ఆహారంపై 10 అపోహలు... వాస్తవాలు

13 May, 2015 23:41 IST|Sakshi
ఆహారంపై 10 అపోహలు... వాస్తవాలు

మనం రోజూ తినే ఆహారం గురించి మనకు తెలిసిన విషయాలు తక్కువ. పైగా అందులోనే బోలెడన్ని అపోహలూ, తప్పుడు అభిప్రాయాలు. మనం రోజూ తినే ఆహారంపై ఉన్న అపోహలు తొలగించుకొని, వాస్తవాలు తెలుసుకుందాం.
 
అపోహ: బొప్పాయి తింటే గర్భస్రావం అవుతుంది.


వాస్తవం: బాగా పక్వానికి వచ్చిన బొప్పాయి పండును తినడం గర్భవతులకు మేలు చేస్తుంది. కానీ పూర్తిగా పండని, లేదా బాగా పచ్చిగా ఉన్న బొప్పాయిలో ‘పపాయిన్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భసంచిని ముడుచుకుపోయేలా ప్రేరేపించి కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసేలా చేయవచ్చు. అందుకే గర్భవతులు పచ్చికాయ తినకూడదు.
 
 అపోహ: గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ తప్పదా?


 వాస్తవం: పచ్చసొనలో కొలెస్ట్రాల్ ఉండే మాట వాస్తవమే. ఒక గుడ్డులో 211 మి.గ్రా. ఉంటుంది. కొలెస్ట్రాల్ మోతాదులు ఎంతగానో మించితేనే అప్పుడవి  రక్తప్రవాహానికి అడ్డుపడతాయి. అంతేగానీ ఒక గుడ్డులో ఉన్న పచ్చసొనకు రక్తనాళాల్లో అడ్డంకి ఏర్పరిచేంత కొవ్వు ఉండదంటున్నారు పెన్స్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు.
 
అపోహ: నిమ్మజాతి పండ్లు అయిన నిమ్మ, నారింజ, బత్తాయితో పాటు జామ పండు తింటే జలుబు చేస్తుంది.

వాస్తవం: నిమ్మజాతి పండ్లలో విటమిన్-సి పాళ్లు ఎక్కువ. జలుబు చేయడం అన్నది వైరస్ వల్ల జరిగే పరిణామం. దీన్ని మన వ్యాధి నిరోధకశక్తి ఎదుర్కొని అదుపు చేస్తుంది. అలా ‘విటమిన్-సి’ని  సమకూర్చి ఇమ్యూనిటీ పెంచే గుణం నిమ్మజాతిపండ్లతో పాటు జామకూ ఉంది.
 
అపోహ: గర్భవతులు పాలు తాగడం వల్ల బిడ్డ తెల్లగా పుడతాడు. కాఫీ లేదా టీ తాగితే బిడ్డ మేనిచాయ ఒకింత తగ్గవచ్చు.


వాస్తవం: ఇది పూర్తిగా తప్పు. బిడ్డ రంగును కేవలం జన్యు వులు నిర్ణయిస్తాయి. గర్భవతులు పాలు తాగడం వారి ఆరోగ్యానికి మేలు చేసే విషయం కాబట్టి పాలు తాగడం మంచిదే. కాఫీ, టీ తీసుకున్నా బిడ్డ రంగు మారడు.
 
అపోహ: కాకరకాయ తింటే డయాబెటిస్ తగ్గుతుంది.

వాస్తవం: కాకరలోని పోషకాలైన కరాటిన్, మమోర్డిసిన్ అనే పదార్థాలకు రక్తంలోని చక్కెరపాళ్లను తగ్గించే సామర్థ్యం ఉంది. వాటి గింజలలో పాలీపెప్టైడ్-పీ అనే ఇన్సులిన్‌ను పోలిన పదార్థం ఉంటుంది. అయితే కేవలం కాకర తినడం వల్ల చక్కెర అదుపులో ఉండదు. డయాబెటిస్ రోగులు చక్కెరను నియంత్రించే మందులు వాడాల్సిందే.
 
 అపోహ: పాలకూర, టమాట కలిపి తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి.

వాస్తవం: కిడ్నీల్లో ఏర్పడే రాళ్లలో అనేక రకాలు ఉంటాయి. వాళ్లు చాక్లెట్లు వంటివీ తినకూడదు. జన్యుకారణాల వల్ల ఇలా కొన్ని పదార్థాలు తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నవారు మినహా, మిగతా వాళ్లంతా మంచి  ఆరోగ్యం కోసం పాలకూర, టమాట నిర్భయంగా, నిశ్చింతగా తినవచ్చు.
 
అపోహ: బ్రేక్‌ఫాస్ట్‌గా టిఫిన్ కంటే పండ్లు తినడమే మేలు.  

వాస్తవం: రాత్రి భోజనం పూర్తయ్యాక  సుదీర్ఘమైన వ్యవధి తర్వాత మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తింటాం. ఇంత వ్యవధి తర్వాత తినే ఆహారం కేవలం పండ్లూ, ఫలాలకు బదులుగా బలవర్థకమైన ఆహారం అయితే మంచిది. పైగా ఉదయం తినే ఆహారం కొంత ఘనంగా ఉండటం వల్ల రోజంతా చేసే పనులకు తగిన శక్తి వస్తుంది.
 
అపోహ: రాత్రివేళ పెరుగు తినడం వల్ల ఉదయం విరేచనం సుఖంగా జరగదు.

వాస్తవం: నిజానికి పెరుగు అనేది కడుపులోకి వెళ్లకముందునుంచే జీర్ణమవుతుండే ఆహారం. ఈ కారణం వల్ల పెరుగు ప్రీ-డెజెస్టైడ్ ఆహారం కాబట్టి రాత్రి తిన్నతర్వాత మరింత తేలిగ్గా జీర్ణమవుతూ ఉంటుంది. కాబట్టి పెరుగు తినడం వల్ల ఉదయం మలబద్దకం రాదు.
 
అపోహ: గర్భవతులు ఎక్కువగా ద్రాక్ష తినడం మంచిది.


వాస్తవం: గర్భవతులు ద్రాక్షపండ్లను తినడం అంత మంచిది కాదు. ద్రాక్ష కాస్త ఆమ్లగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి  ‘హార్ట్ బర్న్’ ఎక్కువగా కనిపిస్తుంది. ద్రాక్షలో రెస్వెరట్రాల్ అనే పోషకాలు గర్భవతుల్లో హార్మోన్ల అసమతౌల్యతకు దారితీసి వారికి హాని చేయవచ్చు. అందుకే ద్రాక్ష తక్కువగా తినడం మేలు.     
 
 అపోహ: ఏదైనా శస్త్రచికిత్స తర్వాత శనగపప్పు తింటే చీము పడుతుంది.

వాస్తవం: శనగపప్పుకూ, చీము పట్టడానికీ ఎలాంటి సం బంధం లేదు. చీము పట్టడం గాయాలను మాన్పేందుకు తెల్లరక్తకణాలు, హానికారక బ్యాక్టీరియాతో పోరాడటం వల్ల జరిగేదే తప్ప... శనగపప్పు వల్ల కాదు. పప్పులు తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయి.
 

మరిన్ని వార్తలు