గులాబీ ముళ్లు

7 Apr, 2014 09:37 IST|Sakshi
కోరుకంటి చందర్

టీఆర్‌ఎస్‌లో టిక్కెట్ల లొల్లి మొదలైంది. 13 అసెంబ్లీ స్థానాలకు 12 చోట్ల అభ్యర్థిత్వాలను కేసీఆర్ ప్రకటించిన వెంటనే పార్టీలో అసమ్మతి రాజుకుంది. తాము ఆశించిన సీట్లను మరొకరికి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని అసమ్మతి నేతలు, అభ్యర్థులతో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీలో ఉండటానికి కొంతమంది ప్రయత్నిస్తుండగా, మరికొందరు పార్టీలోనే ఉంటూ అభ్యర్థిని ఓడించడానికి తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు.

 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: జిల్లాలోని రామగుండం, పెద్దపల్లి, మంథని, మానకొండూరు, కోరుట్ల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికపై నేతల్లో అసంతృప్తి పెరిగిపోయింది. రామగుండంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు అవకాశం ఇవ్వగా, నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కోరుకంటి చందర్ రెబెల్‌గా బరిలో ఉండాలని నిర్ణయించుకున్నారు.

అభ్యర్థుల జాబితా విడుదల కాగానే కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల మేరకు రెబెల్‌గా పోటీలో ఉంటున్నట్లు ప్రకటించారు. 2009లో చందర్ టీఆర్‌ఎస్ నుంచి మహాకూటమి అభ్యర్థిగా పోటీచేయగా, సోమారపు సత్యనారాయణ రెబెల్‌గా బరిలోకి దిగారు. ఎన్నికల అనంతరమే 2014లో పార్టీ టికెట్ కోరుకంటి చందర్‌కు ఇస్తామని అప్పట్లో పార్టీ ప్రకటించింది కూడా. చివరకు చందర్‌కు పార్టీ మొండిచేయి చూపి, సత్యనారాయణకు టికెట్ ఇవ్వడంతో 2009 నాటి పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం కనిపిస్తోంది.
 పెద్దపల్లిలో పరిస్థితి మరోరకంగా ఉంది.

 అక్కడినుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి టికెట్‌ను ఆశించారు. పార్టీ హైకమాండ్ మాత్రం దాసరి మనోహర్‌రెడ్డి వైపే మొగ్గుచూపింది. దీంతో ఈద కూడా అసమ్మతితో రగిలిపోతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోతే ఆయన దాసరికి మద్దతు పలకడం అనుమానమే. మానకొండూరులో టికెట్ తనకే ఖాయమనుకొని ధీమాగా ఉన్న నియోజకవర్గ ఇన్‌చార్జి ఓరుగంటి ఆనంద్ అనూహ్యంగా తెరపైకి రసమయి బాలకిషన్ రావడంతో ఖంగుతిన్నారు.

రసమయి బాలకిషన్‌కు టికెట్ ఇవ్వడంతో ఆనంద్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరిన పుట్ట మధుకు మంథని టిక్కెట్ కేటాయించడంతో అప్పటివరకు టిక్కెట్ ఆశించిన చందుపట్ల సునీల్‌రెడ్డి రెబెల్‌గా పోటీలో ఉంటానంటున్నారు. ఈ నెల 4నే ఆయన నామినేషన్ సైతం సమర్పించారు. కోరుట్లలో ఆ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు తుల ఉమ టికెట్ ఆశించారు. అయితే జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆమెను కథలాపూర్ నుంచి పార్టీ బరిలోకి దింపింది. కానీ స్థానికంగా టీఆర్‌ఎస్ ముఖ్యనేతలు సహకరించడం లేదనే అసంతృప్తి ఇతర నేతల్లో నెలకొంది. ఇది ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం ఉన్నట్లు పరిశీలకుల అంచనా.


 ఇక చొప్పదండి టికెట్ ప్రకటించగానే అసమ్మతి వెల్లువెత్తే అవకాశం ఉందని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. అభ్యర్థుల జాబితా వెల్లడితో టీఆర్‌ఎస్‌లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న అసమ్మతిరాగం, అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుందా అనే కోణంలో పార్టీ అగ్రనాయకులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.


 ముందుజాగ్రత్తగా అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు కేసీఆర్ కుటుంబసభ్యులు, పార్టీ సీనియర్లు రంగంలోకి దిగినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, ఏదో ఒకరకంగా టికెట్ రాని లోటును భర్తీ చేస్తామని అసమ్మతి నేతలకు తాయిలాల గాలం వేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసమ్మతిని ఆదిలోనే అధిష్టానం తుంచి వేస్తుందా లేక అభ్యర్థులను పుట్టిముంచే స్థాయికి చేరుకుంటుందా అనే మీమాంసలో పార్టీ శ్రేణులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు