తుది పోరు

11 Apr, 2014 03:42 IST|Sakshi
తుది పోరు

 సాక్షి, కడప : స్థానిక తుది పోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం జరిగే పోలింగ్‌కుగాను సామగ్రి, బ్యాలెట్ బాక్సులు,  సిబ్బంది, పోలీసులు గురువారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. శాంతిభద్రతల పరంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. ఎన్నికలు జరిగే జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు నియోజకవర్గాలు  సమస్యాత్మకం, కీలకం కావడంతో పోలీసులు విసృ్తత బందోబస్తును ఏర్పాటు చేశారు.

 బరిలో ఉన్న అభ్యర్థులు ఎలాగైనా గెలవాలనే కృతనిశ్చయంతో మంచినీళ్లప్రాయంగా డబ్బులను ఖర్చు చేశారు. మద్యంను విచ్చలవిడిగా పంపిణీ చేశారు. కమలాపురం నియోజకవర్గంలోని చిన్నపుత్త, దేవరాజుపల్లె, మాచిరెడ్డిపల్లె, కోగటం వంటి గామాల్లో ఓ పార్టీ దౌర్జన్యం చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేట్ సైన్యాలను మోహరిస్తున్నట్లు సమాచారం.

జమ్మలమడుగు ప్రాంతంలోని కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో వైఎస్‌ఆర్‌సీపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తుండగా, మరికొన్నిచోట్ల ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. పులివెందుల నియోజకవర్గంలో మాత్రం వైఎస్‌ఆర్‌సీపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు ఏకపక్షంగా జరిగే అవకాశముంది.

ప్రొద్దుటూరు పరిధిలో కొన్ని ఎంపీటీసీ స్థానాల పరిధిలో ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్నాయి. మొత్తం రెండో విడతలో 227 ఎంపీటీసీ  స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో 18 స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 209 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 16 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడం గమనార్హం. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

 ప్రలోభాలు
 గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఎలాగోలా ప్రసన్నం చేసుకునేందుకు బరిలో ఉన్న అభ్యర్థులు తుది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓటర్లతో బేరసారాలు సాగిస్తున్నారు. తాయిలాలను ఎరగా చూపుతున్నారు. కొన్నిచోట్ల ఓటర్లను గుంపగుత్తగా కొనేస్తున్నారు.

దీనికితోడు రకరకాల హామీలు ఇచ్చి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం రాత్రి భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు కూడా ఓటర్లను ఎలాగోలా మభ్యపెట్టేందుకు తమ ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు