30 శాతం మంది తెలుగు విద్యార్థులే

18 Jan, 2015 23:31 IST|Sakshi
30 శాతం మంది తెలుగు విద్యార్థులే

విశ్వేశ్వరయ్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఎన్‌ఐటీ).. పరిచయం అక్కర్లేని విద్యా సంస్థ. దేశం గర్వించదగ్గ ఇంజనీర్,భారతరత్న అవార్డ్ గ్రహీత మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరుమీదుగా ఏర్పడిన ఈ సంస్థకు ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో మంచి పేరుంది. ఇక్కడ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్న నన్నపరాజు నైషద్ తన క్యాంపస్ లైఫ్‌ను వివరిస్తున్నాడిలా..
 
క్యాంపస్ లైఫ్
మాది హైదరాబాద్. జేఈఈ మెయిన్-2012లో విజయం సాధించి ఎన్‌ఐటీ -నాగ్‌పూర్‌లో చేరాను. ప్రస్తుతం బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సెకండియర్ చదువుతున్నాను. 220 ఎకరాల్లో క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ తెలుగు విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువ. బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లూ కలుపుకుని 30 శాతం మంది తెలుగు విద్యార్థులు ఇక్కడ ఉన్నారు.
 
సౌకర్యాలు అత్యుత్తమం
ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉం టుంది. అందరికీ ల్యాన్ సౌకర్యం కల్పిస్తారు. ర్యాగింగ్ ఇంటరాక్షన్ వరకే పరిమితం. ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి హాస్టల్‌లో సదుపాయాలున్నాయి. హాస్టల్ కామన్‌రూమ్‌లో భాగంగా పత్రికలు, మ్యాగజైన్లు అందుబాటులో ఉంటాయి. ఇన్‌స్టిట్యూట్ ఉత్తర భారతదేశంలో ఉన్నా మన తెలుగు వంటకాలన్నీ లభిస్తాయి. భోజనం రుచిగా ఉంటుంది. తరగతి గదులు, లేబొరేటరీలు, లైబ్రరీ వంటివి అత్యుత్తమ స్థాయిలో ఉన్నాయి.
 
ఇండస్ట్రీ విజిట్స్
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఆయా బ్రాంచ్‌లు, షెడ్యూల్‌ను బట్టి క్లాసులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఫ్యాకల్టీ చాలా బాగా బోధిస్తారు. సబ్జెక్టు సందేహాలను నివృత్తి చేస్తారు. గెస్ట్ లెక్చర్లు ఇవ్వడానికి విద్యాసంస్థలు, పరిశ్రమల నుంచి నిపుణులు వస్తుంటారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను ఇండస్ట్రీ విజిట్స్‌కు కూడా తీసుకెళ్తారు.
 
హ్యుమానిటీస్ కూడా
ప్రతి సెమిస్టర్‌లో రెండు ఇంటర్నల్స్, ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటితోపాటు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సు పూర్తయ్యేలోపు హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి. వీటిల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వీటిల్లో వచ్చిన మార్కులను కూడా క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (సీజీపీఏ)లో కలుపుతారు. నేను ఇప్పటివరకు 10కి 7.58 సీజీపీఏ సాధించాను.
 
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌ల్లో విద్యార్థులకు మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా రూ. 22 లక్షల వరకు కంపెనీలు వేతనాలు అందించాయి. ప్రధానంగా కోర్ బ్రాంచ్‌లు (మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్) చదివే విద్యార్థులు మంచి ఉద్యోగావకాశాలు పొందుతున్నారు.
 
మేనేజ్‌మెంట్ ఫెస్ట్ ప్రత్యేకం
ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, మేనేజ్‌మెంట్ ఫెస్ట్ నిర్వహిస్తారు. గతేడాది టెక్నికల్ ఫెస్ట్‌కు మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్‌కలాం హాజరయ్యారు. ఏ ఎన్‌ఐటీలో నిర్వహించని మేనేజ్‌మెంట్ ఫెస్ట్‌ను ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా నిర్వహిస్తారు.
 
ఈ-సెల్ అందించే సేవలెన్నో
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునేవారి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్ ఉంది. విద్యార్థుల ఆలోచనలు నచ్చితే స్టార్టప్‌కు కావాల్సిన ఆర్థిక వనరులు అందిస్తారు. స్టార్టప్ విజయవంతం కావడానికి సూచనలు, సలహాలు ఇస్తారు. కోర్సు పూర్తయ్యాక రెండేళ్లు జాబ్ చేసి తర్వాత ఎంబీఏ చేస్తా.

మరిన్ని వార్తలు