సేలం, నామక్కల్‌లో నేడే రీపోలింగ్

10 May, 2014 03:38 IST|Sakshi

- అధికార పార్టీ అసంతృప్తి
- రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్న
 
చెన్నై, సాక్షి ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి సేలం, నామక్కల్ నియోజకవర్గాల్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో శనివారం రీపోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ నియోజకవర్గానికి గత నెల 24వ తేదీన పోలింగ్ జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. నాలుగు రోజుల తర్వాత రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనివార్యమైందని ప్రకటించారు. దీనిపై అధికార అన్నాడీఎంకే ఆగ్రహం, అనుమానం వ్యక్తం చేసింది. సజావుగా జరిగిందని నిర్ణయించిన తర్వాత రీపోలింగ్ అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించింది.

ఈసీ మాత్రం తనపాటికి తాను రీపోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసింది. సేలం ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సెంగలనై రోడ్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్ బూత్ నెంబర్ 213లో ఈవీఎంలు మొరాయించాయని ఈసీ పేర్కొంది. అలాగే నామక్కల్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొట్టపాలయం పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబరు 37లో పోలింగ్ సజావుగా పూర్తయి నా ఈవీఎంలను మూసివేయడంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించింది.

దీంతో ఈ కేంద్రాల్లో రీపోలింగ్ అవసరమైందని ఈసీ పేర్కొం ది. రీపోలింగ్ కారణంగా అన్ని పార్టీల వారు మరోసారి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. శనివా రం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు

>
మరిన్ని వార్తలు