‘బాబుగారి’ మాటలకు అర్థాలే వేరులే..!

28 Mar, 2014 17:34 IST|Sakshi
నాడు కత్తులు దూసుకుని నేడు ఆలింగనాలు... తోట నరసింహం, జ్యోతుల చంటిబాబు

కాకినాడ: చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని తెలుగుదేశం పార్టీ అధినేత వ్యవహార శైలి చెప్పకనే చెబుతోంది. ప్రజల సమక్షంలో, వారి అభిప్రాయాలను తీసుకుని అభ్యర్థిని ప్రకటిస్తానని పాలమూరు ప్రజాగర్జన సభలో చంద్రబాబు ప్రకటించారు. కానీ, దీనికి భిన్నంగా వలస వచ్చిన నేతలు తమకు తామే అభ్యర్థులమంటూ ప్రకటించుకుంటున్నారు. విభజన నిర్ణయం తీసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ గొప్పలకు పోయిన మాజీమంత్రి తోట నరసింహం.. మాట మార్చి తన మామ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు దౌత్యం తో ఇటీవల చంద్రబాబు పంచన చేరారు.

టీడీపీలో చేరిన అనంతరం మంగళవారం తొలిసారిగా జగ్గంపేట చేరిన ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు తాను, జగ్గంపేట నుంచి అసెంబ్లీకి జ్యోతుల చంటిబాబు పోటీ చేస్తారని ప్రకటించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప, మెట్ల సత్యనారాయణరావు సమక్షంలోనే ఆయన చేసిన ఈ ప్రకటన తెలుగు తమ్ముళ్ల మధ్య చిచ్చురేపింది. కాంగ్రెస్ నుంచి వచ్చీరాగానే తనకు తానుగా అభ్యర్థినని ప్రకటించుకునే అధికారం తోటకు చంద్రబాబు ఇచ్చారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 జిల్లాలోని జగ్గంపేట, కొత్తపేట, రామచంద్రపురం నియోజకవర్గాల్లో పార్టీ జెండాను భుజాన మోస్తోన్న పాతకాపులను పక్కన పెట్టి అడ్రస్ లేక కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి టికెట్లు కట్టబెడుతున్న బాబు తీరును పార్టీ శ్రేణులు ఆక్షేపిస్తున్నాయి. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబుకు జెల్లకొట్టి.. అక్కడి నుంచి బొటాబొటీ మెజార్టీతో బయటపడ్డ తోట నరసింహానికి టికెట్టు ఖాయం చేద్దామని చంద్రబాబు అనుకున్నారు. దీనిని పసిగట్టిన తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

హైదరాబాద్‌లో నరసింహం ఇటీవల సైకిల్ ఎక్కిన సమయానికి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు నిర్ణయంపై భగ్గుమన్నారు. గత రెండుసార్లు అంతంతమాత్రం మెజార్టీతో గెలుపొంది ప్రజల ఆశలకు తగ్గట్టుగా అభివృద్ధి చేయలేక వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి వ్యక్తికి చంటిబాబును పక్కన పెట్టి జగ్గంపేట టికెట్టు ఏ ప్రాతిపదికన ఇవ్వాలనుకుంటున్నారో 24 గంటల్లోగా చెప్పాలని పార్టీ నాయకులు అల్టిమేటమ్ ఇచ్చారు. గత రెండు ఎన్నికల్లో పార్టీ కోసం లక్షలు తగలేసుకుని తిరుగుతున్న చంటిబాబుకంటే నరసింహం ఎందులో ఎక్కువనేది చెప్పాలంటూ బాబు తీరును తూర్పారబట్టారు. దీంతో దిగొచ్చిన చంద్రబాబు జగ్గంపేట టికెట్టును చంటిబాబుకు ఇచ్చేందుకు అంగీకరించారని సమాచారం.

మరోపక్క ఇప్పుడు కాకినాడ పార్లమెంట్ టికెట్టుపై ఆశతో ఏడాది కాలంగా ప్రముఖ విద్యా సంస్థల అధినేత పోతుల విశ్వం లక్షలు ఖర్చు చేస్తున్నారు. తోటకు ఈ టికెట్టు ఇచ్చేస్తే విశ్వం పరిస్థితి ఏమిటని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. పార్టీ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా ప్రజల సమక్షంలోనే చేస్తానంటున్న చంద్రబాబు మాటలు కేవలం ప్రచారార్భాటానికే పరిమితమా? అని పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు జగ్గంపేట బీసీలకు కేటాయిస్తారనుకుని టీడీపీలో చేరామని, ఇప్పుడు ఇలా చేయడం ద్వారా పార్టీ శ్రేణులకు ఏమని సంకేతాలు ఇస్తున్నారో చెప్పాలని జగ్గంపేట అసెంబ్లీ టికెట్టు ఆశించిన పల్లా సత్యనారాయణ, కాకినాడ పార్లమెంటు సీటు ఆశించిన పోతుల విశ్వం వర్గీయులు ప్రశ్నిస్తున్నారు.

బీసీలకు పార్టీలో సముచిత స్థానం, చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తానని బాబు చెప్పారు. కానీ.. జిల్లాలో ఆ వర్గానికి ఇవ్వాల్సిన రామచంద్రపురం, కొత్తపేట నియోజకవరా్గాలను వలస వచ్చిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తోట త్రిమూర్తులు, బండారు సత్యానందరావులకు ప్రకటించారు. దీనిపై కూడా పార్టీ శ్రేణులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. కొత్తపేట సీటు ఆశించిన బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండిచేయి చూపడంపై బీసీ సామాజికవర్గం మండిపడుతోంది. మరోపక్క రామచంద్రపురం టికెట్టు ఆశించి, భంగపడిన కట్టా సూర్యనారాయణ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీలో ఇటీవల చేరారు.
 

మరిన్ని వార్తలు