ఇంటి మీద 24 కూరగాయల పంట!

13 Nov, 2018 06:35 IST|Sakshi
ఇంటిపంటల్లో లీనా నాయర్‌

ఇంటి పంట

ఆ ఇంటి డాబాపైన 1,800 చదరపు అడుగుల వైశాల్యంలో 24 రకాల కూరగాయ మొక్కలు, రకారకాల దుంపల మొక్కలు, ఆకుకూరలతో,  తీగలతో పచ్చదనం ఉట్టిపడే కూరగాయల చిట్టడవిలా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటున్నది హైదరాబాద్‌ రామంతపూర్‌ న్యూగోకుల్‌నగర్‌లోని లీనానాయర్, గోపక్‌కుమార్‌ దంపతుల ఇల్లు. రసాయనిక ఎరువులతో, మురుగునీటిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలతో అనారోగ్యం పాలవుతామన్న భయంతో సొంతంగా పండించుకున్న ఆకుకూరలు, కూరగాయలనే ఈ దంపతులు తింటున్నారు.  గ్రోబ్యాగ్స్, కుండీల్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వంటింటి వ్యర్థాలతో పాటు  వారాంతపు సంతలు ముగిసిన తర్వాత వ్యాపారులు పడేసిన కూరగాయ వ్యర్థాలను సేకరించి కంపోస్టు తయారీకి ఉపయోగిస్తున్నారు.

చుక్కకూర, గోంగూర, పాలకూర, కొత్తిమీర, బచ్చలికూర, తోటకూరలతో పాటు ముల్లంగి, క్యారెట్, ఆలుగడ్డ, చామగడ్డ, మొరంగడ్డ, బీట్‌రూట్‌ తదితర దుంపలు కూడా పండిస్తున్నారు. చిక్కుడు, గోకర కాయ, బెండకాయ, బఠాణి, బీన్స్‌తోపాటు పొట్ల, సొర, కాకర కాయలతో పాటు నిమ్మ, నారింజ, బత్తాయి వంటి పండ్లను సైతం మేడమీద ఏడాది పొడవునా పండిస్తున్నారు. కొత్తిమీర, మెంతికూరతోపాటు పెసర, ఆవాలు తదితర రకాల మైక్రోగ్రీన్స్‌ను కూడా సాగు చేస్తున్నారు. అధికంగా కారం, రుచి కలిగిన పచ్చిమిర్చి రకాలను పండిస్తున్నారు. ఒక వంతు పశువుల పేడ, రెండింతల ఎర్రమట్టి, వర్మీకంపోస్ట్‌ను కలిపిన మట్టి మిశ్రమాన్ని ఇంటిపంటల సాగుకు వాడుతున్నారు. వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు ఇంటిపంటల సాగు, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేయడంలో కూడా లీనా నాయర్‌ శిక్షణ ఇస్తుండడం విశేషం.
– మునుకుంట్ల అశోక్, సాక్షి, రామంతపూర్‌

ఇంటిపంటలతో శారీరక రుగ్మతలు పోయాయి
వంటింటి వ్యర్ధాలను ఎరువుగా తయారు చేసుకుంటూ.. కేవలం రూ.10ల ప్లాస్టిక్‌ కవర్లలో పెద్ద ఖర్చు లేకుండానే అన్ని రకాల కూరగాయలను పండిస్తున్నాం. అధికంగా కూరగాయలు సాగయినప్పుడు ఆర్గానిక్‌ మార్కెట్లలో అమ్మి, ఆ డబ్బుతోనే విత్తనాలు కొంటున్నాం. సేంద్రియ ఇంటిపంటల కూరగాయలతో ఎన్నో వ్యాధులు నయమవుతున్నాయి. తరచుగా ఒళ్లు నొప్పులు, ఇతర రుగ్మతలతో బాధపడే నాకు ఈ కూరగాయలు తింటే అనూహ్యంగా, ఆరోగ్యంగా మారిపోయాను. స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇంటిపంటలపై అవగాహన కల్గిస్తూ సేంద్రియ ఎరువుల తయారీలో కూడా శిక్షణ ఇస్తున్నామన్నారు.
– లీనా నాయర్‌ (98857 00644), రామంతపూర్, హైదరాబాద్‌

మరిన్ని వార్తలు