సీట్లు మాకు.. బీ ఫారాలు మీకా?: వెంకయ్యనాయుడు

22 Apr, 2014 05:45 IST|Sakshi
సీట్లు మాకు.. బీ ఫారాలు మీకా?: వెంకయ్యనాయుడు

 టీడీపీ తీరు సరికాదు: వెంకయ్య
 సాక్షి, విజయవాడ: పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించి తమకు కేటాయించిన స్థానాల్లో బరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవాల్సిందేనని బీజేపీ అగ్రనేత ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో బీజేపీకి కేటాయించిన మూడు సీట్లలో టీడీపీ అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం ఆ పార్టీ చేసిన తప్పిదమన్నారు. టీడీపీ నేతలు వారితో నామినేషన్లు ఉపసంహరింపచేయాలని సూచించారు. సోమవారం విజయవాడలో ‘మీట్ ద ప్రెస్’లో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ను వీడాకే జగన్‌పై సీబీఐ దాడులు

కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ, ఐబీ, ఎలక్షన్ కమిషన్ లాంటి వాటి ప్రతిష్టను దిగజార్చిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం ఆయనపై కేసులు పెట్టలేదని, కాంగ్రెస్ నుంచి బయటకు రాగానే ఆయనపై సీబీఐ దాడులు చేయించి అరెస్టు చేయించారని గుర్తు చేశారు. సీబీఐ, ఐబీ సంస్థలను ప్రయోగించి గుజరాత్ సీఎం నరేంద్రమోడీని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారని చెప్పారు. హైదరాబాద్ అందరిదని, అక్కడ ఉన్నవారంతా హైదరాబాదీయులేనని చెప్పారు. దేశ ప్రజలు ఎవరైనా ఎక్కడైనా నివసించవచ్చన్నారు. ఇటలీకి చెందిన వారు  దేశాన్ని ఏలవచ్చు కానీ ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్ వచ్చి ఉండకూడదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో దేశం అధోగతి పాలైందన్నారు. రూపాయి విలువ క్షీణించిందన్నారు. దేశంలో తీవ్రవాద ం, చొరబాట్లు పెరిగిపోయి అంతర్జాతీయంగా ప్రతిష్ట దెబ్బతిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో దేశంలో ఒకే కుటుంబానికి చెందిన వారిపేర్లు 650 ప్రాజెక్టులకు, పథకాలకు పెట్టారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే వీటిని సమీక్షించి దేశ ప్రముఖుల అందరి పేర్లు వాటికి పెడతామని చెప్పారు. గుంటూరు, విజయవాడ మధ్య ఎనిమిది లైన్ల రహదారితోపాటు కోస్తా తీరం వెంబడి జాతీయ రహదారి, పోర్టులు అభివృద్ధి తదితర ప్రాజెక్టులు తాము చేపడతామని ప్రకటించారు. విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే నాయకులు సోమసుందరం, ఆంజనేయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు