ఇచ్చి పుచ్చుకుందాం.. రా!

26 Apr, 2014 04:08 IST|Sakshi
ఇచ్చి పుచ్చుకుందాం.. రా!

 పాలకొండ, న్యూస్‌లైన్, ‘ఈసారి నీ పాత నియోజకవర్గంలో నన్ను గెలిపించు.. నా పాత నియోజకవర్గంలో నిన్ను గెలిపించేందుకు కృషి చేస్తా..’
 
 -ఇదీ మాజీ మంత్రులు కళావెంకటరావు, కోండ్రు మురళిల మధ్య కుదిరిన అవగాహన.‘ఈసారి నేను గెలవటం డౌటే.. నా గురువు కిశోర్‌చంద్రదేవ్ ఎంపీగా గెలవడమే ముఖ్యం. అందుకే నీకు సాయం చేస్తా. బదులుగా ఎంపీ ఓట్లు మాకు పడేలా చెయ్యి..’

 -ఇదీ పాలకొండ కాంగ్రెస్ అభ్యర్థి నిమ్మక సుగ్రీవులు, టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు ఇచ్చిన ఆఫర్.

 ‘నియోజకవర్గంలోని కాళింగుల ఓట్లు ఈసారి నాకు పడేలా చేస్తే.. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించేలా చేస్తా. లేదంటే మీ కోరిక ఏంటో చెబితే మా అధినేతతో చెప్పి తీరేలా చేస్తా. ఇంకా కాదంటే మీ కులం ఓట్లకు రేటు చెప్పు.. ఇప్పిస్తా..’

 -ఇదీ టెక్కలి కాంగ్రెస్ అభ్యర్థి  కిల్లి రామ్మోహన్‌రావుకు టీడీపీ అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు ఇచ్చిన బంపర్ ఆఫర్.! జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఇలా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీయటమే లక్ష్యంగా సాగుతున్న ఈ అనైతిక వ్యవహారంపై ఆ రెండు పార్టీల కార్యకర్తలు భగ్గుమంటున్నారు. దీనివల్ల రెండు పార్టీలకు తీవ్ర నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. దీనిపై వారి హెచ్చరికలను మ్యాచ్ ఫిక్సింగ్ నేతలు బేఖాతరు చేస్తున్నారు.

 టెక్కలిలో వెలమ కులానికి చెందిన అచ్చెన్నాయుడికి కులసమీకరణాల ప్రకారం తగినంత బలం లేదు. ఈ నియోజకవర్గంలో కాళింగ సామాజికవర్గానిది నిర్ణయాత్మక శక్తి. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఆ సామాజిక వర్గానికి చెందినవారు కావటంతో అచ్చెన్నను ఓటమి భయం వెన్నాడుతోంది. అర దుకే కాళింగ సామాజిక వర్గానికే చెందిన కాంగ్రెస్ అభ్యర్థి కిల్లి రామ్మోహనరావుతో ఫిక్సింగ్‌కు సిద్ధపడ్డారు.

 ఈసారి సాయం చేస్తే రానున్న ఎన్నికల్లో టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును సూచిస్తానని, లేదంటే ఓట్లు వేయించేందుకు రేటు చెప్తే సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. అచ్చెన్నను నమ్మితే కొంప మునగటం ఖాయమని కొందరు, సొమ్ము చేసుకునేందుకు ఇదే మంచి అవకాశమని మరికొందరు చెబుతుండటంతో రామ్మోహనరావు సంకట స్థితిలో ఉన్నారని తెలుస్తోంది. అయితే అచ్చెన్నకు సాయం చేసేందుకు కాళింగ సామాజికవర్గ నేతలు ససేమిరా అంటున్నారు.

 మ్యాచ్ ఫిక్సింగ్‌కు రామ్మోహనరావు ఒప్పుకున్నా వీరు సహకరించే అవకాశం కనిపించటం లేదు.పాలకొండలో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి సుగ్రీవులు కంకణం కట్టుకున్నట్టు సమాచారం. తన గురువు, కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ అరకు ఎంపీగా గెలవడమే తనకు ప్రధానమని ఆయన చెబుతున్నారు. సుగ్రీవులు ప్రతిపాదనకు టీడీపీ అభ్యర్థి జయకృష్ణ కూడా అంగీకరించారని తెలుస్తోంది.

 ఎంపీ ఓట్లను కిశోర్‌దేవ్‌కు వేయిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి జయకృష్ణ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నట్లు సమాచారం.ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి కళా వెంకటరావు.. రాజాం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి కోండ్రు మురళీ ఇప్పటికే ఫిక్సింగ్‌పై అవగాహనకొచ్చినట్టు ఆ రెండు పార్టీలవారే చెబుతున్నారు. 2004లో ఎచ్చెర్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మురళి సహకారం తీసుకుని గట్టెక్కాలని కళా భావిస్తున్నారు.

అందుకు ప్రతిగా రాజాంలో మురళి గెలుపునకు సహకరించాలని నిర్ణయించుకున్నారు. గతంలో కళా ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గం పరిధిలో రాజాం ప్రాంతం ఉండటమే దీనికి కారణం. ఇదిలా ఉండగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఫిక్సింగ్‌కు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

Read latest Elections-2014 News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి