నిధులు నిల్...

6 May, 2014 01:24 IST|Sakshi
నిధులు నిల్...

 సాక్షి, ఖమ్మం : నిధులు విడుదల కాకపోవడంతో గ్రామపంచాయతీల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. కాగితాల్లో సొమ్ములు కనబడుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది నాలుగు నెలలు గడిచినా ఇప్పటి వరకు పంచాయతీలకు ఒక్క పైసా చేరలేదు.  మండు వేసవిలో తీవ్ర మంచినీటి ఎద్దడి నెలకొన్న ఏజెన్సీలోని పంచాయతీలను కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. జిల్లాలో మొత్తం 758 గ్రామ పంచాయతీలున్నాయి.. వీటిలో ఏజెన్సీలో 372 పంచాయతీలుండగా మిగిలినవి మైదాన ప్రాంతంలో ఉన్నాయి.
 
ప్రభుత్వం సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పారిశుధ్యం, మంచినీటి పథకాలు, డ్రైనేజీల పరిస్థితి అధ్వానంగా తయారైంది. మంచినీరు అందక, మురికి కంపు భరించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో పాలక వర్గాలు ఏర్పడితే గ్రామాలు బాగు పడుతాయని ఆశించిన పల్లె ప్రజలకు భంగపాటు తప్పలేదు. పంచాయతీలకు పాలక వర్గం కళ వచ్చిన రెండు నెలల తర్వాత జిల్లాకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు (ఎస్‌ఎఫ్‌సీ )కింద రూ.3.86 కోట్లు, టీఎఫ్‌సీ నిధులు రూ.11.75 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో మంచినీటి ఏర్పాటు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల భవనాలు, గ్రామీణ రహదారుల నిర్మాణం, వీధి లైట్లు వేయించడం లాంటి పనులు చేయాలి. అయితే పాలకవర్గాలు ఏర్పడేనాటికి పల్లెల్లో పుట్టెడు సమస్యలు తిష్టవేశాయి. వీటిని తీర్చడానికి ప్రభుత్వం పిసరంత విడుదల చేసిన ఈ నిధులు ఏమూలన సరిపోలేదు.
 
సర్పంచ్‌ల సంఘం ప్రతినిధులు నిధుల విషయమై పలుమార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇంతలోనే మున్సిపల్, పరిషత్, అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పంచాయతీలకు నిధుల విడుదలకు బ్రేక్ పడింది. ఎన్నికలు ఉంటాయని తెలిసి కూడా ప్రభుత్వం ముందస్తుగా ఈ ఏడాది ప్రారంభంలో నిధుల విడుదల విషయమే ఆలోచించలేదు. ఫలితంగా ఇప్పుడు గ్రామాల్లో ఈ సమస్యలు విలయతాండవం చేస్తున్నా సర్పంచ్‌లు  ఏమీ చేయలేకపోతున్నారు. సమస్యలను పరిష్కరించాలని  పల్లెజనం వారిని ప్రశ్నిస్తూ, నిలదీస్తున్నా.. నిధులు లేకుండా మేమేమీ చేయలేమంటూ చేతులెత్తేశారు.
 
 కాగితాల్లోనే రూ. 19.79 కోట్లు
 ఈ ఏడాది ప్రారంభంలో గ్రామ పంచాయతీలకు రూ.19.79 కోట్లు విడుదల కావాలి. ఇందులో జనరల్ ఫండ్ కింద రూ.15.18 కోట్లు, ఏజెన్సీలోని 372 పంచాయతీలకు రూ.4.61 కోట్లు మంజూరైనట్లు అధికారులు కాగితాల్లో చూపిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పంచాయతీల ఖాతాల్లో మాత్రం ఈ పైసలు పడలేదు. ఇదేమని అధికారులను సర్పంచ్‌లు ప్రశ్నిస్తే ఖజానా ఖాళీ అంటూ వారికి సమాధానం వస్తోంది. ఇదిగో వస్తాయి..అదిగో వస్తాయని అధికారులు చెబుతుండడంతో ఆశతో సంబంధిత అధికారుల కార్యాలయాల చుట్టూ సర్పంచ్‌లు ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రధానంగా ఏజెన్సీలో ప్రస్తుతం మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలు, మంచినీటి మోటర్లు కాలిపోవడం, చేతి పంపులు పనిచేయకపోవడంతో గిరి పుత్రులు మంచినీటి కోసం తహతహలాడుతున్నారు. చిన్నచిన్న మరమ్మతులు చేయాల్సి ఉన్నా  పంచాయతీల ఖాతాల్లో చిల్లిగవ్వలేక పోవడంతో పనులు సాగడంలేదు. దీంతో  ఏజెన్సీలో గ్రామాలు అల్లాడుతున్నాయి.
 
 నూతన రాష్ట్రంలోనేనా..?
 ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల హడావిడిలో ఉంది. పంచాయతీల సమస్యలను కన్నెత్తి చూసే అధికారులే లేరు. ఈనెలలో అంతా ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సమాయత్తం అంతా ఇదే హంగామా.  ఈ పరిస్థితుల్లో నూతనంగా ఏర్పాటయ్యే తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీలకు నిధులు విడుదలవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మంచినీటి ఎద్దడినైనా దృష్టిలో పెట్టుకుని కొంత మొత్తంలో నిధులు విడుదల చేస్తే వేసవిని గట్టెక్కవచ్చని పలువురు సర్పంచులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు