మహిళలకు ప్రాధాన్యం అంతంతే

21 Apr, 2014 22:59 IST|Sakshi
మహిళలకు ప్రాధాన్యం అంతంతే

మహిళలకు ప్రాధాన్యమనే మాటకు అర్ధమే లేకుండాపోయింది. 33 నుంచి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు గొప్పలు చెబుతున్నప్పటికీ ఎన్నికల విషయానికొచ్చేసరికి ఆయా పార్టీలు మహిళలకు ఇస్తున్న సీట్లు తక్కువే.
 

సాక్షి, ముంబై: రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తున్నామని వివిధ పార్టీలు ఢంకా బజాయిస్తున్నప్పటికీ అది ఆచరణలో అంతంతగానే ఉంది. మహిళలకు పెద్ద పీట వేస్తున్నామని, 33 శాతం నుంచి 50 శాతం వరకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో అతి తక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేస్తుండడం ఈ సందర్భంగా గమనార్హం.
 
2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ మంది మహిళా అభ్యర్థులు లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున 25 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, మహిళా అభ్యర్థి మాత్రం ఒక్కరే. 2009లో కూడా ఒక్క మహిళే పోటీ చేశారు. అదేవిధంగా శివసేనలో 19 మంది పురుష అభ్యర్థులు పోటీ చేస్తుండగా, కేవలం ఒక టికెట్ మాత్రమే మహిళకు ఇచ్చారు. 2009లో శివసేన తరఫున 20 మంది పురుష అభ్యర్థులు బరిలోకి దిగగా, అప్పుడు కూడా మహిళా అభ్యర్థి ఒక్కరే. ప్రస్తుతం బీజేపీ తరఫున 21 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా 2009లో 24 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, కేవలం ఒక మహిళా అభ్యర్థి తలపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున 18 మంది పురుష అభ్యర్థులు బరిలో ఉండగా, ముగ్గురు మహిళలు తలపడుతున్నారు.  
 
 2009లో ఎన్సీపీ తరఫున 17 మంది పురుష అభ్యర్థులు, ముగ్గురు మహిళలు బరిలోకి దిగారు. ఎమ్మెన్నెస్ తరఫున 10 మంది పురుష అభ్యర్థులు పోటీ చేయగా, ఒక్క మహిళ కూడా బరిలోకి దిగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2009లో ఎమ్మెన్నెస్ తరఫున ఏడుగురు పురుషులు పోటీ చేయగా, నలుగురు మహిళలు బరిలో దిగారు. అయితే మహిళా అభ్యర్థుల సంఖ్య స్వల్పంగా ఉండడానికిగల కారణాలను ఆయా పార్టీల అధికార ప్రతినిధులు స్పష్టంగా చెప్పలేకపోయారు.
 
ఈ విషయమై బీజేపీ అధికార ప్రతినిధి మాధవ్ భండారీ  మాట్లాడుతూ.. ప్రతి స్థాయిలో మహిళా నాయకత్వాన్ని పెంచేం దుకు తమ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.  శివసేన అధికార ప్రతినిధి నీలం గోరె మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో జరిగిన సమావేశాల్లో తమ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే మహిళలు  ముందుకు రావాలని పిలుపునిచ్చారన్నారు. అయినప్పటికీ అతితక్కువ మంది మహిళలు ముందుకొచ్చారన్నారు.వీరిలో అనేకమంది విధానసభ లేదా మేయర్ స్థాయిలో పోటీ చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సచిన్ సావంత్  మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని రాహుల్ పిలుపునిస్తున్నారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు