అలా పిలవొద్దు!

22 May, 2019 00:44 IST|Sakshi
అఫ్షాన్‌ ఆషిక్‌ రాళ్లు విసిరినప్పటి ఫొటో

ఒక మనిషి మీద ఏదైనా ముద్ర పడితే అదే చట్రంలోంచి ఆ వ్యక్తిని చూడటం సమాజానికి అలవాటు. ఒకసారి ఈ చట్రంలో ఇరుక్కున్నాక ఆ ముద్ర నుంచి బయటపడటం చాలా కష్టం. కశ్మీరీ యువతి అఫ్షాన్‌ ఆషిక్‌ ఇప్పుడు అలాంటి పోరాటమే చేస్తోంది. స్టోన్‌ పెల్టర్‌ గా సమాజం వేసిన ముద్రను చెరిపేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగా తనను తాను నిరూపించుకోవాలనుకుంటోంది. దేశానికి ప్రాతినిధ్యం వహించి తనపై పడిన ముద్రను శాశ్వతంగా తుడిచేసుకోవాలని ఆరాటపడుతోంది.రెండేళ్లు వెనక్కు వెళితే 2017, డిసెంబర్‌ లో అఫ్షాన్‌ ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయింది. ఆ ఫొటో ఆమె జీవితాన్ని ఎన్నో మలుపులు తిప్పింది. ఆమె గురించి అందరికీ తెలిసేలా చేసింది. ‘ఆ సంఘటన తర్వాత నా జీవితం ఒకేలా లేదు. మంచికో, చెడుకో ప్రజలు నన్ను గుర్తు పడుతున్నార’ని అఫ్షాన్‌ అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటుంది.

ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్మూకశ్మీర్‌ పోలీసులపైకి వీరావేశంతో రాళ్లు విసురుతున్న ఆమె ఫొటో అప్పట్లో ప్రసారసాధనాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా తిరిగింది. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్‌ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ’స్లోన్‌ పెల్టర్‌’ ముద్ర వేసింది. దీని నుంచి బయటపడేందుకే ఆమె పోరాటం చేస్తోంది.తన స్థానంలో అప్పుడు ఎవరున్నా అలాగే చేసుండేవారని అఫ్షాన్‌ ఆనాటి ఘటనను గుర్తు చేసుకుంది. తాను స్థానిక పోలీసులకు వ్యతిరేకంగా మాత్రమే రాళ్లు రువ్వానని సైన్యానికి వ్యతిరేకంగా కాదని స్పష్టం చేసింది. ‘‘రెండేళ్ల క్రితం జరిగిన ఘటన ఇంకా నా కళ్ల ముందు కదలాడుతోంది. పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. మా విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్‌ స్టోన్‌ పెల్టర్‌ను కాదు. నా మీద వేసిన ఈ ముద్రను దయచేసి తొలగించండి’’ అంటూ అఫ్షాన్‌ వేడుకుంది.

ఈ ఘటన జరిగిన తర్వాత నెల రోజులు ఆమె ఇంటికే పరిమితమైంది. తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్‌ ఆటకు దూరమైంది. అఫ్షాన్‌ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘పోలీసులపై నేను రాళ్లు విసిరిన విషయం మా నాన్నకు రెండు నెలల తర్వాత తెలియడంతో నన్ను కట్టడిచేశారు. నెలరోజుల పాటు కాలు బయట పెట్టకుండా చేయడంతో ఫుట్‌ బాల్‌ ఆడలేకపోడం నన్ను ఎంతోగానో బాధ పెట్టింది. ఒకరోజు భోజనం చేస్తుండగా నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాన’’ని చెప్పుకొచ్చింది. జమ్మూకశ్మీర్‌ క్రీడల శాఖ కార్యదర్శి ఆమెకు దన్నుగా నిలవడంతో ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. పోలీసులపై రాళ్లు విసిరిన విషయం తెలిసినప్పటికీ ఆయన తనను ఎంతగానో ప్రోత్సహించారని అఫ్షాన్‌ వెల్లడించింది. ‘‘ఈ ఘటన జరిగిన తర్వాత నన్ను ఎవరూ గుర్తు పట్టరన్న నమ్మకంతో శిక్షణకు వెళ్లాను. క్రీడల శాఖ కార్యదర్శి నా దగ్గరకు వచ్చి ‘సోషల్‌ మీడియాలో నువ్విప్పుడు పాపులర్‌ అయిపోయావ్‌’ అని చెప్పడంతో నేనేం చేశానని ఎదురు ప్రశ్నించాను. నాకేమీ తెలియదని బుకాయించాను. ‘నువ్వేమీ భయపడకు. నీకు అండగా నేనుంటాను. అసలేం జరిగిందో మీడియాతో చెప్పమనడం’తో ఒప్పుకున్నాను. నాకు ఆయన అండగా నిలిచార’’ని అఫ్షాన్‌ గుర్తు చేసుకుంది.

24 ఏళ్ల అఫ్షాన్‌ ఆషిక్‌ ప్రస్తుతం ముంబైలో క్రీడాజీవితం కొనసాగిస్తోంది. తాజాగా జరుగుతున్న భారత మహిళల లీగ్‌(ఐడబ్ల్యూఎల్‌)లో కొల్హాపూర్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. గతేడాది జమ్మూకశ్మీర్‌ జట్టుకు ఆడిన ఆమె కోచ్‌ సత్పాల్‌ సింగ్‌ సూచన మేరకు కొల్హాపూర్‌ టీమ్‌లో చేరింది. దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ముంబైరావడానికి ముందు శ్రీనగర్‌ లో ఫుట్‌ బాల్‌ కోచ్‌ గానూ అఫ్షాన్‌ వ్యవహరించింది. స్వంతంగా యూనిక్‌ ఫుట్‌ బాల్‌ గాల్స్‌ పేరుతో స్పోర్ట్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేసి దాదాపు 150 మంది బాలికలకు ఆట నేర్పించింది.దీనికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. బాలికలకు ఓపెన్‌ గ్రౌండ్‌ ఇవ్వడానికి స్థానిక ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఒప్పుకోలేదు. అఫ్షాన్‌ పట్టు వదలపోవడంతో ప్రభుత్వం దిగివచ్చింది.

శ్రీనగర్‌ లోని టీఆర్సీ మైదానంలో బాలికలకు శిక్షణ ఇచ్చేందుకు సర్కారు నుంచి అనుమతి సాధించింది. ముంబై నుంచి తిరిగొచ్చేయాలని తన దగ్గర ఆట నేర్చుకుంటున్న బాలికలు అడుగుతుంటారని అఫ్షాన్‌ తెలిపింది. తన సహచర కోచ్‌ మసూద్‌ ప్రస్తుతం వీరికి శిక్షణ ఇస్తున్నాడని చెప్పింది.ఫుట్‌ బాలర్‌గా మారిన స్టోన్‌ పెల్టర్‌ గా తనను వర్ణించడాన్ని అఫ్షాన్‌ అస్సలు ఒప్పుకోదు. ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగానే తనను గుర్తించాలని ఆమె ఆరాటపడుతోంది. ‘‘ఎవరైనా నన్ను స్టోన్‌ పెల్టర్‌ అని పిలిస్తే కాదని గొంతెత్తి ఆరవాలనిపిస్తుంది. నేను గోల్‌ కీపర్ని. ఫుట్‌ బాల్‌ ఆడేటప్పడు బాగా త్రో చేయగలను. ఏదో ఒకరోజు ఫుట్‌బాల్‌ క్రీడాకారిణిగానే నన్ను అందరూ గుర్తు పెట్టుకుంటార’’ని అఫ్షాన్‌ అభిలషించింది. ఆమె అనుకున్నట్టుగా జరగాలని మనమంతా కోరుకుందాం.

– పోడూరి నాగ శ్రీనివాసరావు
సాక్షి వెబ్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు