మోడీ మాటలన్నీ గ్యాసే

2 May, 2014 01:18 IST|Sakshi

* మన గ్యాస్‌లో మనకు వాటా ఇవ్వరుగానీ.. మన గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తారట   
* కృష్ణా జిల్లా ‘వైఎస్సార్ జనభేరి’లో జగన్
* రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి బీజేపీ నేతలు, చంద్రబాబు పూర్తిగా మద్దతిచ్చారు
* రాష్ట్రాన్ని విభజించింది తామేనంటూ మొన్నటిదాకా తెలంగాణలో ఓట్లడిగారు
* తెలంగాణలో ఎన్నికలైన రాత్రికి రాత్రే మాట మార్చి.. విభజన కారకుడు జగనేనంటున్నారు
* వాళ్ల మాటలతో చాలా బాధ అనిపించింది
* 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు
* ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా?

‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: బీజేపీ నాయకులు, టీడీపీ అధినేత చంద్రబాబు కలిసి రాష్ట్ర విభజనకు పూర్తిగా మద్దతిచ్చి.. ఇప్పుడు స్వర్గాన్ని తెచ్చి సీమాంధ్రను అద్భుతంగా అభివృద్ధి చేస్తామంటూ అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారని, ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రానికి వీరు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటైనా చెప్పగలరా సూటిగా ప్రశ్నించారు. మొన్నటివరకు తెలంగాణలో తిరుగుతూ తమ వల్లే రాష్ట్ర విభజన జరిగిందంటూ చెప్పుకొన్న నరేంద్ర మోడీ, చంద్రబాబు.. అక్కడ ఎన్నికలైపోయిన రాత్రికి రాత్రే మాట మార్చి విభజనకు కారణం జగనే అంటున్నారని, చెడిపోయిన ఈ రాజకీయాలు చూస్తుంటే చాలా బాధనిపిస్తోందని జగన్ ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘నిన్న తిరుపతి సభలో నరేంద్ర మోడీ గ్యాస్ గురించి మాట్లాడారు. మన రాష్ట్రంలో ఉన్న గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మా రాష్ట్రంలో ఉన్న గ్యాస్ లో.. కనీసం మన రాష్ట్రానికి ఎంత గ్యాస్ కోటా ఇస్తారని మోడీని అడుగుతున్నా. ఆ మాట మాట్లాడరు. కానీ మన వనరులతో దేశాన్ని బాగుపర్చుతామంటున్నారు. ఇటువంటి దొంగ ప్రేమ చూపిస్తున్నారు’’ అని తూర్పారబట్టారు. కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోన్న జగన్ గురువారం పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో రోడ్‌షో నిర్వహించారు. బంటుమిల్లి నుంచి మొదలైన వైఎస్సార్ జనభేరి సింగరాయపాలెం మీదుగా కైకలూరు అక్కడి నుంచి విజయవాడ వరకు సాగింది. దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలకరిస్తూ ముందుకు సాగారు. బంటుమిల్లి, కైకలూరులలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ఆయా సభల్లో జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

తెలంగాణలో ఎన్నికలవగానే మాట మార్చేశారు
‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక రాజకీయాలు చెడిపోయాయి. ఓట్లు, సీట్ల కోసం ఎన్ని అబద్ధాలు ఆడడానికైనా వెనుకాడడంలేదు. ఒక బంగారం లాంటి రాష్ట్రాన్ని నిట్టనిలువునా చీల్చడానికి కూడా వెనుకాడడంలేదు. రాష్ట్రాన్ని సోనియాగాంధీ అడ్డగోలుగా విడగొట్టారు. అలా విడగొడుతుంటే ఇదే చంద్రబాబు, ఇదే బీజేపీ వీరిద్దరూ కూడా రాష్ట్రాన్ని విడగొట్టడం అన్యాయమని చెబుతూనే.. మరోవైపు వీళ్లే పార్లమెంటులో వీళ్ల ఎంపీల చేత విభజనకు అనుకూలంగా ఓట్లు వేయించారు.

తర్వాత బీజేపీ నాయకులు తెలంగాణకు వెళ్లి.. ‘పెద్దమ్మ సోనియాగాంధీ ఒకరేకాదు.. చిన్నమ్మను నన్ను కూడా గుర్తుపెట్టుకోండి.. నేను మద్దతు ఇవ్వకపోతే రాష్ట్ర విభజన జరిగేది కాదు’ అని అన్నారు. ‘మేమిచ్చిన ఆ లేఖతోనే రాష్ట్ర విభజన జరిగింది.. లేకుంటే విభజన జరిగేది కాదు’ అని తెలంగాణ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చంద్రబాబు అన్నారు. 30వ తేదీన అక్కడ ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయి గంట కూడా గడవక ముందే మోడీ, చంద్రబాబు రాత్రి ఏడుకల్లా తిరుపతిలో మీటింగ్ పెట్టారు. రాష్ట్రాన్ని విభజించింది వైఎస్‌ఆర్‌సీపీ అని నిస్సిగ్గుగా మాట్లాడారు.

నాలుగేళ్లుగా కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు..
నిన్న తిరుపతిలో అవినీతి గురించి మాట్లాడారు. కేసుల గురించి చెప్పారు. వీళ్లందరినీ నేను ఒకటే అడుగుతున్నా. వైఎస్ బతికున్నంత వరకు ఆయన్ను మించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. వైఎస్ చనిపోయి 18 నెలలు అయ్యాక జగన్ అనే వ్యక్తి కాంగ్రెస్ నుంచి విడిపోయిన రెండు నెలల తర్వాత.. ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లతో ఇదే చంద్రబాబు కుమ్మక్కై కోర్టుల దాకా వెళ్లి కేసులు వేసింది వాస్తవం కాదా? చంద్రబాబు, కాంగ్రెస్ నాలుగేళ్లుగా కుమ్మక్కయ్యారు. సీబీఐ జగన్ మీద విచారణ చేస్తోంది. ఎమ్మార్, ఐఎంజీ కేసుల్లో చంద్రబాబును మాత్రం కనీసం పిలువలేదు. చంద్రబాబుకు ఒక న్యాయం... జగన్‌కు మరో న్యాయం.

ఆ మూడు రాష్ట్ర్రాలకూ ఏం చేశారు?
బీజేపీని నేను ఒకటి అడగదలచుకున్నా.. 1999-2000 సంవత్సరంలో మీరు చిన్న రాష్ట్రాలకు అనుకూలమని జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లను ఏర్పాటు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో రాయపూర్‌ను, జార్ఖండ్‌లో రాంచీని మహానగరాలుగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్‌ను కూడా అలాగే మహానగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నారు. ఇప్పుడు అడుగుతున్నా.. ఆ మూడు రాష్ట్రాలకు వెళ్లి చూసిరండి. ఆ మూడు రాష్ట్రాల్లో కనీసం అంతర్జాతీయ విమానాశ్రయం కూడా లేదు.

ఎయిమ్స్ తరహా, నిమ్స్ తరహా సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి కూడా లేదన్న సంగతి వీళ్లకి తెలుసా? 1999లో ఈ రాష్ట్రాలను వేరు చేసినప్పుడు ఇదే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ నగరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్నారు. కొత్త రాజధానిని నిర్మించుకోవడానికి, కొత్త మహానగరాన్ని నిర్మించుకోవడానికి ఇస్తామన్నారు. విడదీశాక బీజేపీ నాలుగేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా వీరు ఇచ్చిన డబ్బు ఎంతో తెలుసా... ముష్టివేసినట్లు రూ. 400 కోట్లు మాత్రమే. ఇప్పుడు మాత్రం చిన్న రాష్ట్రాలు గొప్పగా ఉంటాయని, అది చేస్తాం.. ఇది చేస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.’’
 
కొల్లేరుపై తొలి అసెంబ్లీ భేటీల్లోనే బిల్లు
‘‘2008లో వైఎస్‌ఆర్ ఇంతకుముందు ఎవరూ చేయని సాహసం చేశారు. అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. కొల్లేరును కాంటూరు +5 నుంచి కాంటూరు +3కు తగ్గిస్తూ తీర్మానం చేసి పంపారు. కానీ ఆ తర్వాత ఆయన చనిపోయారు. నేను ఇప్పుడు హామీ ఇస్తున్నా నా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది పెడతాను. కొల్లేరు కాంటూరును మరోసారి +5 నుంచి +3 కి తగ్గిస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపిస్తా. మనకు 25 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనమే ప్రధానిని నిర్ణయిస్తే ఈ సమస్యను రెండేళ్లలో పరిష్కరిస్తా. పార్టీ నాయకుడు దూలం నాగేశ్వరరావుకు నా గుండెల్లో స్థానం ఉంది. ఈ జిల్లా నుంచి మొదటి ఎమ్మెల్సీగా ఆయన్ను తీసుకెళ్తాను.’’
 
‘‘ బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్.. వీళ్లెవరికి మన మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లు మాత్రమే. ఓట్లు, సీట్ల కోసం వీరు ఏ అబద్ధమైనా ఆడతారు.. ఏ గడ్డి అయినా తింటారు. కాబట్టి వీళ్లనెవరినీ నమ్మొద్దు. రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాలున్నాయి. ఒక్క సీటు కూడా పక్కకు పోకుండా 25 సీట్లను మనమే తెచ్చుకుందాం. ప్రధానిగా ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దాం. బీజేపీనా.. ఇంకొకరా అనేది ఆ రోజు 25 మంది ఎంపీలతో దగ్గరుండి మనమే నిర్ణయిద్దాం. మన రాష్ట్ర అభివృద్ధిని మనమే నడుపుదాం.’’
 
టీడీపీ-బీజేపీ ఆ ఐదేళ్లలో చేయలేదేం?
అదే తిరుపతి వేదిక మీద ఆ పెద్ద మనుషులు బీజేపీ-చంద్రబాబు కలిస్తే అలాఅలా స్వర్గాన్ని కిందకు తీసుకొస్తామని కూడా చెప్పారు. నేను చంద్రబాబును, బీజేపీని అడగదలచుకున్నా. 1999 నుంచి 2004 వరకు టీడీపీ-బీజేపీ ఇద్దరు కలిసి ఒక్కటై దేశంలో చక్రం తిప్పారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటేఒక్క మేలు ఏంటో చెప్పగలరా? రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటెయ్యాలని, ఆయన గొప్పగా బాగు పరుస్తారని మోడీ చెబుతున్నారు. 1999 నుంచి 2004 వరకు మీరు కలిసి ఉన్నపుడు అప్పుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల తీరం కనిపించలేదా? ఆ రోజు తీరం ఉంది... ఈరోజు తీరం ఉంది. ఆ రోజు చేయలేని అభివృద్ధి ఈ రోజు చేస్తామని ఓట్ల కోసం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుగాని, గాలేరు-నగరి లాంటి రాయలసీమ ప్రాజెక్టులుగాని పూర్తి చేయాలని ఆ ఐదేళ్లలో మీకెందుకు అనిపించలేదు?
 - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

>
మరిన్ని వార్తలు