పెళ్లింట్లో విషాదం

8 May, 2014 03:09 IST|Sakshi

గుడిబండ, న్యూస్‌లైన్ : పచ్చని తోరణాలు, పందిళ్లు, బంధువుల సందడితో కళకళలాడాల్సిన పెళ్లింట్లో విషాదం అలుముకుంది. తమ్ముళ్ల వివాహాలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న పెళ్లి కుమారుల(వరుల) అన్నను మృత్యువు ట్రాక్టర్ రూపంలో కబళించింది. దీంతో రెండు గ్రామాల్లోని మూడు కుటుంబాలకు చెందిన వధూవరుల నివాసాలు శోక సంద్రమయ్యాయి.
 
 పోలీసులు, బాధితుల కథనం మేరకు.. గుడిబండ మండలం మద్దనకుంట గ్రామానికి చెందిన వెంకటేష్‌మూర్తి(35), ఇదే మండలంలోని సీసీ గిరి గ్రామంలో పెళ్లి చేసుకున్నాడు. తన ఇద్దరు తమ్ముళ్లు గురుప్రసాద్, రవిలకు సీసీ గిరిలో ఉన్న తన బంధువుల కుమార్తెలతో నిశ్చితార్థం చేశారు. గురువారం పెళ్లిళ్లు జరిగాల్సి ఉంది. ఏర్పాట్లలో భాగంగా నీటి సౌకర్యం కల్పించేందుకు వెంకటేష్‌మూర్తి మంగళవారం సాయంత్రం సీసీ గిరి గ్రామం వద్ద నుంచి ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్‌తో గ్రామానికి బయలుదేరాడు. మార్గంమధ్యలో పాడుబడిన పెద్దబావిని గమనించక పోవడంతో ట్రాక్టర్ అదుపు తప్పి ఇంజన్, వాటర్ ట్యాంకుతో సహా అందులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో వెంకటేష్‌మూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం వరకు ఈ ఘటన వెలుగు చూడలేదు. స్థానికులు కనుక్కోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎస్‌ఐ శంకర్‌బాబు, సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంకటేష్‌మూర్తి మృతితో రెండు వివాహాలను వాయిదా వేశారు. మద్దనకుంట, సీసీ గిరి గ్రామాల్లోని వధూవరుల ఇళ్లు విషాదంతో నిండిపోయాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు