రాజధాని.. భాగ్యనగరం

25 Apr, 2014 01:21 IST|Sakshi
రాజధాని.. భాగ్యనగరం

* భాగ్యనగర సిగలో అభివృద్ధి ఆభరణం..   
*  గ్రేటర్ హంగులతో హరిత తోరణం..   
*  సువిశాల మార్గాలతో మణిహారం

 
(సాక్షి సిటీబ్యూరో, హైదరాబాద్): తొమ్మిదేళ్ల ‘హైటెక్‌బాబు’ పాలనలోని ‘అభాగ్య’నగరం...  మళ్లీ చార్‌మీనార్‌లా ఠీవిగా తలెత్తుకు నిలబడిందంటే... అందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంకల్పమే కారణం. ‘రాజన్న’ కలలు కన్న హరితాంధ్రప్రదేశ్‌లో పల్లెలే కాదు...పట్టణాలు, నగరాలు కూడా పచ్చగా ఎదిగాయి. ‘గొప్పల బాబు’ అరచేత వైకుంఠం చూపిస్తే... మహానేత వైఎస్ తాను హామీ ఇచ్చిన అభివృద్ధిని ఆచరణలో చూపారు... బాబు జమానా బస్తీ బతుకుల్లో విధ్వంసం నింపితే.... రాజన్న ఆ బస్తీల్లో సమీకృత అభివృద్ధికి బాటలు వేశారు. వేలాది మంది పట్టణ పేదలకు గూడు కల్పించారు.
 
  సంక్షేమ ఫలాలు దక్కేలా చూశారు. ‘విజన్’బాబు నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌లా మార్చితే.... మహానేత వైఎస్ ఆ కాంక్రీట్ జంగిల్‌లో ఉద్యానవనాలు నిర్మించి పర్యావరణానికి ఊపిరులూదారు. రహదారులను చక్కదిద్ది ట్రాఫిక్ కష్టాలు తీర్చారు. ‘సాగర్’ ప్రక్షాళనకు నడుంబిగించారు. నగరంతో అనుసంధానమైన మునిసిపాలిటీల్లో రిజర్వాయర్లు నిర్మించి నగరజీవి దప్పిక తీర్చారు. ‘సీఈఓ బాబు’.. ఆస్పత్రుల్లోనూ ఫీ‘జులుం’ చెలాయిస్తే... దవాఖానాలకు తిరిగి ఆయుష్షు పోసి, ప్రజావైద్యాన్ని మెరుగుపరచి అపర ధన్వంతరిగా వైఎస్ నిలిచారు.
 
 ‘సింగపూర్ బాబు’ జమానాలో నగరంలో రవాణా సదుపాయాలు అస్తవ్యస్తం అయితే.... దానిని చక్కదిద్ది ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేలతో నగర శివార్లను అనుసంధానం చేస్తూ హైదరాబాద్ మహానగరానికి సరికొత్త రూపమిచ్చిన దర్శనికుడు వైఎస్. ఆ దార్శనికతలో మెట్రోరైల్ మణిహారం నిర్మాణం ఒకటి. ‘బాబు చీకటియుగం’లో కరెంటుకోతతో పరిశ్రమలు, వర్తక వాణిజ్యాలు అంధకారంలో మగ్గిపోతే మహానేత తన హయాంలో విద్యుత్ సరఫరా మెరుగుపరచి వాటికి వెలుగందించారు. ‘డాబుల బాబు’ విద్యను కార్పొరేటీకరణ చేస్తే... సగటు విద్యార్థికి చదువును దూరం చేస్తే.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత విద్యను మధ్యతరగతికి అందుబాటులోకి తెచ్చిన మహనీయుడు వైఎస్. ఐఐటీ క్యాంపస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను రాష్ట్రానికి తీసుకొచ్చారు.. ట్రిపుల్ ఐటీల ద్వారా సాంకేతిక పీఠం వేశారు. కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశారు.  నగరాన్ని సగటు జీవి కలల ‘మహా’సౌధంగా ఆవిష్కరింపజేశారు.. ఆ సౌధం వైఎస్
 అనంతరం బీటలు వారుతోంది. కళ తప్పిపోతోంది... అభివృద్ధి అడుగంటుతోంది.  
 
 గ్రేటర్‌తో ‘మహా’అభివృద్ధి  
 ఒకప్పుడు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్(ఎంసీహెచ్)గా ఉన్న రాజధాని నగరం సైతం మిగతా కార్పొరేషన్‌లకు తీసిపోని విధంగానే ఉండేది. చాలీ చాలని నిధులు..అరకొర సదుపాయాలు..ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలు..అనారోగ్యకర పరిస్థితులతో కునారిల్లుతుండేది. వైఎస్  ముఖ్యమంత్రి అయ్యాక ఈ పరిస్థితిని మార్చేం దుకు కృషి చేశారు. రహదారులు, వీధిదీపాలు, తాగునీరు వంటి మౌలికసదుపాయాలు అందుబాటులోకొచ్చాయి. శివార్లలోని మునిసిపాలిటీల ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి 12 మునిసిపాలిటీలను విలీనం చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) గా మార్చారు. దాంతో నగరం రూపురేఖలు మారిపోయాయి. ఒకప్పుడు కనీస నిర్వహణకే నిధుల కొరతతో సతమతమైన కార్పొరేషన్ బడ్జెట్ రూ.వేల కోట్లకు పెరిగింది. తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో రూ.1000 కోట్ల పైగా ఆస్తిపన్ను రూపేణా వసూలైంది. అందుబాటులోకొచ్చిన సదుపాయాలు, పెరిగిన ఆదాయంతో ఇది సాధ్యమైంది.
 
 ఆ అభివృద్ధి సంతకం.. చెరగని జ్ఞాపకం
 అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్దశ
 చంద్రబాబు హయాంలో భూసేకరణకే పరిమితమైన అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వైఎస్ అధికారంలోకి వచ్చాక ఊపందుకున్నాయి. పనులు శరవేగంగా కొనసాగడంతో నిర్ణీత గడువుకన్నా మూడు రోజుల ముందే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. రూ.2500 కోట్లతో మార్చి 16, 2005న ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. మార్చి 14, 2008న అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైంది. విమానాశ్రయం కోసం చంద్రబాబు హయాంలో 5500 ఎకరాల భూమిని సేకరించారు. అయితే భూమి కోల్పోయిన రైతులు, ప్రజలను బాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ అధికారంలోకి వచ్చాక 2005లో నిర్వాసితులకు పరిహారం అందించారు.
 
 ప్రజా వైద్యానికి పెద్దపీట
 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న ప్రజావైద్యం వైఎస్ రాకతో గట్టెక్కింది. 2004లో వైఎస్సార్ అధి కారంలోకి వ చ్చాక ప్రజావైద్యానికి పెద్దపీట వేశారు. నిరుపేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించాలనే ఆలోచనతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించారు. ప్రమాదవశాత్తు గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించేందుకు 108 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. గ్రామీణులకు వైద్య సహాయం అందించేందుకు 104 సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. నిమ్స్ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ట్రామా కేర్‌లకు అవసరమైన నిధులు కేటాయించి పనులు పూర్తి చేయించిన ఘనత వైఎస్‌దే. ఉస్మానియాలో రూ.200 కోట్లతో ఏడు అంతస్తుల అధునాతన భవనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవజాత శిశువుల కోసం నిలోఫర్‌లో రూ. 27 కోట్లతో 150 పడకల రాజీవ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవ నానికి శ్రీకారం చుట్టారు.
 
 విస్తరించిన ‘రియల్’ రంగం
 ఔటర్ రింగ్‌రోడ్డు ప్రభావంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం రివ్వున పెకైగసింది. భూముల రేట్లు ఒక్కసారిగా పెరిగాయి. కూకట్‌పల్లి, మియాపూర్, శంషాబాద్, హయత్‌నగర్, మేడ్చల్, ఉప్పల్ ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించి పటాన్‌చెరువు, షాద్‌నగర్, భువనగిరి, పోచంపల్లి, ఘట్‌కేసర్ ప్రాంతాలు దాటేసింది. పెద్దసంఖ్యలో అపార్ట్‌మెంట్లు నిర్మితమయ్యాయి. కోకాపేట, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఎకరం ధర రూ.10-14కోట్లకు చేరింది. నగరానికి  దూరంగా ఉన్న మణికొండ సంపన్న వర్గాలకు నిలయంగా మారింది.
 
 ట్రాఫిక్ జామ్‌ల నుంచి ఉపశమనం
 చంద్రబాబు పాలనాకాలంలో ట్రాఫిక్ సమస్యలు నగర ప్రజలను పలు ఇబ్బందులకు గురిచేసేవి. ట్రాఫిక్‌జామ్‌లతో ఇబ్బందులు పడేవారు. వైఎస్ పాలనా పగ్గాలు చేపట్టగానే ఈ సమస్యల నుం చి ప్రజలకు విముక్తి లభించింది. చాంద్రాయణగుట్ట, నల్గొండ చౌరస్తా, జామె ఉస్మానియా ఫ్లైఓవర్‌తో పాటు ట్రాఫిక్ జంక్షన్‌లను తీర్చిదిద్దడంతో ట్రాఫిక్ జామ్ సమస్య కొంత మేర తీరింది.
 
 పచ్చదనంపై ప్రత్యేక దృష్టి
 పచ్చదనం.. పరిశుభ్రం గురించి ఉపన్యాసాలిచ్చే చంద్రబాబు హయాంలో నగరంలోని గ్రీన్‌స్పేస్ 4.2శాతం మాత్రమే. వైఎస్ సీఎం అయ్యాక గ్రీన్‌స్పేస్ విషయలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఫలితంగా అది 24శాతానికి పెరిగింది. వనస్థలిపురం, సచివాలయనగర్, ప్రశాంతినగర్, ఏఎస్‌రావు నగర్ తదితర అనేక ప్రాంతాల్లో కొత్త పార్కులొచ్చాయి. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
 
 నీళ్లు ఫుల్
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టాక నగరంలో నీటి కష్టాలు గణనీయంగా తగ్గాయి. ఆయన హయాంలో గ్రేటర్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల పరిధిలో 20 భారీ మంచినీటి రిజర్వాయర్లు నిర్మించారు. కృష్ణా ప్రాజెక్టు మొదటిదశలోని స్టేజ్-2ను రూ.60 కోట్ల అంచనా వ్యయంతో పూర్తిచేసిన ఘనత కూడా వైఎస్సార్‌దే. గ్రేటర్ జనాభా 2031 నాటికి 1.71 కోట్లకు చేరుతుందన్న ముందుచూపుతో 2008లోనే కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నగర శివార్లలోని శామీర్‌పేట వరకు రూ.3500 కోట్ల అంచనా వ్యయంతో గోదావరి మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టారు.
 
 విస్తరణ ఇలా...
-  1960లో ఎంసీహెచ్ విస్తీర్ణం 73 చ.కి.మీ..అయితే ఇపుడు జీహెచ్‌ఎంసీ విస్తీర్ణం 625 చ.కి.మీ.
-  ఎంసీహెచ్ పరిధిలో హైదరాబాద్ జిల్లా మాత్రమే ఉండగా, జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లా,మెదక్‌జిల్లాలున్నాయి.
-   1960లలో ఎంసీహెచ్ టర్నోవర్ రూ. 1.5 కోట్లు కాగా, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ బడ్జెట్ దాదాపు రూ.4599 కోట్లు
-    అప్పట్లో నగర జనాభా 16 లక్షలు కాగా, 2011 జనగణన వివరాల మేరకు జనాభా 78 లక్షలు
-  గ్రేటర్‌లో ప్రస్తుతం 2080 కి.మీ.ల సీసీరోడ్లు, 2280 కి.మీ.ల బీటీ రోడ్లున్నాయి.
-    3,49,573 వీధి దీపాలున్నాయి. వీటి కరెంట్ చార్జీలకే నెలకు రూ. 6.63 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
-   పది మేజర్ పార్కులు, 28 నగరస్థాయి పార్కులు, 460 కాలనీ పార్కులు, 12 థీమ్‌పార్కులున్నాయి. 600 ఆటస్థలాలున్నాయి.
 
మెట్రోకు గ్రీన్ సిగ్నల్
 గ్రేటర్ ట్రాఫిక్ కష్టాలకు తెరదించేందుకు వైఎస్సార్ హయాంలో ఎలివేటెడ్ మెట్రో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. నగరంలోని నాగోల్,-శిల్పారామం,ఎల్బీనగర్-మియాపూర్,జూబ్లీబస్టాండ్-ఫలక్‌నుమా రూట్లలో మొత్తంగా 72 కిలోమీటర్ల మేర పనులు చేపట్టేందుకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో పునాదులు పడ్డాయి. సుమారు రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ప్రాజెక్టును చేపడుతున్నారు. ప్రపంచంలోనే పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుగా ఇది ఖ్యాతిగాంచింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ  2015 మార్చి 22న నాగోల్-మెట్టుగూడ రూట్లో ప్రారంభం కానుంది. మొత్తంగా మూడు కారిడార్ల పరిధిలోని మెట్రో ప్రాజెక్టును 2017 జూన్ నాటికి పూర్తిచేస్తామని పనులు చేపట్టిన ఎల్‌అండ్‌టీ సంస్థ స్పష్టం చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా గ్రేటర్‌లో నిత్యం 20 లక్షలమందికి ట్రాఫిక్ సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది.
 
 పరిశ్రమలు తెరిపించి.. వెలుగులు నింపి

 చంద్రబాబు హయాంలో వరుస విద్యుత్ కోతలు, అధిక చార్జీల వల్ల సుమారు వెయ్యికిపైగా చిన్న తరహా, కుటీర పరిశ్రమలు మూతపడ్డాయి. వీధిలైట్లకు సైతం సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో బస్తీలన్నీ చీకట్లో మగ్గిపోయాయి. వైఎస్ అధికారంలోకి రాగానే మూతబడిన పరిశ్రమలను తెరిపించారు. చాంద్రాయణగుట్ట, చిలకలగూడ 220 కేవీ సబ్‌స్టేషన్లను ఆధునికీకరించారు. ఈదురు గాలులకు స్తంభాలు విరిగిపడి, వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా రూ.వంద కోట్లతో అండర్ గ్రౌండ్, ఎయిర్ బంచ్‌డ్ కేబుళ్లను ఏర్పాటు చేయించారు. ట్రాన్స్‌ఫార్మర్లపై ఉన్న ఒత్తిడిని నివారించి, నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.120 కోట్లతో అరవై నాలుగు 33/11 కేవీ ఇండోర్/ అవుట్ డోర్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టు మరో పద్నాలుగు 220 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మానికి ప్రతిపాదనలు తయారు చేయించారు.

మరిన్ని వార్తలు