‘పొత్తు’తో చిత్తే

4 Apr, 2014 03:29 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో అధికారం రాకపోతే కనీసం కేంద్రంలోనైనా రాజకీయం చేయొచ్చనే ఆలోచనతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీజేపీతో పొత్తుకు పడుతున్న పాట్లు నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డికి చెమటలు పట్టిస్తున్నాయి. తన లోక్‌సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కమలానికి కట్టబెట్టినా తన పుట్టి మునుగుతుందని ఆయన ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు.
 
 కావాలంటే సర్వేపల్లి టికెట్ బీజేపీకి ఇచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని నెల్లూరు రూరల్ బరిలోకి దించాలని ఆయన ప్రతిపాదించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణం కావడంతో ఆ పార్టీలో ఉంటే తమకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరారు. ఇక్కడ ఆయన కోరుకున్న కావలి శాసనసభ స్థానం టికెట్ దక్కకపోవడంతో చంద్రబాబు ప్రతిపాదన మేరకు నెల్లూరు లోక్‌సభ నుంచి పోటీకి దిగడానికి మానసికంగా సిద్ధమయ్యారు.
 
 ఇందులో భాగంగానే ఆయన తాను పోటీ చేయబోయే లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికలో జోక్యం చేసుకుంటున్నారు. కోవూరు ఎమ్మెల్యే టికెట్ తాను ప్రతిపాదించిన పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి ఖరారు చేయించుకున్నారు. ఆత్మకూరులో పార్టీ నాయకుడు గూటూరు మురళీ కన్నబాబుకు ఇవ్వద్దని అధిష్టానవర్గాన్ని కోరుతున్నారు. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి ధాటికి కన్నబాబు తట్టుకోలేరని ఆదాల అంచనా వేస్తున్నారు. ఇక్కడ కన్నబాబుకు ప్రత్యామ్నాయంగా ఒక కాంగ్రెస్ నేత పేరు ఆయన ఇప్పటికే చంద్రబాబు చెవిలో వేసినట్లు ప్రచారం జరుగుతోంది.
 
 పొత్తు భయం : నెల్లూరు లోక్‌సభ పరిధిలోని శాసనసభ స్థానాల్లో బలమైన అభ్యర్థులను పోటీకి దించుకుంటే గానీ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డికి గట్టిపోటీ ఇవ్వలేమని ఆదాల అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో  బీజేపీతో పొత్తు అంశం తెర మీదకు రావడం ఆయనకు ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం వల్ల మైనారిటీల ఓట్లన్నీ ఏకపక్షంగా వైఎస్సార్‌సీపీ వైపు వెళతాయని ఆయన ఆందోళన చెందుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు బీజేపీ ఆత్మకూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ శాసనసభ నియోజకవర్గాల్లో ఏ రెండింటినైనా కోరుతోంది. ఈ వార్త ఆదాలకు పెద్ద షాక్ ఇచ్చినట్లు సమాచారం. తన లోక్‌సభ పరిధిలో ఒక్క అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించినా అసలుకే ఎసరు వస్తుందని, పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేసే అవకాశం లేదని ఆయన పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకుని వెళ్లినట్లు తెలిసింది.
 
 మరీ తప్పదనుకుంటే సర్వేపల్లి అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని ఆదాల పట్టుబడుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుపతి పార్లమెంటు స్థానం ఎలాగూ బీజేపీకి కేటాయించే అవకాశం ఉన్నందువల్ల ఇదే పరిధిలోని సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఇస్తామని బీజేపీని ఒప్పించాలని ఆదాల పార్టీ ముఖ్యులకు సూచించినట్లు సమాచారం. అయితే బీజేపీతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతున్న నేపథ్యంలో బీజేపీ జిల్లాలోని సర్వేపల్లి నియోజక వర్గం తీసుకోవడానికి ఇష్టపడుతుందా? అనేది వేచిచూడాల్సి ఉంది.
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి