తొలిఫలం తెలంగాణకే..

15 Apr, 2014 02:16 IST|Sakshi
తొలిఫలం తెలంగాణకే..

ముందుగా పూర్తయిన గుత్ప ఎత్తిపోతల పథకం
అధిక బడ్జెట్ కేటాయించిన అపర భగీరథుడు

 
వచ్చే ఎన్నికల వరకు పాలి‘ట్రిక్స్’ను వదిలి.. ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేద్దాం.. కావాలంటే ఆ ఖ్యాతిని మీరే తీసుకోండి... వివిధ ప్రాజెక్టుల పూర్తికి నిర్దేశించిన కాలపరిమితులన్నీ ‘పెళ్లి ముహుర్తాలు’ కావు.. అంతిమంగా రూ.40 వేల కోట్లతో నీటిపారుదల  సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ విధానం. నదుల అనుసంధానానికి దోహదం చేసే ప్రాజెక్టులపై అపోహలు.. విమర్శలు మాని సహకరించండి
- జలయజ్ఞం సందర్భంగా రాజకీయ పార్టీలకు డాక్టర్ వైఎస్‌ఆర్ లేఖ.

 
 (గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్): ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మహాయజ్ఞమే... జలయజ్ఞం.  బీడు భూముల్లో సిరులు పండి.. పుడమితల్లి పులకరించి పోవాలని తపనపడ్డ మహానేత వైఎస్సార్ కల నిజమై... కరువు జిల్లాల్లో బీడు భూములకు జలసిరులు చేరాయి. కష్టాలతో బిక్కచచ్చిన రైతుల కళ్లలో వెలుగులు నిండాయి. నెర్రెలిచ్చిన పొలాల్లోకి పరుగులు పెట్టిన నీళ్లు వేలాది మంది రైతులకు భరోసా నిచ్చాయి. ‘జలయజ్ఞం’లో తెలంగాణ ప్రాజెక్టులకు వైఎస్ పెద్దపీట వేశారు.
 
ఫలితంగా జలయజ్ఞం కింద తొలిఫలం కూడా తెలంగాణ రైతాంగానికే దక్కింది. నిజాంసాగర్ చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం తొలుత పూర్తయ్యింది. చంద్రబాబు హయాంలో సాగునీటి రంగంతీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్న సత్యం అప్పటి  బడ్జెట్  కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం తొమ్మిదేళ్లలో బాబు పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయినా సాగు విస్తీర్ణం ఏమాత్రం పెరగలేదు. దీంతో వైఎస్ అధికారంలోకి రాగానే నీటి పథకాలకు  పెద్దపీట వేశారు. ప్రాణహిత- చేవెళ్ల, దేవాదుల, కల్వకుర్తి తదితర 23 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు.
 
 ఆయన తన ఐదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతంలో నీటి పథకాలకు రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసి, అదనంగా 25 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి మొత్తం 35 లక్షల ఎకరాలకు నీరందించారు. మొత్తం రూ.54,266 కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.  తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో  16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద వైఎస్ శంకుస్థాపన చేశా రు. అప్పట్లోనే  రూ.38.500 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని చేపట్టారు.  వైఎస్ మరణానంతరం ఆ పనులు మందగించాయి. జాతీయహోదా పేరిట కాలయాపన చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు