నేత యువకుడైతే ఇక దూకుడే..

24 Mar, 2014 00:35 IST|Sakshi
నేత యువకుడైతే ఇక దూకుడే..

ఐదేళ్లపాటు అభివృద్ధి పనులకు కోడ్ ఆటంకాలుండవు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు మంచి అవకాశం

 

 

ఇక మిగిలింది
సర్పంచ్ ఎన్నికలు అయిపోయాయ్..
మున్సిపల్ ఎన్నికలు కావొస్తున్నాయ్
జెడ్పీటీసీ ఎన్నికలూ ఇప్పుడే ఉన్నాయ్
ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకోబోతున్నాం
ఐదేళ్లపాటు ఎన్నికలు, కోడ్ బాధలు ఉండవు
సంక్షేమ రాజ్యం రావడమే
దానికి సమర్థ నేతను ఎన్నుకోవడవే

 

 తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. కొత్త రాష్ట్రాల నవనిర్మాణం కోసం సరి‘కొత్త’ ప్రణాళికలు.. నవతరం నాయకత్వం అవసరం. ఇదే సందర్భంలో ఇరు ప్రాంతాలకు మంచి అవకాశమూ లభించింది... రెండు కొత్త రాష్ట్రాల్లో రానున్న ఐదేళ్లూ ఎన్నికలే ఉండవ్! ‘కోడ్’కూతలు అసలే ఉండవ్! గతంలో ఆర్నెల్లు, ఏడాదికోసారి వచ్చే ఎన్నికల సందర్భాలు తెలుగు ప్రజలకు సుపరిచితం. అయితే పదేపదే వచ్చే ఎన్నికల పేరుతో ఇక అభివృద్ధి పనులను నిలిపివేసే ఛాన్స్ ఎంత మాత్రమూ లేదు.



తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ.. ఆ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నాటికే పూర్తవుతుంది. ఆ లోపే మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముగుస్తాయి. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తయింది. ఈ లెక్కన రెండు రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు వచ్చే అయిదేళ్లపాటు ఎన్నికల గొడవ ఉండదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏదైనా కారణాలతో కూలిపోయి.. ఆ సమయంలో ఇంకొక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని పరిస్థితులు తలెత్తితే తప్ప వచ్చే ఐదేళ్ల పాటు ఎన్నికలుండవు. ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలు అనేకం ఉన్నాయి. హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్న విచిత్రమైన పరిస్థితితో పాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇరు ప్రభుత్వా లు సామరస్యంగా పరిష్కరించుకోవలసిన అంశాలెన్నో ఉన్నాయి. అయితే సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడితేనే ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే సమస్యలను సమన్వయంతో పరిష్కరించుకోవడానికి వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.


ఇప్పుడు ఓటర్ల ముందున్న ప్రధాన బాధ్యత సుస్థిర, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడమే. ఇచ్చిన హామీలు, కొత్త రాష్ట్రాల అవసరాలను గుర్తించడం, సంక్షేమ రాజ్యం నిర్మించడంలో విశ్వసనీయత, మాట పై నిలబడగలిగే నేతను ఎన్నుకోవడం ద్వారానే రెండు రాష్ట్రాల్లో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించగలుగుతారు. ఆధునిక పోకడలను అందిపుచ్చుకుని అభివృద్ధి ఎజెండాతో ఉరకలెత్తే నాయకుడికి పట్టం కట్టాల్సి ఉంది. ఇలాగైతేనే ఇరు ప్రాంతాలూ పురోగతి సాధిస్తాయి.

 

మరిన్ని వార్తలు