జనమొస్తరా..!

25 Mar, 2014 03:32 IST|Sakshi

 నేడు టీడీపీ ప్రజా గర్జన
  జన సమీకరణకు మల్లగుల్లాలు
  హాజరుకానున్న చంద్రబాబు
  తమ్ముళ్లల్లో వీడని అనిశ్చితి
  టార్గెట్‌కోసం నాయకుల యత్నం

 
 మహబూబ్‌నగర్ వైద్యవిభాగం, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని స్టేడియంలో జరగనున్న ‘ప్రజా గర్జన’కు జన సమీకరణ ఎలా చేయాలని ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనే ఈ సభకు ఆదరణ ఉంటుందో.. లేదోనన్న అనిశ్చితిలో తమ్ముళ్లు కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు  ఉద్దేశించిన ఈ సభకు జనాన్ని సమీకరించేందుకు పార్టీనాయకులు, కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు.

దాదాపు 10వేల మందితో  మైదానాన్ని  నింపాలన్నది టీడీపీ తమ్ముళ్ల టార్గెట్.. దానికి చేరువ అవుతామా.. లేదా అన్న అనుమానంతోనే జన సమీకరణకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో  ఆ పార్టీ నాయకులు రెండు రోజుల ముందే ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలో తెలుగుదేశం ఉనికిని ప్రదర్శించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టారు. తెలంగాణలో టీడీపీపై వ్యతిరేక పవనాలు వీచడంతో తెలుగు తమ్ముళ్లలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగించి తెలంగాణ జిల్లాలో కూడా  టీడీపీ పార్టీ బలంగా ఉందని తమ్ముళ్లకు భరోసా ఇచ్చేందుకు  చంద్రబాబు ఈ ప్రజాగర్జన యాత్ర చేపట్టారు. టీడీపీ పోలిట్‌బ్యూరోసభ్యుడు రావుల చంద్రశేఖర రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బక్కనినర్సింహులు, నియోజకవర్గ ఇంచార్జీ ఎన్‌పీ. వెంకటేశ్ ఆధ్వర్యంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు.


 చంద్రబాబు లేఖ వల్లే!
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీడీపీ పాత్ర కీలకమైందని, చంద్రబాబు లేఖ ఇవ్వడం వల్లే కేంద్రంలో చలనం వచ్చి  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు దోహదం చేసిందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులను కార్యకర్తలను, నాయకులను, ప్రజలను తరలించేందుకు జిల్లా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ హోంమంత్రి దేవేందర్‌గౌడ్, టీటీడీపీ కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు, తుమ్మలనాగేశ్వరరావు, సినీనటుడు వేణుమాధవ్ తదితరులు హాజరు కానున్నట్లు పార్టీ ప్రచార సమన్వయకర్త నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా