55 రోజులు 17 వేల కిలోమీటర్లు

11 Sep, 2014 23:32 IST|Sakshi
55 రోజులు 17 వేల కిలోమీటర్లు

విశాఖపట్నం... లాసన్స్‌బే కాలనీలోని ‘బేక్ మై విష్’ కాఫీ షాప్.
 ముగ్గురు మిత్రులు కాఫీ సిప్ చేస్తున్నారు.
 ‘బైక్‌పై లాంగ్ రైడ్ చేస్తా...
 మీరొస్తారా?’
 తాగేసిన కాఫీ కప్పును టేబుల్‌పై పెడుతూ అన్నాడు కిషోర్...
 ‘వావ్... సూపర్బ్ ఐడియా.. వియార్ రెడీ... ఎన్నాళ్లు... ఎక్కడికెళ్దాం?... ఎప్పుడొద్దాం?’...
 బుల్లెట్ స్పీడ్‌తో ప్రశ్నించారు కర్ణ రాజ్, సుధీర్.
 ‘ఫ్రం హోం.. టు హోం...
 వయా ఇండియా. ఇంటి నుంచి బయల్దేరాలి. భారతదేశాన్ని
 క్లోజప్‌లో చూడాలి. రెండు నెలల్లో ఇంటికి రావాలి’...
 ప్లాన్ వివరించాడు కిషోర్.
 ‘ఓకే డన్..’ అన్నారు కర్ణ రాజ్, సుధీర్. ముగ్గురూ బైక్‌లపై
 దూసుకుపోయారు.

 
కన్యాకుమారిలో అందమైన సాయం త్రం. హిమాలయాల్లో రక్తం గడ్డ కట్టే చలితో సహవాసం. లేహ్‌లో మంచువానలో స్నానం. కొండచరియలు విరిగిపడుతున్నా చెదరని ఆత్మవిశ్వా సం. సైనికుల బంకర్లలో ఆతిథ్యం. ఇన్ని అనుభవాలు మిగిల్చిన ఆ దూరం అక్షరాలా 17 వేల కిలోమీటర్లు... 55 రోజులు.
 
విశాఖపట్నం నుంచి సుదూర యాత్ర...

బైక్‌పై సుదూర యాత్ర చేయాలన్నది కిషోర్ చిరకాల వాంఛ. దీనికి కర్ణ, సుధీర్ తోడయ్యారు. రెండు నెలల సెలవుకు కర్ణ, కిషోర్ దరఖాస్తు చేశారు. వాళ్ల బాస్‌లు కుదరదన్నారు. అంతే... ఇద్దరూ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. జూన్ తొమ్మి దిన.. కిషోర్, కర్ణ, సుధీర్ బైకుల్ని సిద్ధం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి బైక్ యాత్ర మొదలైంది. మూడోరోజు ఉదయానికి ముగ్గురూ చెన్నై చేరుకున్నారు. అక్కడ చెన్నై బుల్స్ (బుల్లెట్ రైడర్స్) అసోసియేషన్ సభ్యులు వీరికి ఘన స్వాగతం పలికారు. ముగ్గురూ మర్నాడు బయల్దేరి కన్యాకుమారి చేరుకున్నారు. అక్కడ ఒకరోజు ఉండి మర్నాడు కొచ్చిన్ మీదుగా వయనాడ్ జిల్లా కల్‌పెట్టా చేరుకున్నారు. అప్పుడే కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి. ఆహ్లాదకర వాతావ రణంలో కల్‌పెట్టాలో రెండ్రోజులు హాయిగా గడిపారు.
 
ఒకప్పటి వీరప్పన్ సామ్రాజ్యం మీదుగా...

అప్పుడే కర్ణ రాజ్ ఓ ఐడియా చెప్పాడు. హైవేపై జర్నీ బోర్ కొడుతోంది.... ఘాట్ రోడ్ అయితే మజా ఉంటుందన్నాడు. వెంటనే ముగ్గురూ కర్ణాటక వైపు బయల్దేరారు. బండిపురా చందనపు అడవుల్లోంచి సాగిపోయారు. ఒకప్పుటి చందనం స్మగ్లర్ వీరప్పన్ సామ్రాజ్యమది. అడవి అందాలను తిలకిస్తూనే మైసూరు మీదు గా బెంగళూరు చేరారు. అక్కడ మూడు రోజులుండి హైదరాబాద్, అటు నుంచి మహారాష్ట్రకు వెళుతూ సాగర్‌కు సమీపంలో ఓ దాబా దగ్గర టీ తాగారు. బాగా అలసిపోవడంతో ఆ దాబాలోనే ఆ రాత్రి నిద్రపోయారు. ‘ఓ రాత్రంతా ఉన్నా మని అద్దె డబ్బులివ్వబోతే దాబా యజమాని పండిట్‌జీ తీసుకోలేదు. ఆయన చూపిన అభిమానాన్ని మరిచిపోలేం’ అన్నాడు కర్ణ రాజ్.
 
జీరో మైల్‌స్టోన్

నాగపూర్ పట్టణంలో నుంచి వెళ్తున్నప్పుడు ఓ స్థూపం కనిపించింది. దాన్ని జీరో మైల్‌స్టోన్ అంటారు. ఇది ఇండియాకు సెంటర్ పాయింట్. నాగపూర్ దాటాక షజాపూర్‌లో ఆగారు. ఆ ఊరి మీదుగా కర్కాటక రేఖ (ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్) వెళ్తోంది. ఈ విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ముగ్గురు బైకర్లూ ఆగ్రా, ఢిల్లీ, కర్నాల్ మీదుగా చండీగఢ్ చేరుకున్నారు. చండీగఢ్ పట్టణంలో బైకులకు క్లచ్ వైరును టైట్ చేయించుకున్నారు. అక్కడి నుంచి బయల్దేరి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో చల్లని వాతావరణంలో సేదదీరారు.
 
అడుగడుగునా తనిఖీలు

మనాలీ నుంచి శ్రీనగర్ వైపు బైకులు బయల్దేరాయి. అక్కడి నుంచే అసలైన ప్రయాణం మొదలు. హిమాలయాల్లో ఎత్తయిన కచ్చా రోడ్లపై ప్రయాణం అతి కష్టం. సాయంత్రానికి తండి అనే ప్రాంతం చేరుకుని, అక్కడి పెట్రోల్ బంకులో బైకుల ట్యాంకుల్ని నింపుకొన్నారు. తండి తర్వాత 360 కిలోమీటర్ల వరకూ పెట్రోల్ బంకు లేదు. ముప్ఫయ్, నలభై కిలోమీటర్లకు ఒక ఆర్మీ పోస్టు ఎదురయ్యేది. వివరాలన్నీ సరిపోతేనే ముందుకు పంపేవారు. దారి పొడవునా కొండచరియలు విరిగిపడేవి. ఆర్మీకి చెందిన బీఆర్వో (బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) సిబ్బంది ప్రొక్లయినర్లతో రాళ్లను తొలగించాక ముందుకు కదిలేవారు. ఇంచుమించు రోజూ వర్షం. దానికితోడు చలి గాలి. రక్తం గడ్డ కట్టుకుపోయేది. ‘ఆ సమయంలో ఆర్మీ అధికారులు, జవాన్ల ఆతిథ్యం అద్భుతం. ఏమైనా సాయం కావాలా? అని స్నేహపూర్వకంగా అడిగేవార’ని కిషోర్ చెప్పాడు.
 
ఆర్మీ బంకర్‌లో ఓ రాత్రి

కిల్లార్ నుంచి కిష్ట్‌వార్ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపించింది. ఒకరోజు రాత్రిపూట ఓ ఆర్మీ చెక్‌పోస్టు వద్ద ఆగారు. అక్కడి అధికారి  బైకర్ల వివరాలు తెలుసుకున్నారు. ముందు రోడ్డు బాగా లేదనీ, అంతకుముందే ఓ వాహనం లోయలో పడిపోయి 18 మంది చనిపోయారనీ చెప్పారు. తర్వాత వచ్చే ఆర్మీ పోస్టు బంకర్‌లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకోమని చెప్పి... వెంటనే అక్కడి అధికారితో వైర్‌లెస్ సెట్‌లో మాట్లాడాడు. ‘ముగ్గురం అష్టకష్టాలు పడుతూ గంట తర్వాత సింతన్ మైదాన్ చెక్‌పోస్టుకు చేరుకున్నాం. మా కోసం అప్పటికే రోడ్డుపై నిరీక్షిస్తున్న ఓ ఆర్మీ అధికారిని చూసి ఆశ్చర్యపోయాం. అతను వేడిగా చపాతీలు, బంగాళదుంప కూరతో భోజనం పెట్టారు. బంకర్‌లో వెచ్చగా నిద్రపోయాం. ఆ ఆతిథ్యాన్ని మరిచిపోలేం’ అన్నారు సుధీర్.
 
జై జవాన్

నాలుగు రోజుల ప్రయాణం తర్వాత శ్రీనగర్, ద్రాస్ మీదుగా కార్గిల్ వార్ మెమోరియల్‌ను చేరుకున్నారు. ‘అమర జవాన్ల త్యాగాలు గుర్తొచ్చి, మా మనసంతా బరువెక్కిపోయింది. నివాళులర్పించి వెనక్కి వచ్చామ‘ని కర్ణరాజ్ చెప్పాడు. లేహ్ నుంచి 48 కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రవాణా మార్గం కర్‌దూంగ్లా పాస్, అటు నుంచి భారత్-పాక్ సరిహద్దుల్లోని త్యాక్షి చేరుకుని టెంట్లలో బస చేశారు.
 
కిరోసిన్ ఇచ్చి ఆదుకున్న ఆర్మీ అధికారి

త్యాక్షి నుంచి ముగ్గురూ సియాచిన్‌కు ముందున్న ససోమా ఆర్మీ పోస్టుకు చేరుకున్నారు. ఇది భారత్-చైనా సరిహద్దులకు సమీపంలో ఉంది. ‘అప్పటికి మా బైకుల్లో పెట్రోల్ తక్కువగా ఉంది. వెంటనే ఆర్మీపోస్టు అధికారి ప్రతాప్‌సింగ్ లీటర్ పెట్రోల్, ఏడు లీటర్ల కిరోసిన్ ఇచ్చారు. మేం దాన్నే జాగ్రత్తగా వాడుకుంటూ హుండర్, లేహ్ మీదుగా సాగిపోయాం’ అన్నాడు కర్ణరాజ్.
 
లేహ్ నుంచి మనాలీ వైపు 80 కిలోమీటర్లు ప్రయాణించి ప్యాంగాంగ్ లేక్ చేరుకున్నారు. ఇది భారత్‌లో 48 కిలోమీటర్లు, టిబెట్‌లో 58 కిలోమీటర్లు, చైనాలో 50 కిలోమీటర్లు విస్తరించి ఉంది. ‘ఈ లేక్ శీతకాలంలో పూర్తిగా గడ్డ కడుతుంది. ఆ సమయంలో జీపులో సరస్సుపై నుంచి వెళ్లొచ్చు. ఇక్కడి నుంచి చైనా పోస్టులు కనిపిస్తాయి’ అని కిషోర్ చెప్పాడు. త్సోమొరారీ, హన్‌లే లేక్‌లను కూడా చూశాక ముగ్గురూ మనాలీ మీదుగా ఢిల్లీ చేరుకున్నారు.
 
రెండు మార్గాల్లో యాత్ర ముగింపు

ఢిల్లీ చేరాక యాత్రలో స్వల్ప మార్పులు చేశారు. కర్ణ రాజ్ లక్నో, పాట్నా, కోల్‌కతా మీదుగా, కిషోర్, సుధీర్‌లు హైదరాబాద్ మీదుగా విశాఖ రావాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారం బయల్దేరారు. ఎప్పటికప్పుడు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఆగస్టు 3న ముగ్గురూ ఒకేసారి విశాఖపట్నం చేరుకున్నారు.
 
- ఎ.సుబ్రహ్మణ్య శాస్త్రి (బాలు) సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
 
ఏం పోగొట్టుకున్నామో తెలిసింది!
‘‘యాత్ర పూర్తయ్యేసరికి ఒక్కొక్కరికి రూ.2 లక్షలు ఖర్చయింది. కానీ మేం పొందిన ఆనందం ముందు అదెంత? ఎన్నో జీవితాలను దగ్గర నుంచి చూశాం. ప్రకృతి అందాన్నీ... ఆగ్రహాన్నీ కూడా చవిచూశాం. ఎందరో మంచి స్నేహితులయ్యారు. మా సుదీర్ఘయాత్రలో మేమెక్కడా పర్యావరణానికి హాని కలిగించలేదు. బిస్కెట్లు, చాక్లెట్ల రేపర్లను ఎక్కడపడితే అక్కడ పారేయలేదు. ప్రకృతి లేకుండా మనుగడ లేదని అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నాం. ఇన్నాళ్లూ జీవితంలో ఏం పోగొట్టుకున్నామో తెలుసుకున్నాం. మా జీవితాల్లో ఇంతకన్నా మించిన ఆనందం లేదని మనసారా నమ్ముతున్నాం. మా యాత్ర గురించి చదివిన కుర్రాళ్లు ఉత్సాహంతో దుస్సాహసాలు చేయొద్దని మనవి. మేమెంతో ప్రణాళికాబద్ధంగా... అంతకు మించిన అనుభవంతో సాగిపోవడం వల్లే యాత్ర విజయవంతమైంది. బహుశా ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు.’’
 - సాహస బైకర్లు కిషోర్, కర్ణ, సుధీర్
 

మరిన్ని వార్తలు