మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తావు బాబూ: వైఎస్ విజయమ్మ

21 Apr, 2014 11:31 IST|Sakshi
మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎలా ఇస్తావు బాబూ: వైఎస్ విజయమ్మ

మహిళలు, రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విరివిగా రుణాలు అందించారని, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించారని వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. విశాఖ లోక్సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నా మె.. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం పెరుమాళ్లపురంలో సోమవారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏ జిల్లాకు ఏంచేయాలో వైఎస్‌ఆర్‌కు తెలుసని, అందుకే 12 ప్రాజెక్టులు పూర్తిచేసి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. తన తొమ్మిదేళ్ల పాలనను తీసుకొస్తానని చెప్పి మళ్లీ చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లగలడా అని ఆమె ప్రశ్నించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని చంద్రబాబు ఇప్పుడు కొత్త వాగ్ధానాలు చేస్తున్నాడని మండిపడ్డారు.

గతంలో వైఎస్ఆర్ ఉచిత విద్యుత్‌ అంటే చంద్రబాబు అవహేళన చేసి మాట్లాడాడని, వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబేనని వైఎస్‌ విజయమ్మ చెప్పారు. రాజకీయాల్లో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబేనని తెహల్కా ఆనాడే చెప్పిందని గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం చొప్పున మూడున్నర కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తానని ఇప్పుడు చెబుతున్నాడని, అయితే ప్రభుత్వంలో ఉన్నదే 20 లక్షల మంది ఉద్యోగులని, మరి ఇప్పుడు మూడున్నర కోట్ల ఉద్యోగాలు ఎక్కడినుంచి తెస్తాడని నిలదీశారు. గతంలో ఉద్యోగులు వద్దని కాంట్రాక్టు వ్యవస్థను తీసుకొచ్చిందే చంద్రబాబని, అలాంటిది ఇప్పుడాయన ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు ఎవరూ నమ్మొద్దని వైఎస్ విజయమ్మ తెలిపారు.

మరిన్ని వార్తలు