10% నీటితోనే వరి, చెరకు సాగు!

11 Dec, 2018 05:54 IST|Sakshi
ఆరుతడి పద్ధతిలో సాగవుతున్న నారాయణ కామిని వరి, చెరకు తోటలో దట్టంగా అల్లుకున్న కాకర తీగలు

కేవలం 10% నీరు, 10% విద్యుత్‌తోనే ప్రకృతి సేద్యం

కరువు పరిస్థితుల్లోనూ అతి తక్కువ వనరులతో దేశీ వరి,

చెరకు, అరటి, కంది సాగులో సత్ఫలితాలు

ఆదర్శ రైతు విజయరామ్‌ క్షేత్రాన్ని సందర్శించిన సుభాష్‌ పాలేకర్‌

వరి, చెరకు, అరటి.. అత్యధికంగా సాగు నీరు అవసరమయ్యే పంటలివి. అయితే, సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కేవలం 10% నీరు, 10 శాతం విద్యుత్తు, 5% (దేశీ వరి) విత్తనంతోనే సాగు చేస్తూ కరువు కాలంలోనూ సజావుగా దిగుబడి తీస్తున్న విలక్షణ రైతు విజయరామ్‌. వికారాబాద్‌ సమీపంలో రెండేళ్లుగా కరువుతో అల్లాడుతున్న తన వ్యవసాయ క్షేత్రంలో అతి తక్కువ నీరు, విద్యుత్తు, విత్తనంతో అనేక రకాల దేశీ వరి వంగడాలు, చెరకు, అరటితోపాటు కందిని ఆయన సాగు చేస్తున్నారు. ఈ క్షేత్రాన్ని ఇటీవల పద్మశ్రీ అవార్డు గ్రహీత సుభాష్‌ పాలేకర్‌ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు సూచనలిచ్చారు.ఆ ప్రాంతంలో రెండేళ్లుగా కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అతి తక్కువ నీటితో వరి, చెరకు, అరటి, కంది తదితర పంటలు సాగు చేస్తుండటం విశేషం.  

మిఠాయిల వ్యాపారి అయిన విజయరామ్‌ ఎనిమిదేళ్ల క్రితం రాజమండ్రిలో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి వ్యవసాయ పాఠాలు విని పొందిన స్ఫూర్తితో ఆవులు, పొలం కొని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం తరకటూరులో సౌభాగ్య గోసదన్‌ను ఏర్పాటు చేసి 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయంలో దేశీ వరి వంగడాలను సాగు చేస్తున్నారు. పాలేకర్‌ చేత 6 వేల మంది రైతులకు శిక్షణ ఇప్పించిన ఆయన 200 రకాల దేశీ వరి వంగడాలను సేకరించి, కొన్ని ఎంపిక చేసిన రకాలను సాగు చేస్తున్నారు.

గత ఏడాది వికారాబాద్‌ మండలం ధారూర్‌ మండలం బూరుగడ్డ గ్రామంలో 43 ఎకరాల నల్లరేగడి వ్యవసాయ భూమిని గత ఏడాది కొనుగోలు చేశారు. 35 ఏళ్లు రసాయనిక సాంద్ర వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఈ నేలలో ఘనజీవామృతం, జీవామృతం, ఆచ్ఛాదన తదితర పద్ధతులను పాటిస్తూ ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఇటీవల సుభాష్‌ పాలేకర్‌ ఈ క్షేత్రాన్ని సందర్శించి, వాతావరణ మార్పులను తట్టుకొనేందుకు ప్రకృతి వ్యవసాయ పద్ధతే శరణ్యమనడానికి 10% నీరు, 10% విద్యుత్తుతోనే వరి, చెరకు, అరటి పంటలను విజయరామ్‌ సాగు చేస్తుండటమే నిదర్శనమని ప్రశంసించారు. రైతులు తలా ఒక ఎకరంలో ఈ పద్ధతిలో సాగు చేసి ఫలితాలు స్వయంగా సరిచూసుకోవచ్చన్నారు.

ఆరు తడి దేశీ వరిలో అంతర పంటలు
ప్రత్యేకతలు, పంటకాలం, దిగుబడి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రత్నచోడి, తులసిబాసో, బహురూపి, మాపిలైసాంబ, చెకో, మైసూర్‌ మల్లిగా, నారాయణ కామిని, నవారా, కర్పుకొని వంటి దేశీ వరి రకాలను కొన్ని మడుల్లో విజయరామ్‌ ఈ ఖరీఫ్‌లో సాగు చేశారు. కొన్ని వరి రకాల్లో అంతర పంటలు వేశారు. అంతర పంటలు వేయని వరి రకాల్లో సాళ్లకు, మొక్కలకు మధ్య అడుగున్నర దూరం పెట్టారు. అంతర పంటలు వేసిన వరి పొలంలో వరుసల మధ్య 3 అడుగుల దూరం పెట్టారు.

బురద పొలంలో ఎకరానికి 100–200 కిలోల ఘన జీవామృతం వేస్తారు. అవకాశం ఉన్న రైతులు ఎకరానికి 400 కిలోల ఘనజీవామృతం వేస్తే మరీ మంచిది. భూమిలో తేమను పట్టి ఉంచడానికి, పంట త్వరగా బెట్టకు రాకుండా ఉండటానికి ఘనజీవామృతం చాలా ఉపయోగపడుతుందని, సకల పోషకాలూ అందుతాయని విజయరామ్‌ వివరించారు. 14–15 రోజులు పెంచిన నారును కుదురుకు ఒకే మొక్కను నాటుతారు.

వరికి 20 రోజులకో తడి
రత్నచోడి వరిలో నాటిన పొలంలోనే తోటకూర జాతికి చెందిన అమరంతస్‌ ధాన్యపు పంటను అంతర పంటగా వేశారు. నెల క్రితమే రత్నచోడి కోతలు పూర్తవగా ఇప్పుడు అమరంతస్‌ కోతకు సిద్ధమవుతోంది. కర్పుకౌని దేశీ వరిలో సాళ్లు/మొక్కల మధ్య 2 అడుగుల దూరం పెట్టారు. గతంలో వేరు శనగను అంతరపంటగా వేశారు. అయితే, అక్టోబర్‌లో శనగను అంతర పంటగా వేసి ఉంటే నత్రజని బాగా అందేదని పాలేకర్‌ సూచించారు. మాపిళ్లైసాంబ రకం ఆరు తడి వరిలో దుబ్బుకు 40–60 పిలకలు వచ్చాయి. ఆరు తడి పంటకు 20 రోజులకు ఒకసారి నీటి తడి ఇచ్చామని విజయరామ్‌ తెలిపారు. పాలేకర్‌ సూచించిన విధంగా వచ్చే ఏడాది నుంచి పూర్తిస్థాయిలో అక్టోబర్‌లో శనగను వరిలో అంతర పంటగా వేస్తామన్నారు. ఆరుతడిగా సాగు చేయడం వల్ల వరిలోనూ ఎద్దులతో 2,3 సార్లు గుంటక తోలటం ద్వారా కలుపు ఖర్చును తగ్గించుకోవడం సాధ్యమైందని అన్నారు.

గన్నీ బాగ్స్‌ను కూడా ఆచ్ఛాదనగా వాడొచ్చు
6 అడుగుల దూరంలో కర్పూర అరటి, చెక్కర కేళిలను 20 రోజులకోసారి తడి ఇస్తూ సాగు చేస్తున్నారు. గడ్డీ గాదాన్ని సాళ్ల మధ్యలో ఆచ్ఛాదనగా వేశారు. మొక్కల మొదళ్లలో తేమ ఆరినా.. ఆచ్ఛాదన అడుగున తేమ బాగా ఉంటున్నదని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉన్న ఏ సేంద్రియ పదార్థాన్నయినా ఆచ్ఛాదనగా వేయొచ్చునని పాలేకర్‌ అన్నారు.

కందికి ఒకసారే జీవామృతం
మచ్చల కంది సహా ఆదిలాబాద్‌కు చెందిన నాటు రకాల కందులను 7 అడుగుల దూరంలో సాళ్లుగా, అర అడుగుకు ఒక విత్తనం పడేలా నాగళ్లతో ఎకరంన్నర నల్లరేగడి భూమిలో విత్తారు. విత్తనానికి ముందు ఎకరానికి 200 కిలోల వరకు ఘనజీవామృతం వేశారు. ద్రవజీవామృతం ఒకేసారి అందించగలిగామని, అయినా కంది విరగ కాసిందని, చెట్టుకు అరకేజీ వరకు దిగుబడి రావచ్చని విజయరామ్‌ తెలిపారు.

4.5 నెలల్లో చెరకుకు ఒకే తడి
ఎకరం భూమిలో విజయరామ్‌ అతి తక్కువ నీటితో చెరకును సాగు చేస్తున్నారు. నాలుగున్నర నెలల క్రితం సాళ్ల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య అడుగు దూరంలో చెరకు ముచ్చెలు నాటారు. అంతర పంటలుగా కాకర, లంక దోస నాటారు. దీంతో తోటలో ఎక్కడా నేల కనపడకుండా కాకర తీగలు అల్లుకుపోయాయి. ఇప్పటికి కేవలం 2 సార్లు జీవమృతం ఇచ్చారు. గత నెలలో ఒకే సారి నీటి తడి ఇచ్చినప్పటికీ తోట బెట్టకు రాకపోవడం విశేషం. అయితే, చెరకు సాళ్ల మధ్య అలసంద కూడా వేయటం అవసరమని, నత్రజని లోపం రాకుండా ఉంటుందని పాలేకర్‌ సూచించారు. ఇప్పటికైనా అలసంద గింజలు వేయమని సూచించారు.

ఆచ్ఛాదనకు కాదేదీ అనర్హం
ప్రకృతి వ్యవసాయంలో జీవామృతంతోపాటు అంతరపంటలు, ఆచ్ఛాదన కూడా రైతులు పాటించాల్సిన చాలా ముఖ్య అంశమని పాలేకర్‌ అన్నారు. చెరకు పిప్పి, కొబ్బరి బొండం డొక్కలు, కొబ్బరి మట్టలు, గడ్డీ గాదంతోపాటు వ్యాపారుల వద్ద తక్కువ ధరకు లభించే వాడేసిన గన్నీ బ్యాగులు, పాత నూలు వస్త్రాలు సైతం ఆచ్ఛాదనగా వేయొచ్చని అన్నారు. తీవ్ర కరువులోనూ రసాయనిక ఎరువులు, పురుగుమందులు వేసిన పంటలు ఎండిపోతుంటే.. ప్రకృతి వ్యవసాయదారుల పంటలు కళకళలాడుతుండటం రైతులంతా గుర్తించాలన్నారు. దేశీ వరి వంగడాలను దిగుబడి దృష్ట్యా కాకుండా ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా సాగు చేస్తూ పరిరక్షించుకోవడం అవసరమని అంటున్న విజయరామ్‌ను 040–27635867, 99491 90769 నంబర్లలో సంప్రదించవచ్చు.
– పంతంగి రాంబాబు,
సాగుబడి డెస్క్‌

7 అడుగులు పెరిగిన కంది చేనులో విజయరామ్, చెరకు తోటలో దట్టంగా అల్లుకున్న కాకర తీగలు, అరటి తోటలో పాలేకర్‌

మరిన్ని వార్తలు