పద్మావతికి పొలిటికల్‌ సెగ

26 Oct, 2017 10:49 IST|Sakshi

సాక్షి,అహ్మదాబాద్‌: సంజయ్‌ లీలా భన్సాలీ వివాదాస్పద చారిత్రక దృశ్య కావ్యం పద్మావతి వివాదాలకు మారుపేరుగా నిలుస్తోంది. రాజ్‌పుట్‌ సంఘాలు ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనలతో హోరెత్తిస్తుంటే తాజాగా రాజకీయ నేతలూ ఈ మూవీని టార్గెట్‌ చేశారు. పద్మావతి మూవీ విడుదలయ్యేలోగా చిత్రాన్నిహిందూ, క్షత్రియ నేతలకు చూపాలని గుజరాత్‌ నేత శంకర్‌సింగ్‌ వాఘేలా డిమాండ్‌ చేశారు.ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను వక్రీకరించారనే ఆరోపణలున్నాయని చెప్పారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను ఆకట్టుకునేందుకు చౌకబారు ఎత్తుగడలకు దిగడం సరికాదని హితవు పలికారు.

పద్మావతి చిత్రాన్ని ముందుగా ఆందోళనకారులకు చూపించకుండా విడుదల చేస్తే గుజరాత్‌లో హింసాత్మక నిరసనలు తలెత్తుతాయని, శాంతిభధ్రతల పరిస్థితి గాడితప్పే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే సినిమా మేకర్లకు తాను ముందుగానే క్షమాపణలు చెబుతున్నానని గుజరాత్‌ మాజీ సీఎం కూడా అయిన వాఘేలా పేర్కొన్నారు.

కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న వాఘేలా జన వికల్ప్‌ మోర్చా పేరిట రాజకీయ పార్టీని స్ధాపించి గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఆల్‌ ఇండియా హిందుస్తాన​ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల చిహ్నమైన ట్రాక్టర్‌ గుర్తుపై జన్‌ వికల్ప్‌ మోర్చా అభ్యర్థులు పోటీ చేయనున్నారు.

మరిన్ని వార్తలు