ఈ అమ్మ మణిపూస

8 May, 2014 23:06 IST|Sakshi
ఈ అమ్మ మణిపూస

 మే 11మాతృదినోత్సవంసందర్భంగా...
 
మారుమూల గ్రామంలో ఎస్‌సి కాలనీ పిల్లాడు ఎస్‌ఎస్‌సి పాసైతేనే గొప్ప... అలాంటిది ఐఎఎస్ అవ్వడం అంటే మాటలు కాదు కదా! దళితుల జీవితాలను వెలుగులోకి తెచ్చేది విద్య ఒక్కటేనని నమ్మిన ఓ తల్లి బిడ్డనెలాగైనా కలెక్టర్‌ని చేయాలనుకుంది. ఆమె ఆశయం నెరవేరడం వెనక... కన్న ప్రేమొక్కటే కాదు... కాయకష్టం కూడా ఉంది. మడమ తిప్పిన బిడ్డలో మళ్లీ స్ఫూర్తి నింపి, లక్ష్యంవైపు ముందుకు పంపిన ఆ తల్లి పేరు-మణెమ్మ. అమ్మ కలను నిజం చేసిన కొడుకు - ఆంజనేయులు. ‘బువ్వ పెట్టంగనే బాధ్యత తీరిపోదు కదా! అట్లని ఇచ్చేటందుకు... నా దగ్గర ఆస్తులేమీ లేవు. కలెక్టర్ కావాలని చిన్నగున్నప్పుడు వాడు చెప్పిన మాటలు నిజం చేయాలన్న పట్టుదల మాత్రం నాకు చానా ఉండేది. అదే వాడ్ని కలెక్టర్‌ని చేసింది’ అంటూ మణెమ్మ చెప్పిన మాటలు అందరి అమ్మల మనసుల్నీ తాకుతాయి.
 
రెండుసార్లు సివిల్స్ పరీక్ష రాసిన ఆంజనేయులు ఫలితం లేకపోవడంతో తల్లి పడుతున్న తిప్పలు చూసి సొంతూరికి తిరిగొచ్చేశాడు. ‘ఏదో ఒక ఉద్యోగం చేసి నీకు సాయపడతానమ్మా... ఇంకా ఎన్నాళ్లు ఈ తిప్పలు పడతావు’ అన్న కొడుకు మాటలకు మణెమ్మ చెప్పిన సమాధానం ఆంజనేయులు ఎప్పటికీ మరిచిపోలేడు. ‘‘నేనున్నగదా బిడ్డా... చదవలేనంటే చెప్పు... నేను చదివించలేనిదాన్ని మాత్రం కాదు. నువ్వు చిన్నప్పుడు ‘కలెక్టరైత నాయనా’ అని మీ నాయనతో అంటే ‘కలెక్టర్ కావాలె బిడ్డా... మన కాలనీ పవర్ చూపియ్యాలే బిడ్డా’ అని మీ నాయనన్న మాటలు నువ్వు మరచినవేమో... నేను మరవలేదు. ఇన్ని రోజులు కష్టపడ్డదాన్ని ఇంకో ఏడాది కష్టం చేయలేనా... నువ్వు ధైర్యంగా మళ్ల ఢిల్లీ రెలైక్కు. కలెక్టర్ అయినంకనే ఊరికి తిరిగిరా!’’ అంటూ ఆంజనేయుల్ని ముందుకు నడిపించింది మణెమ్మ. ఒక్కరోజు కూలీ పని మానితే వంద రూపాయలు పోతాయని... ఎండనకా, వాననకా కూలిపని చేసి, కొడుకును చదివించింది మణెమ్మ.
 
భర్త కోరిక...

పంచాయతీ కార్యాలయంలో నల్లాలు విప్పే పని చేసే పోచయ్యకు కొడుకును కలెక్టర్‌గా చూడాలనే ఆశ ఉండేది కానీ, తన ఆర్థిక పరిస్థితి ఆ కోరిక తీర్చదనే భావనలో ఉండేవాడు. ఆంజనేయులు పదోతరగతి స్కూల్ ఫస్ట్ వచ్చాడన్న వార్త విన్నాక మణెమ్మ, పోచయ్యల ఆనందానికి అవధుల్లేవు. అందరూ ఆంజనేయుల్ని పాలిటెక్నిక్ చదివిస్తే మంచిదని చెప్పగానే అప్పుచేసి కాలేజీలో చేర్పించారు.  తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు. చదువైపోగానే ఏదో ఒక ఉద్యోగం చూసుకుని తల్లికి సాయపడదామనుకున్నాడు. అప్పటికి హైదరాబాద్‌లో వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అమ్మతోపాటు అక్కాబావ కూడా ఆంజనేయులుకి ఆర్థికసాయం చేశారు.
 
తల్లి మాట...

ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఆంజనేయులకి హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. అక్కడ కొడుకు, ఇక్కడ ఊళ్లో మణెమ్మ పనులు చేసుకుంటూ అప్పులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఇంతలో మణెమ్మకు బిడ్డ కలెక్టర్ కల గుర్తుకొచ్చింది. ‘నువ్వు కలెక్టర్ కావాలన్న నాయన కోరిక తీరదంటవా ఆంజనేయులూ’ అంది.‘‘చాలమ్మా...ఇప్పటిదాక పడ్డ తిప్పలు చాలవా... కలెక్టర్ అంటే మాటలు కాదు. ఢిల్లీకి పోయి చదువుకోవాలే. చాలా ఖర్చు అవుతుంది’’ అన్నాడు. ‘‘ఇప్పటిదాకా ఏమైనా ఉచితంగా చదువుకున్నవా! పైసల్లేకుండా చదువెట్లొస్తది. నేనున్న కదా’’ అని తల్లి చెప్పిన మాటలు ఆంజనేయులు గుండెలో కొండంత ధైర్యాన్ని నింపాయి. అనుకున్నదే తడవుగా ఢిల్లీకి బయలుదేరాడు. అక్కడే ఉండి సివిల్స్ కోసం చదువుకున్నాడు. 60 ఏళ్ల మణెమ్మ వ్యవసాయ పనులు లేనపుడు ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లి డబ్బులు పోగు చేసింది.
 
మూడోసారి...

మాటిమాటికీ గుర్తొచ్చే తల్లి కష్టం గురించి ఆంజనేయులు తలచుకోని రోజులేదు. ‘‘2011లో శిక్షణ పూర్తయ్యాక జార్ఘాండ్‌లో గుర్మాలో సబ్‌కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం గుర్మాలోనే ఉన్నాను. అమ్మ ఊళ్లోనే ఉంటోంది. నేను ఐఎఎస్ శిక్షణలో ఉన్నప్పుడు కూడా అమ్మ ఊళ్లో వ్యవసాయం పనికి వెళ్లింది. అమ్మ ధైర్యం, పట్టుదల ముందు నేనెప్పటికీ పసివాణ్ణే’’ అని చెబుతున్నప్పుడు ఆంజనేయులు మాటల్లో ‘అమ్మ’ అన్న పదం ఎంతో కమ్మగా వినిపించింది. ‘‘చూస్తే... భర్త లేడు, ఉన్న బిడ్డను యాడ్నో పెట్టి చదివిస్తుంది. మణెమ్మకు ఆకాశమంత ఆశగాకపోతే...లక్షలు ఖర్చుపెట్టెటోళ్లకే దిక్కులేదు. అట్లాంటిది..ఈమొక్కామె కష్టంతోనే బిడ్డ కలెక్టర్ అయిపోతడా’’ అంటూ సాగిన చుట్టుపక్కలవారి మాటల్ని లెక్కచేయకుండా పట్టుదలతో బిడ్డను కలెక్టర్‌ని చేసిన మణెమ్మ  రెండేళ్లక్రితమే ఆంజనేయులుకి పెళ్లి చేసి ఆ బాధ్యత కూడా తీర్చుకుంది. బిడ్డ జార్ఘాండ్‌లో సబ్‌కలెక్టర్‌గా ఉద్యోగం చేస్తుంటే మణెమ్మ ఊళ్లో కొడుకు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తోంది. మణెమ్మ నిజంగా గొప్ప తల్లి. ఆంజనేయులు మాటల్లో చెప్పాలంటే ‘మా అమ్మ మణిపూస’.
 
- భువనేశ్వరి
 ఫొటోలు: కొలగాని రాజేందర్


         *************************

ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందని తెలియగానే పోచయ్య జేబు తడుముకున్నాడు. ‘మన వల్ల కాదేమోనే...’ అన్న భర్త మాటలకు అడ్డు చెబుతూ...‘‘ఇప్పటి దాకా పడ్డ కష్టమొకెత్తు, ఇప్పుడు పడాల్సిన కష్టమొకెత్తు. ఒక్క మూడేళ్లు కళ్లు మూసుకుంటే బిడ్డ ఇంజనీర్ అయితడు. మంచి ఉద్యోగమొస్తది. ఇద్దరం కష్టపడదం. నువ్వు ఇల్లు చూడు... నేను వాడి చదువు చూసుకుంట’’ అంటూ భర్తను ఒప్పించింది. ఆలుమగలూ ఒక్కమాటపై బిడ్డకోసం పడుతున్న కష్టానికి మరో పెద్ద కష్టం అడ్డుపడింది. కాలేయ వ్యాధితో పోచయ్య మంచం పట్టాడు. వ్యాధి ముదిరిపోవడంతో ఎంత వైద్యం చేయించినా లాభం లేకపోయింది. తండ్రి మరణంతో ఆంజనేయులు తన కలలకు సెలవు చెప్పాడు.

         *************************

‘రెండుసార్లు సివిల్స్‌లో ర్యాంకు రాకపోయేసరికి నాకు విసుగొచ్చింది. అమ్మ పడుతున్న కష్టం గుర్తొచ్చినపుడల్లా ఊరికెళిపోవాలనిపించి వచ్చేశాను. ‘‘నువ్వు వస్తే కలెక్టర్‌గానే ఇంటికి రా... ఎంత కష్టమైనా నేను పడతాను. ఆ తర్వాత నువ్వు ఏం చెబితే అది చేస్తాను’’ అన్న అమ్మ మాటలు నాలో పట్టుదలను నింపాయి. ఆ పట్టుదలే నన్ను మూడో ప్రయత్నంలో విజేతను చేసింది.
 

మరిన్ని వార్తలు