త్రిముఖ ‘వార్’ణాసి

16 Apr, 2014 01:24 IST|Sakshi
త్రిముఖ ‘వార్’ణాసి

 కాశీలో ‘కమల’ వికాసం తేలికేం కాదు
 వారణాసి నుంచి శ్రీదేవి - సాక్షి: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ కోసం వారణాసిని ఎంచుకోవడంతో ఈ నియోజకవర్గం మీడియాలో ఇదివరకు ఎన్నడూ లేని ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదరా నుంచి కూడా మోడీ పోటీ చేస్తున్నా, వారణాసిపై బీజేపీ సర్వశక్తులూ కేంద్రీకరిస్తోంది. వారణాసి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత మురళీమనోహర్ జోిషీ 2009 ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్ల ఆధిక్యతతో గట్టెక్కారు. వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు- ఉత్తర వారణాసి, దక్షిణ వారణాసి, వారణాసి కంటోన్మెంట్, రోహనియా, సేవాపురి ఉన్నాయి.
 
 వారణాసి (ఉత్తర, దక్షిణ, కంటోన్మెంట్) సెగ్మెంట్లు మూడింటినీ 2012లో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకుంది. సేవాపురిని సమాజ్‌వాదీ పార్టీ, రోహనియాను అప్నాదళ్ గెలుచుకున్నాయి. మోడీ గెలుపు కోసం మార్గాన్ని సుగమం చేసేందుకు అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ బృందం రోహనియా సిట్టింగ్ ఎమ్మెల్యే, అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్‌తో పొత్తు కుదుర్చుకుంది.
 
 పొత్తులో భాగంగా బీజేపీ ప్రతాప్‌గఢ్, మీర్జాపూర్ (ఎస్సీ) లోక్‌సభ స్థానాలను అప్నాదళ్‌కు విడిచిపెట్టింది. సేవాపురి, రోహనియా సెగ్మెంట్లలో బీజేపీ ఉనికి నామమాత్రం. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు చోట్లా బీజేపీ నాలుగో స్థానానికి పరిమితమైంది. అప్నాదళ్ నేత అనుప్రియా పటేల్ ఓబీసీ అయిన కుర్మీ వర్గానికి చెందిన నేత కావడంతో, పొత్తు ఫలితంగా ఈ ప్రాంతంలో కుర్మీ వర్గానికి చెందిన 1.50 లక్షల ఓట్లు మోడీ ఖాతాలో పడగలవని బీజేపీ భావిస్తోంది. దక్షిణ వారణాసికి చెందిన కాంగ్రెస్ నేత దయాశంకర్ మిశ్రా అలియాస్ దయాళును అమిత్ షా బృందం బీజేపీ వైపు మళ్లించింది. అసెంబ్లీ ఎన్నికల్లో దయాళు ఓటమి చెందినా, గెలుపొందిన బీజేపీ అభ్యర్థికి గట్టిపోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు.
 
వారణాసి లోక్‌సభ స్థానంలో ప్రజల ధోరణిని గమనిస్తే, బీజేపీ పట్ల ఓటర్లు పెద్దగా సానుకూలత వ్యక్తం చేయడం లేదు. అయితే మోడీని ఇక్కడి నుంచి గెలిపిస్తే, ఆయన ద్వారా వారణాసిలో కొంత మేరకు ‘అభివృద్ధి’ సాధ్యపడుతుందని మాత్రం భావిస్తున్నారు. వారణాసి అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన నగరమే అయినా ఇక్కడ తగిన విద్యుత్తు, రహదారులు, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు లేవని, మోడీ ప్రధాని పదవి చేపడితే పరిస్థితిలో మార్పు రాగలదని వారణాసికి చెందిన ఒక పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు.
 
 ఇక్కడ మోడీకి గెలుపు మాత్రం నల్లేరుపై నడక కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇక్కడి నుంచి బరిలోకి దించిన అజయ్ రాయ్‌కి వారణాసి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ఈయన ప్రస్తుతం వారణాసి జిల్లాలోని పిండ్రా అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది వారణాసి లోక్‌సభ స్థానం పరిధిలో లేకున్నా, వారణాసి ప్రజలు అజయ్‌ని స్థానికుడిగానే గుర్తిస్తారు. భూమిహార్ బ్రాహ్మణ వర్గానికి చెందిన అజయ్‌కి గల అంగబలం కారణంగా ఆయనకు స్థానికంగా ‘బాహుబలి’గా గుర్తింపు ఉంది. వారణాసిలో బ్రాహ్మణుల జనాభా గణనీయంగా ఉన్నందున ఇది కూడా అజయ్ కలిసొచ్చే అవకాశం ఉంది. బ్రాహ్మణుడైన మురళీమనోహర్ జోషీకి ఈసారి పార్టీకి అంతగా పట్టులేని కాన్పూర్ స్థానాన్ని కేటాయించడంతో ఇక్కడి బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌పై విద్యార్థులు, యువకులు, మేధావుల్లో ఆదరణ కనిపిస్తోంది.
 
చక్రం తిప్పనున్న ‘డాన్’
 వారణాసి బరి నుంచి వైదొలిగిన ఖ్వామీ ఏక్తా పార్టీ అధినేత, మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, ఈ ఎన్నికల్లో చక్రం తిప్పనున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే అయిన ముఖ్తార్ ప్రస్తుతం అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉన్నారు. వారణాసి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తొలుత ప్రకటించినా తర్వాత తప్పుకున్నారు. అయినా ఈయన ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోడీకి వ్యతిరేకంగా లౌకిక అభ్యర్థికి మద్దతిస్తామని ఈ ‘డాన్’ చెబుతున్నారు.
 
 అయితే, కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌తో ముఖ్తార్ అన్సారీకి పాత స్పర్థలు ఉన్నాయి. వారణాసిలో ఇద్దరికీ గ్యాంగులు ఉన్నాయి. తాజా పరిస్థితుల్లో ‘ఆప్’ లేదా కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీకి అన్సారీ మద్దతు ప్రకటించే సూచనలు ఉన్నాయి. పాత గొడవలను పక్కనపెట్టి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తే మోడీకి గట్టి పోటీ తప్పదు. దేశంలో మిగిలిన అన్ని చోట్లా పోలింగ్ ముగిశాక, తుది విడతలో మే 12న ఇక్కడ పోలింగ్ జరగనున్నందున, ఇక్కడి ఫలితాలపై ఇప్పటిదాకా వెలువడ్డ అంచనాలు తారుమారయ్యే అవకాశాలూ లేకపోలేదు.
 
వారణాసి లోక్‌సభ స్థానానికి  ప్రాతినిధ్యం వహించిన నేతలు
 1977: చంద్రశేఖర్, జనతా పార్టీ
 1980: కమలాపతి త్రిపాఠీ, కాంగ్రెస్(ఐ)
 1984: శ్యామ్‌లాల్ యాదవ్, కాంగ్రెస్
 1989: అనిల్ శాస్త్రి, జనతాదళ్
 1991: శిరీష్‌చంద్ర దీక్షిత్, బీజేపీ
 1996: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ
 1998: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ
 1999: శంకర్‌ప్రసాద్ జైస్వాల్, బీజేపీ
 2004: డాక్టర్ రాజేశ్‌కుమార్ మిశ్రా, కాంగ్రెస్
 2009: డాక్టర్ మురళీమనోహర్ జోషీ, బీజేపీ

మరిన్ని వార్తలు