నంద్యాల ఓటరు లెక్కతప్పింది!

19 May, 2014 00:16 IST|Sakshi
నంద్యాల ఓటరు లెక్కతప్పింది!

 నంద్యాల, న్యూస్‌లైన్ : మూడు దశాబ్ధాల తర్వాత నంద్యాల ఓటర్ల లెక్కతప్పింది. ప్రతిసారి నంద్యాల నియోజకవర్గంలో అధికార పక్షానికి పట్టం కట్టడం సంప్రదాయంగా వస్తుండేది. అయితే ఈ సారి మాత్రం ఓటర్లు భిన్నంగా తీర్పు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎన్నికలు రెండు ప్రధాన సెంటిమెంట్లు ఉన్నాయి. ఈసారి అందులో ఒకటి విఫలం కాగా మరొకటి సఫలమైంది.

 ఫలితం తారుమారైంది
 నంద్యాల ఎమ్మెల్యేగా ఏ పార్టీకి చెందిన వారు గెలుపొందితే అదే పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుండేది. 1983, 1985, 1994, 1999 ఎన్నికల్లో నంద్యాల నుంచి టీడీపీ అభ్యర్థులు సంజీవరెడ్డి, ఫరూక్ గెలుపొందగా రాష్ట్రంలో ఎన్‌టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా కొనసాగారు. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికంగా గెలుపొందగా రాష్ట్రంలో కూడా ఇదే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏడు ఎన్నికలు తర్వాత మొదటి సారి సెంటిమెంట్‌ను స్థానిక ఓటర్లు తిరగరాశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోగా నంద్యాలలో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్థి భూమానాగిరెడ్డి విజయం సాధించారు.
 
 హ్యాట్రిక్ ఎమ్మెల్యే లేనేలేడు
 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేనే లేడు. నియోజకవర్గం మొదటి ఎమ్మెల్యే మల్లు రామచంద్రారెడ్డి, ఫరూక్, బొజ్జా వెంకటరెడ్డి రెండు సార్లు వరుసగా గెలుపొంది మూడోసారి ఓడిపోయారు. ఈ సారి చరిత్ర తిరగరాయాలని శిల్పామోహన్‌రెడ్డి ప్రయత్నం చేశారు. ఆయన రెండుసార్లు వరుసగా గెలుపొందారు. అయినా మూడోసారి ఓటమి చూడక తప్పలేదు. దీంతో హ్యాట్రిక్ మిస్ అయినా నాయకుల్లో శిల్పా కూడా చేరారు.

మరిన్ని వార్తలు