పదకొండేళ్ల తబలా విద్వాంసుడు

13 Jul, 2014 00:05 IST|Sakshi
పదకొండేళ్ల తబలా విద్వాంసుడు

ప్రతిభా కిరణం
పాండిచ్చేరిలోని ఆరోవిల్‌లో పదకొండేళ్లక్రితం పుట్టిన కేశవ్ తబలా వాద్యకారుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. కేశవ్ రెండు సంవత్సరాల వయసు నుండి తబలా నేర్చుకోవడం మొదలు పెట్టి ఏడు సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలోని కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ప్రదర్శన ఇచ్చాడు. అది అతని మొదటి ప్రదర్శన. ఎలాంటి అవరోధం లేకుండా పూర్తయిన ఆ ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది.
 
కేశవ్‌లోని ప్రతిభను మొదటగా గుర్తించింది చిత్రకారిణి అయిన అతని అమ్మమ్మ ప్రఫుల్ల దహనుకర్. మొదటి పాఠాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాడు. తరువాత ప్రజాప్రదర్శలను ఇచ్చే తబలా వాద్యకారుడు గణేశ్ బసవరాజుగారి చేతి కదలికలు నిశితంగా పరిశీలించేవాడు. తరువాత ఇంటికి వచ్చి ఆయన చేతి కదలికలను అనుకరిస్తూ తబలా వాయించేవాడు. కేశవలోని ఆసక్తిని తెలుసుకున్న బసవరాజు తనకు తీరిక దొరికినప్పుడల్లా తబలాలో తర్ఫీదు ఇచ్చాడు. కేశవ్ గిటార్‌ను కూడా అద్భుతంగా ప్లే చేయగలడు. మిగతా పిల్లల్లాగే సైకిల్ తొక్కడం, చెట్లు ఎక్కడం, చందమామ కథలు చదవడం కేశవ్‌కి ఎంతో ఇష్టం. ఈ బుడతడిని ఆదర్శంగా తీసుకుంటే, ఒక పక్క చదువుకుంటూనే నచ్చిన రంగంలోనూ రాణించవచ్చు.

మరిన్ని వార్తలు