సొంతగడ్డలో బొమ్మా...బొరుసు!

3 May, 2014 01:38 IST|Sakshi
సొంతగడ్డలో బొమ్మా...బొరుసు!
  •  తండ్రికి పట్టాభిషేకం..
  •   తనయుడికి పరాభవం..
  •   గుడివాడలో ఎన్టీఆర్ వారసత్వం
  •  సాక్షి, మచిలీపట్నం : ఓటరు దేవుళ్ల కరుణాకటాక్ష వీక్షణలు ఎప్పుడు ఎవరిపై ఎలా ప్రసరిస్తాయన్నది చెప్పడం కష్టమే. అందులోనూ సొంతగడ్డలో జనాధరణ ఎలా ఉందనేది మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు సైతం ఆసక్తిగా గమనిస్తుంటారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు గడించిన నందమూరి తారక రామారావును పార్టీ పెట్టిన తొలినాళ్లలో బాగా ఆదరించిన గుడివాడ ఆ తరువాత అంతగా ఆదరించలేదనిభావన.   హరికృష్ణను అయితే నాలుగో స్థానానికే పరిమితం చేసి...సొంత గడ్డలో ఎన్టీఆర్ వారసులకు ఇమేజ్ తగ్గిందనే సంగతిని  రుజువు చేశారు.
     
    హరికృష్ణకు నాలుగో స్థానం!
     
    ఎన్టీఆర్ మరో తనయుడు నందమూరి హరికష్ణకు గుడివాడ ప్రాంతంతో అనుబంధం ఉంది. చిన్నప్పటినుంచి స్వగ్రామం నిమ్మకూరులో తాతగారి వద్దనే ఆయన ఉండేవారు. పదో తరగతి వరకు హరికృష్ణ అక్కడే చదువుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తరువాత  చైతన్య రథానికి హరికృష్ణ సార థి(డ్రైవర్)గా వ్యవహరించారు. ఎన్టీఆర్ మరణానంతరం  టీడీపీ నుంచి బయటకు వచ్చిన హరికృష్ణ పెద్ద బావగారైన డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించారు.  1999 ఎన్నికల్లో హరికృష్ణ గుడివాడ నుంచి పోటీచేసి పరాజయం పొందారు.

    ఈ ఎన్నికల్లో ఆయనకు నాల్గవ స్థానం దక్కింది.  తరువాత  హరికృష్ణ టీడీపీలో చేరి, పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడై, రాజ్యసభ సభ్యునిగా కూడా ఎన్నికయ్యూరు. సమైక్యాంధ్ర కోసం తన ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఆయన ఒక్కడి రాజీనామానే హడావిడిగా ఆమోదించడం వెనుక చంద్రబాబు హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. తన తండ్రి ఎన్టీఆర్ పురుటిగడ్డ నిమ్మకూరు నుంచి సమైక్యాంధ్ర బస్సుయాత్రను నిర్వహిస్తానని ప్రకటించిన హరికృష్ణ.... కుటుంబీకుల వత్తిడితో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్టు ప్రచారం జరిగింది.  
     
    గతంలోకి ఓమారు....

    తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పార్టీ  స్థాపించిన తొలి ఎన్నికల్లో సొంతగడ్డ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేశారు. ఆయన స్వగ్రామం నిమ్మకూరు, అత్తవారి ఊరు కొమరవోలు గ్రామాలు అప్పట్లో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. 2009 ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో ఎన్టీఆర్ సొంత గ్రామం, అత్తగారి ఊరు రెండు ఇప్పుడు పామర్రు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చాయి.

    కాగా, 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ తొలిసారిగా గుడివాడ నుంచి పోటీ చేశారు. పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడంతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ గుడివాడ నియోజకవర్గంలో తండ్రి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. తరువాత 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లోనూ ఎన్టీ రామారావు గుడివాడ నుంచి పోటీచేశారు.  
     
    రెండోసారి ఎన్టీఆర్‌కు తగ్గిన మెజార్టీ..

    గుడివాడ నియోజకవర్గంలో జయకృష్ణ ప్రచారం నిర్వహించినప్పటికీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్‌కు 53,906ఓట్లురాగా, కఠారి సత్యనారాయణరావు (కాంగ్రెస్) 27,368ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ 26,538ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, 1985ఎన్నికల్లో ఇదే గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్‌కు 49,600ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి ఉప్పలపాటి సూర్యనారయణబాబు(కాంగ్రెస్)కు 42,003ఓట్లు వచ్చాయి. దీంతో 1985ఎన్నికల్లో ఇక్కడ ఎన్టీఆర్ 7,597ఓట్ల మేజార్టీతో మాత్రమే  గెలుపొందారు. తొలి ఎన్నికల కంటే రెండవ సారి పోటీలో దాదాపు 20వేల ఓట్ల మెజార్టీ తగ్గిపోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు