'నాపై వ్యభిచారం కోసం మైనర్ ను కొనుగోలు చేసిన కేసుంది'

19 Apr, 2014 18:05 IST|Sakshi
'నాపై వ్యభిచారం కోసం మైనర్ ను కొనుగోలు చేసిన కేసుంది'

నేరచరిత్ర ఉన్న నేతలు ఎన్నికల్లో ఉండటం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి పోటీలో ఉన్న వారిలో కొందరిపై ఉన్న కేసులు కంగారుపుట్టిస్తున్నాయి.

బీహార్ లోని పూర్ణియా నుంచి లోకసభకు పోటీ చేస్తున్న సీపీఐఎంఎల్ అభ్యర్థి పంకజ్ కుమార్ సింగ్ పై వ్యభిచారం చేయించేందుకు మైనర్ బాలికను కొనుగోలు చేసినట్టు కేసుంది. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 373 ప్రకారం ఆయనపై కేసు నమోదైంది. ఈ విషయాన్ని ఆయన తన అఫిడవిట్ లోనూ పేర్కొన్నారు.

కన్యా కుమారి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్ పి ఉదయకుమార్ పై 382 క్రిమినల్ కేసులున్నాయి. హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఆయన కేసుల జాబితాకి పలు పేజీలు కేటాయించాల్సి వచ్చింది. ఆయనపై 19 హత్యాయత్నం కేసులు, 16 దేశద్రోహ కేసులు, 5 దొంగతనం కేసులు, మూడు దోపిడీ కేసులు ఉన్నాయి.

ఇంకో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ఎం పుష్పరాయన్ తమిళనాడు తూత్తుకుడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై 380 కేసులున్నాయి.
ఆరవ విడత లోకసభ పోలింగ్ కు వెళ్తున్న అభ్యర్థుల్లో మొత్తం 11 మంది అభ్యర్థులపై మహిళల వేధింపు కేసులున్నాయి. అందులో పంకజ్ కుమార్ సింగ్ ఒకరు. ఈ దశలో పోటీలో ఉన్న మొత్తం 2071 మందిలో 321 మంది అభ్యర్థులు నేరచరితులు. వీరిలో 204 మందిపై తీవ్రమైన నేరారోపణలున్నాయి. 11 మgదిపై హత్య కేసులున్నాయి, మరో 40 మందిపై హత్యాయత్నం కేసులున్నాయి.

మరిన్ని వార్తలు