వీల్‌ చెయిర్‌ కాదు.. విల్‌ చెయిర్‌!

30 Aug, 2018 00:05 IST|Sakshi

పర్వీందర్‌ చావ్లా వయసు 48 ఏళ్లు. వీల్‌ చెయిర్‌పై ఇప్పటికి ఆరు ఖండాలను చుట్టేశారు. 23 దేశాలను çసందర్శించారు. ఒక్కో దేశానికి ఒక్కసారి మాత్రమే కాదు, రెండు–మూడుసార్లు కూడా వెళ్లారు. ఆమె టూర్లలో జస్ట్‌.. అలా చూసి వచ్చేవి మాత్రమే కాదు, ఏదో ఒక సాహసం చేసేవే ఎక్కువగా ఉంటాయి. తైవాన్‌లో పారాగ్లైడింగ్‌ నుంచి ఈక్వెడార్‌లో జిప్‌లైనింగ్‌ చావ్లా చేసి వచ్చిన సాహసాలెన్నో! సవాళ్లతో పోరాడటమెలాగో జీవితాన్నుంచి నేర్చుకున్నానని అంటున్న చావ్లాను నిజానికి నడిపించింది వీల్‌ చెయిర్‌ కాదు.. ఆమెలోని విల్‌ పవర్‌ అనే చెయిర్‌. ఏడాదిలో ఎన్ని నెలలు పర్యటనల్లో గడిపితే, యాభై ఏళ్ల లోపు ఇన్ని దేశాలు తిరగడం సాధ్యమవుతుంది? ఈవిడేమైనా కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారా అనిపిస్తుంది. అవును చావ్లా చక్రాలు కట్టుకుని దేశాలు పర్యటిస్తున్న మాట అక్షరాలా నిజం. నడవడానికి కాళ్లు సహకరించని స్థితిలో చక్రాల కుర్చీలోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. చిన్న జీవితానికి ఇంతటి సాహసం అవసరమా అని అడిగిన వాళ్లతో ‘ఎప్పుడో ఓ రోజు చనిపోవాల్సిందే కదా? చనిపోతామేమోనని భయపడుతూ ఆసక్తులను చంపుకోవడం ఎందుకు? ప్రపంచంలోని సౌందర్యాన్ని వీక్షిస్తూ, పోయేలోపు ఎన్ని చూడటం సాధ్యమైతే అన్నింటిని చూడవచ్చు’’ అంటున్నారు.  

పదిహేనేళ్ల వయసులో..!
ముంబయిలోని బాంద్రాలో నివసిస్తున్న పర్వీందర్‌ చావ్లా పుట్టింది లూధియానాలో. తండ్రి హోటల్‌ నడిపేవారు, తల్లి గృహిణి. నలుగురు పిల్లల్లో చిన్నమ్మాయి పర్వీందర్‌. పదిహేనేళ్ల వరకు ఆమె అందరిలాంటి అమ్మాయే. అప్పుడు బయటపడింది రుమటాయిడ్‌ ఆర్రై్థటిస్‌. అప్పటికే వారి కుటుంబం లూధి యానా నుంచి ముంబయికి మారిపోయింది. చావ్లా అల్లోపతి, హోమియోపతి... రకరకాల వైద్య విధానాలను పాటించారు. స్కూలు చదువు పూర్తయింది, కాలేజ్‌లో చేరింది కూడా. పన్నెండవ తరగతిలో ఫైనల్‌ పరీక్షలు. చేతి మణికట్టుని కదిలించలేకపోయింది. అప్పుడు డాక్టర్‌ దగ్గరకు వెళ్తే ఒక ఇంజక్షన్‌ వేశారు. అది స్టిరాయిడ్స్‌ అని అప్పట్లో తెలియదు.

మళ్లీ.. అక్క పెళ్లిలో!
పెళ్లి వేడుక కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారంతా. పర్వీందర్‌కి కూడా డ్యాన్స్‌ చేయాలనే ఉత్సాహం కలిగింది. ఓ వారం ముందు నుంచే ప్రాక్టీస్‌ చేస్తున్నారు యుక్తవయసు పిల్లలంతా. ఓ రోజు ఉన్నట్లుండి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూ నేల మీద చతికిలపడిపోయారు పర్వీందర్‌. ఒక మూల వీల్‌ చైర్‌లో కూర్చుని పెళ్లి వేడుకను గమనించిన పర్వీందర్‌కి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించింది. వీల్‌ చెయిర్‌ నుంచి రానురాను మంచానికే పరిమితమైతే... తల్లి మాత్రం ఎంతకాలమని చూస్తుంది? వాష్‌రూమ్‌ కెళ్లాలన్నా తల్లి సహాయం లేనిదే కదల్లేకపోతోంది. ఈ క్రమంలో ఓ రోజు ఒకరి మీద ఆధారపడి జీవించే స్థితి నుంచి తన కాళ్ల మీద తాను నిలబడి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు చావ్లా. ఆక్యుపంక్చర్, ఫిజియోథెరపీతోపాటు ప్రత్యామ్నాయ వైద్యవిధానాలన్నీ పాటించి తన పనులు తాను చేసుకోగలిగినట్లు దేహాన్ని నియంత్రణలోకి తెచ్చుకున్నారు. తర్వాత కాల్‌ సెంటర్‌లో పనిచేశారు. కొంతకాలం ‘బేబీ సిట్టింగ్‌’  (చంటిబిడ్డ తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్లినప్పుడు తిరిగి వాళ్లు వచ్చే వరకు బిడ్డకు తోడుగా ఉండటం) ఉద్యోగం కూడా చేశారు. ఆ తర్వాత సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నారు. తండ్రి హోటల్‌ నడుపుతున్నాడు కాబట్టి తనకు అంతో ఇంతో పరిచయమున్న రంగం అదొక్కటే. అందుకే చావ్లా సొంతంగా కేటరింగ్‌ సర్వీస్‌ నడిపారు. అన్నింటికంటే ముందు ఏ విషయానికీ భావోద్వేగాలకు లోనుకాకుండా ఉండగలగడం అలవాటు చేసుకున్నారు. తన మీద తనకు నమ్మకం కలిగింది. తాను ఎవరి మీద ఆధారపడి జీవించాల్సిన స్థితిలో లేదనే సంతోషం ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అప్పుడే మరో మలుపు!

కశ్మీర్‌కు టీమ్‌ టూర్‌
పర్వీందర్‌ స్నేహితులు కశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ పర్యటనకు వెళ్తున్నప్పుడు ఆమెను కూడా రమ్మని పిలిచారు. నిజానికి పర్వీందర్‌కు కూడా ఉన్న చోటనే ఉండిపోకుండా ఎక్కడికైనా వెళ్లాలని మనసులో ఉండేది. స్నేహితుల ఆహ్వానంతో సంతోషంగా ఆ టూర్‌ టీమ్‌తో కలిసిపోయింది. వెళ్లిన చోట స్నేహితులకు తన కారణంగా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తన వీల్‌ చైర్‌ను నడిపించడానికి ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నారామె. మెత్తని పొడి లాంటి మంచు గడ్డకట్టిపోయి రాయిలా పేరుకుపోయిన గుల్‌మార్గ్‌లో ఎల్తైన పాయింట్‌కు చేరడం పర్వీందర్‌ దృష్టి కోణాన్ని మార్చేసింది. అప్పటి నుంచి పర్యటిస్తూనే ఉన్నారు. 

అన్నీ సోలో టూర్‌లే
పర్వీందర్‌ తొలి పర్యటన స్నేహితులతో కలిసి వెళ్లినా కానీ, ఆ తర్వాత ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘నాకైతే కుటుంబం లేదు. వాళ్లకు కుటుంబం, పిల్లలు ఉంటారు. నేను చేసినన్ని పర్యటనలు చేయడం వాళ్లకు సాధ్యం కాదు కదా’ అంటారు నవ్వేస్తూ. ట్రావెల్‌ కంపెనీల టూర్‌ ప్యాకేజ్‌లలో చావ్లాను తీసుకెళ్లడానికి చాలా కంపెనీలు ససేమిరా అన్నాయి. ‘మీతోపాటు ఒక సహాయకుడిని తెచ్చుకోవాలి, మీరు ఆ ఖర్చు కూడా భరిస్తేనే సాధ్యమవుతుంది’ అని ఖండితంగా చెప్పేశారు. దాంతో టూర్‌ ప్యాకేజ్‌ల జోలికి వెళ్లకుండా ఒంటరిగానే పర్యటిస్తున్నారు. ‘సోలో ట్రావెల్‌ చేయాలనుకున్న తర్వాత మలేసియా పర్యటన మాత్రం స్నేహితులతో వెళ్లాను. ఆ ట్రిప్‌లోనే రెండు రోజులు మా ఫ్రెండ్స్‌ టీమ్‌తో కాకుండా ఒక్కదాన్నే కొన్ని ప్రదేశాలను ఎంపిక చేసుకుని వెళ్లాను. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. ఆ తర్వాత అన్నీ సోలో పర్యటనలే’ అన్నారు పర్వీందర్‌. ‘‘గుల్‌మార్గ్‌లో ఎల్తైన శిఖరాన్ని చేరినప్పటి అనుభూతిని మాటల్లో చెప్పలేను. స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది. ఇలాంటి అద్భుతాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి, అందమైన ప్రపంచం మొత్తాన్ని చూసి తీరాలనిపించింది. అదే (గుల్‌మార్గ్‌)నా పర్యటనలకు ఆది. అప్పటి నుంచి అలా ప్రయాణిస్తూనే ఉన్నాను’’ అని చెప్పారు.

బుక్‌ చేసుకుని వెళితే.. అక్కడ హోటలే లేదు!
పర్వీందర్‌ తన ప్లాన్‌లను వివరిస్తూ తనకు ఎదురైన క్లిష్టమైన పరిస్థితిని కూడా గుర్తుచేసుకున్నారు. ‘‘తక్కువ లగేజ్‌తో టూర్‌ ప్లాన్‌ చేసుకుంటాను. తక్కువ బడ్జెట్‌ హోటళ్లలో దిగుతాను. చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా గది తీసుకోకుండా డార్మెటరీల్లో కూడా బస చేస్తాను. ఒకసారైతే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని వెళ్లిన చోట.. ఉండాల్సిన హోటల్‌ లేనేలేదు! దానిని పడగొట్టేశారట. ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌లో హోటల్‌కి చేరుకునే సరికి అదీ పరిస్థితి. అప్పుడు టైమ్‌ రాత్రి పదకొండు. క్షణం సేపు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఒకాయన దేవుడిలా కనిపించాడు. దగ్గరలో నా బడ్జెట్‌కు సరిపోయే హోటల్‌ ఎంత దూరంలో ఉందో, ఎలా చేరుకోవాలో వివరించి సహాయం చేశాడు’’ అని చెప్పారు.ఇంకా పర్యటన దాహం తీరలేదా అంటే చిరునవ్వుతో ‘‘నా పాస్‌పోర్టు పేజీలు ప్రపంచ పటంలోని అన్ని దేశాల స్టాంపులతో నిండిపోవాలి. అదే నా కల’’ అంటారు చావ్లా. పర్యటనలతో ప్రపంచదేశాల సంస్కృతితోపాటు అనేక విషయాలను తెలుసుకున్న పర్వీందర్‌ వాటన్నింటినీ తన బ్లాగ్‌లో పొందుపరుస్తున్నారు కూడా.
– పర్వీందర్‌ చావ్లా 
– మంజీర

 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కేన్సర్‌కు నానో వైద్యం...

వ్యవసాయానికి రోబో వచ్చేసింది...

నీటి కాలుష్యానికి  కొత్త విరుగుడు! 

ఫ్యాటీ లివర్‌ ఎందుకు వస్తుంది?

'షూ'ట్‌ కేసు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బై బై రాఘవ

మణి సార్‌ ఫామ్‌లో ఉండి తీశారు – ఏఆర్‌ రెహమాన్‌ 

అలియాస్‌ ప్రీతి

ఆట  మొదలు

ప్రయాణానికి సిద్ధం

గుండమ్మ కథ గుర్తొచ్చింది : అశ్వనీదత్‌