హోరాహోరీ

28 Apr, 2014 01:43 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల : సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 4 గంటలతో తెరపడనుంది. హోరెత్తిన మైకుల శబ్దం, జోరందుకున్న నాయకుల పలకరింపులు పరిసమాప్తం కానున్నాయి. ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రంలో తొలి పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా ఖ్యాతి గాంచేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు.

ఇందులో భాగంగా తమ గెలుపుకోసం చెమటోడ్చుతున్నారు. మండు వేసవిలో పల్లె పట్నం అంటూ తేడా లేకుండా తమ తమ నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. గెలుపుపై ధీమా కోసం పార్టీల అగ్రనేతలను రప్పించి ఓటర్ల ప్రసన్నం కోసం పాట్లుపడుతున్నారు. కొందరు సినీతారలతో ప్రచారానికి తళుకులు అద్దారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో నేటితో ప్రచారానికి శుభం కార్డు పడనుంది. ఇదిలాఉండగా.. ఓటర్లను ఫోన్ల ద్వారా కాకా పట్టడం, ద్వితీయ శ్రేణి నాయకులను ఓటర్లతో ‘టచ్’లో ఉంచే ఎత్తుగడలు అభ్యర్థులు రూపొందిస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే ప్రలోభాల చిట్టాను నాయకులు తయారు చేసుకున్నట్లు సమాచారం.

 అగ్రనేతల సుడిగాలి పర్యటనలు
 జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఆయా పార్టీల అగ్రనేతల తాకి డి కనిపించింది. టీఆర్‌ఎస్ శ్రే ణుల గెలుపు ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఒకరోజు సుడిగాలి పర్యటనలో తొమ్మిది నియోజకవర్గాలు చుట్టివచ్చారు. ప్రతిచోటా కార్యకర్తలతోపాటు ప్రజలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. సోమవారం మందమర్రిలో పర్యటించే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి జైరాం ర మేశ్ జిల్లా అంతటా పర్యటించారు. జైరామ్ రమేశ్‌కు తోడుగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ల క్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు బహిరంగసభల్లో పాల్గొన్నారు.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వేర్వేరుగా రెండ్రోజులు ప్రచారం నిర్వహించారు. తూర్పు జిల్లాలో ప్రచారం నిర్వహించిన సమయంలో కిషన్‌రెడ్డితోపాటు పార్టీ నేత, సినీనటి జీవిత, సినీ హీరో రాజశేఖర్ పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలుగుదేశం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. అయితే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్రపడటంతో ఆయన ఆ సభల్లో ఇక్కట్లను ఎదుర్కొన్నారు. వెరసి అన్నిపార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తించారు.
 ఆ విధంగా ముందుకు..
 ప్రచారం ముగిసిన తర్వాత ఓటర్లను చేరుకునేందుకు నాయకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కులసంఘాలు, గ్రామ పెద్దలతో ఫోన్లలో మంతనాలు చేయడం, యువజన సంఘాల ముఖ్యులతో భేటీ అవడం వంటి వాటికి ప్రాధాన్యం ఇస్తున ్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డ్వాక్రా సంఘాలు, పలు ఉద్యోగ, కార్మిక సంఘాల బాధ్యులతోనూ చర్చల యత్నాలు చేస్తున్నట్లు అభ్యర్థుల సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నారు. కాగా, ఎన్నికల కోడ్ ఉల్లంఘించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఆయా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలకు వెనుకాడబోమని పేర్కొంటున్నారు. నిర్దేశిత సమయం తర్వాత ఎలాంటి ప్రచారాలు చేపట్టకూడదని ఆదేశిస్తున్నారు. తమకున్న మార్గదర్శకాల ప్రకారం ఈ విషయంలో ముందుకువెళతామని పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు