నేడు ‘సార్వత్రిక’ తీర్పు

16 May, 2014 02:06 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. శుక్రవారంతో రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఈ నెల 7వ తేదీన జరిగిన అసెంబ్లీ , లోక్‌సభ ఎన్నికల ఫలితాలు శుక్రవారం మధ్యాహ్నానికి తేటతెల్లం కానున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమై మధ్యాహ్నానికి తుది ఫలితాలు వెల్లడవుతాయి.

జిల్లాలో ఒంగోలు, బాపట్ల లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు 12 అసెంబ్లీ నియోజకవర్గాల  ఓట్ల లెక్కింపు ఒంగోలు నగరంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లోనే నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు లెక్కింపు కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

లోక్‌సభ, అసెంబ్లీ ఓట్లలెక్కింపు ఒకేసారి జరిగేలా చర్యలు చేపట్టారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ్‌కుమార్ పర్యవేక్షణలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియకు సర్వసన్నద్ధమైంది.

జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్‌తో పాటు లోక్‌సత్తా, బీఎస్పీ, జైసమైక్యాంధ్ర, సీపీఐ, సీపీఎం, స్వతంత్రులతో కలిపి మొత్తం 187 మంది బరిలో నిలిచారు. ఒంగోలు, బాపట్ల లోక్‌సభ స్థానాల్లో 29 మంది పోటీ చేశారు.

పోలింగ్ రోజు జిల్లా వ్యాప్తంగా అన్నిచోట్లా ఓటర్ల చైతన్యం వెల్లివిరిసింది.

2009 సాధారణ ఎన్నికలతో పోల్చిచూస్తే ఈ ఎన్నికల్లో దాదాపు 7.5 శాతం ఓటింగ్ అదనంగా నమోదు కావడం విశేషం.

కొద్ది గంటల్లో ఫలితాల వెల్లడికానుండటంతో పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు, వారి మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ భవిష్యత్‌పై లెక్కలేసుకుంటున్నారు. ఎవరికి వారు విజయం తమదేనంటూ పైకి గంభీరంగా కనిపిస్తున్నా ఫలితాలపై లోలోపల టెన్షన్ అనుభవిస్తున్నారు.

 రౌండ్లవారీగా ఫలితాలు...
 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కేంద్రంలోని మూడు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ గంటన్నర వ్యవధిలో పూర్తిచేసేలా కలెక్టర్ అధికారయంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు.
ఓట్ల లెక్కింపు ఒక్కో సెగ్మెంట్‌కు కనిష్టంగా 16 రౌండ్లు, గరిష్టంగా 20 రౌండ్లలో జరగనుంది.

ఒక్కో రౌండ్‌కు నాలుగున్నర నిమిషాల సమయం పట్టనుంది.

కౌంటింగ్ హాలులో మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్‌పై 20 ఈవీఎంలు ఉండేలా చర్యలు చేపట్టారు.

ఆ మేరకు 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ 9.30 గంటలకల్లా పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.
 అడుగడుగునా పోలీసులు ఒంగోలు నగరంలో శుక్రవారం సాయంత్రం వరకు  పోలీసు యాక్ట్ 30, 144 సెక్షన్ అమలులో ఉంటుంది.  ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు, అభ్యర్థుల మద్దతుదారులు భారీగా ఒంగోలు తరలి వచ్చారు.

అదే సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితులు కూడా చోటచేసుకునే అవకాశాలుండటంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

నగరంలో అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏజెంట్ పాస్‌లు ఉన్నవారు, నగర వాసులు మినహా ఒంగోలు నగరానికి ఎవరూ రాకూడదని, ఒకవేళ పనికోసం వచ్చిన వారు వెంటనే వెళ్లిపోవాలని పోలీసు అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు