్ అలీ(ఎంఐఎం)లు ప్రధాన పోటీ దారులు కాగా... బిగాల గణేశ్‌గుప్త, సూర్యనారాయణ గుప్తలలో ఎవరో ఒకరిని విజయం వరించే అవకాశం ఉందంటున్నారు.

 బాన్సువాడలో సిట్టింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కాసుల బాలరాజ్, వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ అభ్యర్థులుగా ఆర్.శోభన మహేందర్‌గౌడ్, బద్యానాయక్‌లుండగా పోలింగ్ రోజు టీడీపీ అభ్యర్థి కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు తెలిపారు. దీంతో పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఓటు బ్యాంకుకు కొంత గండి పడిందని అంటున్నా పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యనే ఉంది.

ఎల్లారెడ్డిలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి(టీఆర్‌ఎస్), బాణాల లక్ష్మారెడ్డి (బీజేపీ), జాజాల సురేందర్ (కాంగ్రెస్), పెద్దపట్లోళ్ల సిద్ధార్థరెడ్డి(వైఎస్‌ఆర్‌సీపీ)లు ప్రధాన పార్టీల అభ్యర్థులు. అయితే పోలింగ్ నాటికి ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచిందంటున్నారు. ఈ నేపథ్యంలో కారా? చేయా? అన్నది కొద్ది తేడాతో తేలుతుందంటున్నారు.      

 బాల్కొండ బరిలో 12 మంది అభ్యర్థులుంటే ఇక్కడ పంచముఖ పోటీ ఏర్పడింది. వేముల ప్రశాంత్‌రెడ్డి (టీఆర్‌ఎస్), ఈరవత్రి అనిల్ (కాంగ్రెస్), ఏలేటి మల్లికార్జున్ రెడ్డి(టీడీపీ), పాలెపు మురళి (వైఎస్‌ఆర్‌సీపీ), స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ మధుశేఖర్‌ల మధ్య పోటీ ఉంది. అయితే ఇక్కడ పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్యనే ఉండగా, టీఆర్‌ఎస్‌కు ఛాన్స్ ఉంటుందని ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 కామారెడ్డి నియోజక వర్గంలో మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్(టీఆర్‌ఎస్), టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి సిద్ది రాములు, వైఎస్‌ఆర్ సీపీ నుంచి పైలా కృష్ణారెడ్డిలుండగా.. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు ఇద్దరు కూడ ఎవరికి వారే తమకే విజయావకాశాలు ఉన్నాయని అంటున్నారు.  

 ఆర్మూర్ నియోజకవర్గంలో మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీడీపీ అభ్యర్థి రాజారాం యాదవ్‌లు పోటీ పడగా.. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్యే హోరాహోరిగా మారింది. తన గెలుపు తథ్యమని జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి (కాంగ్రెస్), ఎండీ షకీల్ (టీఆర్‌ఎస్), కాటిపల్లి సుదీప్ రెడ్డి (వైఎస్‌ఆర్‌సీపీ), మేడపాటి ప్రకాశ్‌రెడ్డి (టీడీపీ)ల నుంచి బోధన్ నియోజక వర్గంలో పోటీ పడగా... ఈసారి కూడ విజయం తనదేనని పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి ధీమాతో ఉన్నారు.

 జుక్కల్ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి నాయుడు ప్రకాశ్, ఎస్. గంగారాం (కాంగ్రెస్), సిట్టింగ్ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే (టీఆర్‌ఎస్), కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి అరుణతార, మద్దెల నవీన్ (టీడీపీ)లలో గెలుపు తనదేనని లెక్కలు వేస్తున్నారు.

మరిన్ని వార్తలు