రేపటి నుంచి జిల్లాలో విజయమ్మ పర్యటన

9 Apr, 2014 01:15 IST|Sakshi
రేపటి నుంచి జిల్లాలో విజయమ్మ పర్యటన
అరండల్‌పేట, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ గురువారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జనభేరి పేరిట మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో గత ఏడాది ఆగస్టు 19 నుంచి 25వ తేదీ వరకు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదుట విజయమ్మ సమరదీక్ష చేశారు. ఆ తర్వాత పులిచింతలలో ఒకరోజు దీక్ష చేపట్టారు. తిరిగి జనభేరి ఎన్నికల ప్రచారానికి రానుండటంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తోంది. గురువారం ఉదయం 9.30 గంటలకు తెనాలి రూరల్ మండలం కొలకలూరు నుంచి విజయమ్మ పర్యటన ప్రారంభమవుతుంది. గుడివాడ, కోపల్లె, అంగలకుదురు మీదుగా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం దుండిపాడు, యడ్లపల్లి, వలివేరు, చుండూరు, మోదుకూరు నుంచి అమృతలూరు మండలం మోపర్రు, తురిమెళ్ళ, అమృతలూరు, గోవాడ మీదుగా రేపల్లె నియోజకవర్గంలోకి చేరుకుంటారు.
 
 చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, కావూరు, రాంభోట్లవారిపాలెం గ్రామాల మీదుగా బాపట్ల నియోజకవర్గంలోకి చేరుకుంటారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో సాయంత్రం ఆరుగంటలకు జరిగే సభలో విజయమ్మ ప్రసంగించనున్నారు. 11, 12 తేదీల్లో మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కార్యకర్తల్లో ఆనందోత్సాహం.. గత నెలలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండురోజుల పాటు జిల్లాలో పర్యటించారు. నరసరావుపేట, మాచర్లలో బహిరంగసభలతో పాటు రోడ్‌షో నిర్వహించారు. అలాగే ఆయన సోదరి షర్మిల ఐదురోజుల పాటు జిల్లాలో జనభేరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరి పర్యటనకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటికే వైఎస్సార్‌సీపీ ప్రచారంలో ఎవరికీ అందని రీతిలో దూసుకుపోతుంది. తాజాగా విజయమ్మ జనభేరి ఎన్నికల ప్రచారం షెడ్యూల్ విడుదల కావడంతో కార్యకర్తలు ఆనందోత్సాహాలతో ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
మరిన్ని వార్తలు