అగ్రరాజ్యాల్లోనూ ఇంతింతే..

22 Mar, 2014 01:38 IST|Sakshi

మహిళల హక్కులపై నిరంతరం నీతిచంద్రికలు వల్లించే అగ్రరాజ్యాల చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రమే. ‘ఆకాశంలో సగం’ అంటూ మాటలతోనే మహిళలను ఆకాశానికెత్తిన మావో పుట్టిన దేశంలోనూ చట్టసభల్లో మహిళలకు దక్కుతున్న చోటు అంతంత మాత్రమే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు కు మోక్షం దక్కే ముహూర్తం ఇంకా ఆసన్నం కాకపోవడంతో భారత్‌లోనూ అదే పరిస్థితి. వివిధ దేశాల్లోని చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
- ఎలక్షన్ సెల్
 
 *    ప్రస్తుత పార్లమెంటులో మహిళలకు 11 శాతమే ప్రాతినిధ్యం గల భారత్ ఐపీయూ జాబితాలో 108వ స్థానంలో ఉంది.
 *    పొరుగునే ఉన్న పలు దేశాలు చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మన కంటే ముందున్నాయి. మహిళలకు 27.7 శాతం ప్రాతినిధ్యం కల్పిస్తూ అఫ్గానిస్థాన్ 37వ స్థానంలో, 20.7 శాతం ప్రాతినిధ్యంతో పాకిస్థాన్ 66వ స్థానంలో, 19.7 శాతం ప్రాతినిధ్యంతో బంగ్లాదేశ్ 71వ స్థానంలో ఉన్నాయి.
 *    చైనా చట్టసభలో మహిళలకు 23.4 శాతం ప్రాతినిధ్యమే లభిస్తోంది. ఐపీయూ జాబితాలో చైనా 56వ స్థానంలో నిలుస్తోంది.
 *    ప్రపంచంలో సుమారు పాతిక దేశాల్లో మాత్రమే చట్టసభల్లో మహిళలకు కనీసం మూడోవంతు ప్రాతినిధ్యం లభిస్తోంది.
 *    ప్రపంచంలోని ఎనిమిది దేశాల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మచ్చుకైనా లేదు.
 
 పెద్దన్న.. చిన్న బుద్ధి
 పేరుకు అగ్రరాజ్యమే కానీ.. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో మాత్రం అమెరికా వెనకబడే ఉంది. అమెరికా ప్రతినిధుల సభలో మహిళల ప్రాతినిధ్యం 17.8 శాతం మాత్రమే. ఐపీయూ జాబితాలో ఈ దేశం 80వ స్థానంలో ఉంది.

మరిన్ని వార్తలు