మునిసిపల్ ఎన్నికల్లో ముస్లింలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట

25 Mar, 2014 04:37 IST|Sakshi
మునిసిపల్ ఎన్నికల్లో ముస్లింలకు వైఎస్సార్‌సీపీ పెద్దపీట

అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల్లో ముస్లింలకు వైఎఎస్సార్‌సీపీ పెద్ద పీట వేసింది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కంటే మూడు రెట్లు అధికంగా టికెట్లు కేటాయించింది. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల పరిధిలో 18.76 శాతం వార్డు స్థానాలను ముస్లింలకు కేటాయించింది.

జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 373 వార్డుల్లో 70 వార్డులకు ముస్లింలను బరిలోకి దించింది. కదిరి మునిసిపాలిటీలో 36 వార్డులు ఉంటే ఇందులో 50 శాతం స్థానాలను అంటే 18 సీట్లను ముస్లింలకు కేటాయించారు. మహానేత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి కూడా ముస్లింలపై ప్రత్యేక అభిమానం చూపించి విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆ వర్గానికి 4 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇప్పుడు అదే బాటలో వైఎస్సార్‌సీపీ మునిసిపల్ ఎన్నికల్లో ఆ వర్గానికి అధిక సంఖ్యలో టికెట్లు కేటాయించింది.

ముస్లింలకు తగిన గుర్తింపునిస్తామంటూ గొప్పలు చెప్పుకునే టీడీపీ ఆచరణలో చూపించలేదు. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 11 మునిసిపాలిటీల్లో 52 సీట్లను మాత్రమే ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే మునిసిపల్ ఎన్నికల్లో ముస్లింలకు అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది వైఎస్సార్‌సీపీ అనేది స్పష్టమవుతోంది.
 

మరిన్ని వార్తలు