‘అలాంటి సీన్స్‌ లేవు’

20 Oct, 2017 12:36 IST|Sakshi

సాక్షి,ముంబయి: బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకోన్‌ టైటిల్‌ రోల్‌లో సంజయ్‌ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావతిని వివాదాలు వెంటాడుతున్నాయి. తమ మూవీలో అభ్యంతరకర దృశ్యాలు లేవని, రాణీ పద్మినీ క్యారెక్టర్‌ను అవమానించేలా చూపడం లేదని మేకర్లు వివరణ ఇస్తున్నా ఆందోళనలు తగ్గుముఖం పట్టడం లేదు. గుజరాత్‌లోని ఓ మాల్‌లో పద్మావతి పోస్టర్‌ను కొందరు దగ్ధం చేసిన క్రమంలో ఈ వ్యవహారంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రి స్మృతీ ఇరానీ జోక్యం చేసుకోవాలని దీపికా పడుకోన్‌ ట్వీట్‌ చేయడం వార్తల్లో నిలిచింది.

సినిమా ఇంతవరకూ విడుదల కాకపోయినా దీనిపై అనవసర ద్వేషం వెళ్లకక్కడంపై దీపిక ఆవేదన వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు చేశారు. వీటిని నెటిజన్లు, సెలబ్రిటీలు రీట్వీట్‌ చేస్తూ ఆమెకు బాసటగా నిలిచారు. పద్మావతిలో్ రాణి పద్మినీగా చేస్తున్న దీపికా పడుకోన్‌, అల్లావుద్దీన్‌ ఖిల్జీగా నటించిన రణ్‌వీర్‌సింగ్‌ల మధ్య ఎలాంటి సన్నివేశాలు లేవని, రాజ్‌పుట్‌ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాదిరిగా వీరిద్దరి మధ్య రొమాంటిక్‌ సీన్స్‌ అసలే లేవని ఫిల్మ్‌ మేకర్లు వివరణ ఇస్తుండగా, పలువురు వాటిని ట్వీట్‌ చేశారు.ఇంత చెబుతున్నారాజ్‌పుట్‌ సంఘాల ఆందోళన చల్లారలేదు.

సినిమా సెట్స్‌ను దగ్ధం చేయడంతో పాటు తమకు సినిమా విడుదలకు ముందే ప్రివ్యూ వేయకుంటే థియేటర్లను నాశనం చేస్తామని వారు హెచ్చరించారు.పద్మావతిలో అభ్యంతరకర సన్నివేశాలుంటే తాము వాటిని గుర్తించి కట్స్‌ చెబుతామని, అప్పుడే రిలీజ్‌కు సహకరిస్తామని వారు తేల్చిచెప్పారు.తమ సూచనలను పెడచెవిన పెట్టి సినిమా విడుదలకు పూనుకుంటే ఆందోళనలు ఎంతటి స్థాయికి వెళతాయో తాము చెప్పలేమని వారు హెచ్చరించారు. దీపికా పడుకోన్‌, షాహిద్‌ కపూర్‌, రణ్‌వీర్‌సింగ్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన పద్మావతి డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

మరిన్ని వార్తలు