సీమాంధ్రకు వైఎస్ జగనే సీఎం: కేసీఆర్

9 May, 2014 16:30 IST|Sakshi
సీమాంధ్రకు వైఎస్ జగనే సీఎం: కేసీఆర్

హైదరాబాద్: సీమాంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కె. చంద్రశేఖరరావు అన్నారు. ఏపీలో జగన్ సీఎం కాబోతున్నారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వందకుపై అసెంబ్లీ సీట్లు వస్తాయని తమ సర్వేలో తేలిందన్నారు. సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. సీమాంధ్రతో అనేక సమస్యలతో చర్చించుకోవాల్సివుంటుందన్నారు. చంద్రబాబు నాయుడు కథ ముగిసిందన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో టీడీపీ మట్టికరవడం ఖాయమన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అసెంబ్లీ స్థానాలు 23 నుంచి 35 దాటవని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పొలిట్బ్యూరో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఎవరి మద్దతు లేకుండా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. మే 17 తర్వాత  టీఆర్ఎస్ అధికార పార్టీ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ పార్టీ సత్తా చాటుతుందన్నారు. తాము క్యాంపులు పెడుతున్నట్టు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను కేసీఆర్ తోసిపుచ్చారు. క్యాంపులు పెట్టాల్సిన కర్మ తమకు లేదన్నారు. పిచ్చి ప్రచారం మానుకోవాలని హెచ్చరించారు. మీడియా హుందాతనం కాపాడుకోవాలని హితవు పలికారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎట్టిపరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోమన్నారు. కేంద్రంలో తమ మొదటి ప్రాధాన్యత యూపీఏ ప్రభుత్వానికేనని, లేకుంటే థర్డ్‌ ఫ్రంట్‌కు మద్దతిస్తామన్నారు. సోనియా, రాహుల్ గాంధీ పట్ల తమకు వ్యతిరేకత లేదని కేసీఆర్ చెప్పారు. పొన్నాల లక్ష్మయ్య బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగుల విభజన, భవనాల కేటాయింపులు ప్రతిపాదనలే ఇవి ఆఖరి నిర్ణయాలు కాదన్నారు.

>
మరిన్ని వార్తలు