హతవిధీ..!

14 May, 2014 03:36 IST|Sakshi

గద్వాల/నాగర్‌కర్నూల్, న్యూస్‌లైన్: తాజా మాజీఎమ్మెల్యేల సొంత మండలాల్లో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు ఆధిక్యతను చాటుకోలేక చతికిలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ప్రాదేశిక పోరులో ఎదురుగాలి తప్పలేదు. మంగళవారం వెలువడిన ఫలితాల్లో గద్వాల నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం 69 ఎంపీటీసీ స్థానాలకు గాను 47 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
 
 మాజీమంత్రి డీకే.అరుణ ప్రాతినిథ్యం ఇక్కడి నుంచి పట్టణంలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్‌కు మండలాల్లో ఎదురుగాలి వీచింది. నాలుగు మండలాల్లోరి అన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఆధిక్యం చూపిన టీఆర్‌ఎస్ నాలుగు ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకుంది. గద్వాల, ధరూరు, గట్టు జెడ్పీటీసీ స్థానాలను గులాబీదళం నిలబెట్టుకుంది.
 
 కాంగ్రెస్ కేవలం మల్దకల్ జెడ్పీటీసీ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
 నారాయణపేట తాజా మాజీ ఎమ్మెల్యే వై.ఎల్లారెడ్డి సొంత మండలం ఊట్కూర్‌లో టీఆర్‌ఎస్‌కు ఎదురుగాలి వీచింది. జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ హస్తగం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థిగా సూర్యప్రకాష్‌రెడ్డి 5,350 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
 కల్వకుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే సొంత మండలం తలకొండపల్లి జెడ్పీటీసీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పి.నరసింహా సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌పై 1719 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మండలంలో మొత్తం 14 ఎంటీసీ స్థానాలకు 10 కాంగ్రెస్ , నాలు టీఆర్‌ఎస్‌లు గెలుపొందాయి.
 
 దేవరకద్ర, మక్తల్ తాజా మాజీ ఎమ్మెల్యేలు సీతమ్మ, కె.దయాకర్‌రెడ్డి సొంత మండలం చిన్నచింతకుంటలో టీడీపీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగలింది. జెడ్పీటీసీ సభ్యురాలిగా టీఆర్‌ఎస్ అభ్యర్థి వడ్డెమాన్ లక్ష్మి ఘనవిజయం సాధించారు. నారాయణపేటలో రాత్రి వరకు హోరాహోరీగా  ఉత్కంఠభరితంగా జరిగిన ఓట్ల లెక్కింపులో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అంజనమ్మపై 1084 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తన సత్తాచాటింది. టీఆర్‌ఎస్ ఆరు, కాంగ్రెస్ మూడు, బీజేపీ రెండు, టీడీపీ ఒకటి, ఇండింపెండెంట్లు మరో రెండు స్థానాల్లో విజయం సాధించారు.
 
 నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం, అలంపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే వీఎం అబ్రహాం సొంతమండలం ఇటిక్యాలలో కాంగ్రెస్ విజ యం సాధించింది. కాంగ్రెస్ జె డ్పీటీసీ అభ్యర్థిగా ఖగ్‌నాథ్‌రెడ్డి సమీప టీఆ ర్‌ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. మండలంలో అలాగే కాంగ్రెస్ 11 ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొంది.. ఎంపీపీ సీటును చేజిక్కించుకోనుంది.
 
 నాగం, కూచకుళ్లకు షాక్!
  నాగర్‌కర్నూల్ నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డికి, రెండు దశాబ్దాలుగా రాజకీయ పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీ చైర్మన్‌గా పనిచేసిన కూచకుళ్ల దామోదర్‌రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల్లో
 ఎదురుదెబ్బ తగిలింది. గతంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని ఐదు జెడ్పీటీసీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్‌కు, ఒకటి టీడీపీకి ఉండగా, ప్రస్తుతం ఎన్నికల్లో కాంగ్రెస్ రెండుస్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. మిగతా మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్ పాగావేసింది. నాగం పార్టీ బీజేపీకి ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు.
 
 ఎంపీపీల విషయానికి వస్తే గతంలో మూడు కాంగ్రెస్‌కు కాగా, రెండుస్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ప్రస్తుతం టీడీపీ గానీ, నాగం ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీకి గానీ ఒక్కస్థానం కూడా దక్కే పరిస్థితి లేదు. రాత్రి పొద్దుపోయే వరకు తెలిసిన ఫలితాల మేరకు నాగర్‌కర్నూల్ స్థానం కాంగ్రెస్‌కు ఎంపీపీ స్పష్టమైన మెజార్టీ కాగా, తాడూరు, తిమ్మాజీపేట మండలాల్లో టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బిజినేపల్లి, తెలకపల్లిలో హంగ్ ఏర్పడింది.
 
 కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి సూదిని జైపాల్‌రెడ్డి సొంత మండలం.. మాడ్గుల జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి పడగాల రవి సమీప కాంగ్రెస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిపై 480 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మాడ్గుల మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పును ఏ ఒక్క పార్టీకి అనుకూలంగా కాకుండా మిశ్రమఫలితాలను ఇచ్చారు.
 
 తాజా మాజీ ఎమ్మెల్యే పి.రాములు ప్రాతినిథ్యం వహిస్తున్న అచ్చంపేట నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఆరు జెడ్పీటీసీ, 71 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. బల్మూరు, ఉప్పునుంతల, అమ్రాబాద్, వంగూరు జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా, అచ్చంపేట టీడీపీ, లింగాల జెడ్పీటీసీ స్థానాన్ని టీఆర్‌ఎస్ అభ్యర్థి చేజిక్కించుకున్నారు.
 

మరిన్ని వార్తలు