ఓటుకు వేళాయె..

6 Apr, 2014 02:23 IST|Sakshi

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ తొలి విడత ఎన్నికలు ఆదివారం జగిత్యాల, పెద్దపల్లి, మంథని డివిజన్లలో జరగనున్నాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తుండగా, మంథని డివిజన్‌లో మాత్రం గంట ముందే ముగించనున్నారు. 30 జెడ్పీటీసీ స్థానాలకు 183 మంది, 403 ఎంపీటీసీ స్థానాలకు 1,790 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు.
 

409 ఎంపీటీసీ స్థానాలకు ఆరు స్థానాలు ఏకగ్రీవం కావడంతో, 403 స్థానాల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఏకగ్రీవమైన స్థానాల్లో జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రం మాత్రమే ఉంటుంది. తొలివిడతలో 1,294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 502 సమస్యాత్మక, 170 అతి సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. 10,16,165 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడత పోలింగ్‌కు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం రాత్రికే పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకున్నారు.
 
 ఎన్నికలు జరిగే మండలాలివే..
 
 మంథని డివిజన్‌లోని ఏడు మండలాలు... మంథని, ముత్తారం, మల్హర్, మహాదేవపూర్, మహాముత్తారం, కాటారం, కమాన్‌పూర్, పెద్దపల్లి డివిజన్ పరిధిలో తొమ్మిది మండలాలు....పెద్దపల్లి, ధర్మారం, వెల్గటూరు, రామగుండం, జూలపల్లి, ఓదెల, ఎలిగేడు, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాల్లో... జగిత్యాల, కోరుట్ల, గొల్లపల్లి, ధర్మపురి, పెగడపల్లి, మేడిపల్లి, మల్యాల, రాయికల్, సారంగాపూర్, మల్లాపూర్, మెట్‌పల్లి, కథలాపూర్, ఇబ్రహీంపట్నం, కొడిమ్యాల మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది.
 
 మంథని డివిజన్‌లో 4 గంటలకే ముగింపు
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ మంథని డివిజన్‌లో సాయంత్రం నాలుగు గంటలకే ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో, మంథని డివిజన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ను సాయంత్రం 4 గంటలకే ముగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఈ కుదింపును ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్‌కు కూడా వర్తింపచేశారు. సాయంత్రం 5 తరువాత బ్యాలెట్ బాక్స్‌లు తీసుకురావడం ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళనతోనే గంట సమయాన్ని కుదించారని అధికారులు వెల్లడించారు. జగిత్యాల, పెద్దపల్లి డివిజన్లలో పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు ఉండగా, మంథని డివిజన్‌లో మాత్రం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకే జరుగనుంది.
 
 పోల్ చిట్టీల పంపిణీ విఫలం

 
 ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో పోల్ చిట్టీల పంపిణీలో దారుణంగా విఫలమైన అధికారులు, ప్రాదేశిక పోరులోనే అదే తీరును కొనసాగించారు. నాలుగు రోజులు ముందు నుంచి పోల్ చిట్టీలు పంచాలని, పోల్ చిట్టీలు అందలేదనే ఫిర్యాదు రావద్దని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సమావేశం పెట్టి హెచ్చరించినా, ఆచరణకు నోచుకోలేదు. పైగా కొన్ని గ్రామాల్లో శనివారం సాయంత్రం గానీ కొత్త ఓటర్ల జాబితా చేరలేదు. ఇటీవల జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఓట్లు తొలగించడం, అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకోవడంతో అసలు తమ ఓటు ఉందా లేదా తెలియని గందరగోళ పరిస్థితి పల్లెల్లో నెలకొంది. కనీసం ఓటర్ల జాబితాలో చూద్దామన్నా అందుబాటులో లేదు. మీసేవలో ఆన్‌లైన్‌లో చూద్దామంటే కరెంట్ లేదు. దీంతో పోల్ చిట్టీల మాట దేవుడెరుగు, కనీసం ఓటర్ల జాబితాను కూడా పంపించలేని అధికారుల తీరుపై ఓటర్లు మండిపడుతున్నారు.
 
 ఫిర్యాదులుంటే చెప్పండి
 
 ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులుంటే నేరుగా తనకు 8179024803 నెంబర్‌కు ఫోన్ చేయాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు సి.పార్థసారథి తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించినా, ఇతర అభ్యంతరకర అంశాలుంటే తమకు తెలియచేయాలని, వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వార్తలు