వ్యూహం ఫలించింది.. విజయం వరించింది

18 May, 2014 00:46 IST|Sakshi
వ్యూహం ఫలించింది.. విజయం వరించింది

 సాక్షి, రంగారెడ్డి జిల్లా : కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఇరువురు నేతలు.. అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి... జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అయితే వారి గెలుపు వెనుక ఉన్న శ్రమ అంతా ఇంతా కాదు. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో దిగిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది చివర్లో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ అంతకు ఏడాది ముందు నుంచే పరోక్షంగా రాజకీయాల్లో ఉండి పరిస్థితులను సమీక్షిస్తూ వచ్చారు. అంతేకాకుండా చేవెళ్ల తన సొంతగడ్డ అంటూ ప్రజల్లోకి వెళ్లి స్థానిక నేతలతో మమేకం కావడంతో పాటు ప్రత్యేకించి కొందరు యువకులతో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం చేయించారు.
 
 ఇలా ఎన్నికలకు ముందే పార్లమెంటు సెగ్మెంటులోని ప్రాంతాలపై అవగాహన పెంచుకున్న విశ్వేశ్వర్.. చేవెళ్లలో గులాభి దళపతి సమక్షంలో పార్టీలో చేరారు. అదే సమయంలో కేసీఆర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించడంతో గెలుపు కోసం క్షేత్రస్థాయిలో కార్యాచరణకు దిగారు. ఆ తర్వాత ఎన్నికల సమయంలో సతీమణితో పాటు బంధువర్గాన్ని ప్రచారంలోకి దింపి ఓటర్లను ఆకర్షించడంతో సఫలీకృతులయ్యారు. పెద్దగా ప్రభావం లేని టీఆర్‌ఎస్ పార్టీని పటిష్టపరుస్తూ తన గెలుపునకు బాటలు వేసుకున్నారు. మరోవైపు తెలంగాణ సెంటిమెంటు కలిసి రావడంతో పాటు సోషల్ మీడియా తదితర టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకున్నారు. చివరకు అనుకున్నట్లుగా భారీ మెజార్టీతో బలమైన పార్టీలకు చెందిన ప్రత్యర్థులను మట్టికరిపించారు.
 
 సమన్వయం మల్లారెడ్డి విజయ రహస్యం...
 మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన చామకూర మల్లారెడ్డి సీఎంఆర్ విద్యాసంస్థల చైర్మన్. ఈ నేపథ్యంలో కొన్ని వర్గాలకు సుపరిచితులైనప్పటికీ రాజకీయాల్లోకి రావడం కొత్తే. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. పూర్తిగా పట్టణ నియోజకవర్గం కావడం.. టీడీపీకి పట్టున్న ప్రాంతం.. మరోవైపు మోడీ గాలి.. వెరసి మల్లారెడ్డి విజయానికి మార్గం సుగమమైంది. అయితే ఇక్కడ పోటీచేసిన అభ్యర్థులంతా బడా నేతలే. స్థానికంగా బలమైన నేత మైనంపల్లి హన్మంతరావు, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి, లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ప్రముఖుల ఎదుర్కొని చివరకు మల్లారెడ్డి విజయం సాధించారు. పార్టీకి కొత్త అయినప్పటికీ.. నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అధినేతతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం ఆయనకు కలిసివచ్చిన అంశం. మరో వైపు పార్టీ శ్రేణులను, అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. మొత్తంమీద 30వేల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించారు.

మరిన్ని వార్తలు