వారం ఆగాల్సిందే

2 Apr, 2014 02:34 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : పుర ఎన్నికల ఫలితాల కోసం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గత నెల 30న జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలు జరిగాయి. సార్వత్రిక ఎన్నికలపై ఈ ఫలితాలు ప్రభావం చూపుతాయని, వాటి ఫలితాలను వాయిదా వేయాలని కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న కౌంటింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడ్డాయి.
 
 ఈ నెల 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించాలని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులతో పాటు ప్రజానీకానికి మరో వారం పాటు టెన్షన్ తప్పదు. జిల్లాలో నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, వెంకటగిరి, ఆత్మకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాల్టీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ప్రధాన రాజకీయపార్టీల మధ్య హోరాహోరీగా పోరులో విజయాలు ఎవరిని వరిస్తాయో తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంది. జిల్లాలో ఏ నలుగురు ఒకచోట కలిసినా ఎన్నికల ఫలితాలపైనే చర్చ జరుగుతోంది.

 మరోవైపు ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌రూంల వద్ద బందోబస్తు పోలీసులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది ఎప్పుడెప్పుడు తమ బాధ్యతలు పూర్తవుతాయా అని ఎదురుచూస్తున్నారు.  ఇదిలా ఉండగా  మరి కొద్ది రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల పర్వం పూర్తయిందనిపిస్తే ఆ తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం ఈ తంతు త్వరగా ముగించాలని చూస్తోంది. అయితే మరో వారంకైనా ఫలితాలు విడుదలవుతాయా? లేక సుప్రీంకోర్టులో అడ్డంకి ఏర్పడుతుందా అనే అనుమానం లేకపోలేదు.
 

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా