బదిలీల గుబులు

20 May, 2014 00:10 IST|Sakshi

 సాక్షి, రాజమండ్రి: అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు తిరగబడ్డాయి. కాంగ్రెస్ పాలన పూర్తిగా అంతరించింది. పదేళ్ల విరామం తర్వాత జిల్లాలో సింహభాగం సీట్లు గెలిచిన తెలుగు తమ్ముళ్లు ఇక నుంచి రాజ్యమేలనున్నారు. ఈ నేపథ్యంలో నేతల కు ఓటమి దిగులు పట్టుకుంటే.. అధికారుల్లో బదిలీల గుబులు పుట్టుకొస్తోంది. కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారు అనుకూలంగా ఉండే అధికారులను తమ ప్రాంతాల్లో నియమించుకునేందుకు చర్యలు చేపట్టే అవకాశాలు ఉండడంతో జిల్లావ్యాప్తంగా అధికారుల్లో బదిలీలపై
 ఉత్కంఠ నెలకొంది.

‘ఎస్.. సర్’ అనేవారి కోసం
అధికారులకు ప్రతినిధులే ముఖ్యం కానీ రాజకీయ పార్టీలు కాదు. కానీ ఇంతవరకూ కాంగ్రెస్ పాలనలో పనిచేసిన అధికారులను మాత్రం కొత్తగా ఏర్పడుతున్న టీడీపీ ప్రతినిధులు సాగనంపాలని చూస్తున్నట్టు సమాచారం. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే, ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఈ దిశగా కొత్త ఎమ్మెల్యేలు రంగంలోకి దిగాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో ఐదుగురు వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలువగా, 12 మంది తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. ఒకరు ఇండిపెండెంట్, ఒకరు బీజేపీ తరఫున స్థానం దక్కించుకున్నారు.

కాగా టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచినవారిలో మాత్రం ఉన్న అధికారులను సాగనంపి అనుకూలంగా పనిచేసేవారిని రప్పించుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. కలెక్టర్ స్థాయి అధికారులతో పాటు, ఆర్డీలు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ, బీసీ కార్పొరేషన్, డీఆర్‌డీఏ, డ్వామా ప్రాజెక్టుల ఉన్నతాధికారుల నుంచి మండల స్థాయి అధికారులపై కూడా నేతల వత్తిడి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టాలంటే పోలీసు శాఖలో అనుయాయులు ఉండాల్సిందే. అందుకే ఎస్పీ నుంచి డీఎస్పీ, ఇన్‌స్పెక్టర్‌ల స్థాయి అధికారుల వరకూ తమ మాటకు ‘ఎస్.. సర్’ అనే వారిని రప్పించుకోవాలని కొత్త నేతలు ఉబలాటపడుతున్నారు.
 
సీనియర్లే చక్రం తిప్పనున్నారు

కొత్తవాళ్లకు పరిపాలనా పరమైన అనుభవం ఉండదు కాబట్టి వీరు అధికారుల జోలికి పోకపోవచ్చు. టీడీపీ ప్రభుత్వం కావడంతో ఇతర పార్టీలు అధికారుల జోలికి వెళ్లే అవకాశాలు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన అనుభవం ఉన్నవారు, సిట్టింగులు ప్రధానంగా అధికారులపై దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా నెగ్గిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి 1999 వరకూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఈయన కొన్ని శాఖల అధికారులపై గుర్రుగా ఉన్నారు. గత ఏడాది రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గృహ నిర్మాణ శాఖ అధికారులకు బహిరంగంగా హెచ్చరికలు జారీచేశారు. రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పెందుర్తి వెంకటేష్ రెండోసారి గెలిచారు.

ప్రతి పక్ష ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారులు తన నియోజకవర్గంలో సహకరించలేదని అసంతృప్తితో ఉన్నారు. రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈయన గతం నుంచి జిల్లా యంత్రాంగంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కూడా సిట్టింగ్ స్థానం నుంచి గెలిచారు. కాకినాడ సిటీ నుంచి గెలిచిన వనమాడి వెంకటేశ్వరరావు 1999లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004, 2009లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మళ్లీ పదవి వరించడంతో తన పనులు సవ్యంగా పూర్తవ్వాలంటే తమకు కావల్సిన అధికారులను నియమించుకోవాలనే భావనతో ఉన్నట్టు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

 పనులవ్వాలంటే మనవారే ఉండాలి
 అభివృద్ధి పనులు, కాంట్రాక్టులు తమ ఆదేశానుసారం జరిగేలా సహకరించే అధికారులు తమ వద్ద ఉంటే తమకు ఎదురు ఉండదని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఐఏఎస్‌లను కూడా గతంలో తమకు అనుకూలంగా ఉన్నవారిని జిల్లాకు రప్పించుకునేందుకు సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు