కన్యాదానం ఏంటీ?

8 Mar, 2019 03:09 IST|Sakshi

సంస్కారం

భారతదేశంలో చాలాకాలంగా పాతుకుపోయిన పితృస్వామ్య వ్యవస్థకు భిన్నంగా, ఒక మహిళ పౌరోహిత్యం వహించి, కన్యాదానం లేకుండా వివాహం జరిపించింది. ‘‘పితృస్వామ్య వ్యవస్థ నుంచి బయటకు వచ్చి, మహిళ ప్రాధాన్యతను తెలియచేయాలనుకున్నాను’’ అంటారు నందిని భౌమిక్‌. అన్విత జనార్దన్, అర్క భట్టాచార్యల వివాహాన్ని కన్యాదానం లేకుండా చేయించారు. స్త్రీ సాధికారతను తెలియచేయాలన్నదే నందిని భౌమిక్‌ లక్ష్యం. జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయంలో టీచర్‌గా పనిచేస్తున్న నందిని, ఈ పది సంవత్సరాల కాలంలో 40 పెళ్లిళ్లు కన్యాదానం లేకుండా చేయించారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే, పది నాటక కంపెనీలలో... మతాంతర, కులాంతర వివాహ విధానాలను ప్రదర్శిస్తున్నారు.

భౌమిక్‌లో ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ఆవిడకు విద్య నేర్పిన గౌరీ ధర్మపాల్‌. పౌరోహిత్యంతో వచ్చే ధనంలో అధికభాగం అనాథలకు అందచేస్తున్న నందిని, తన ప్రాణ స్నేహితురాలితోను, కాలేజీ విద్యార్థులతోనూ కలిసి ఈ వేడుకను కొత్తగా జరిపించారు.సంస్కృతంలో ఉన్న మంత్రాలను ఇంగ్లీషు, బెంగాలీ భాషలలోకి అనువదించి, వధూవరుల చేత పలికిస్తున్నారు నందిని. ఆమెతో వచ్చిన విద్యార్థులు బ్యాక్‌ గ్రౌండ్‌లో రవీంద్ర సంగీత్‌ ఆలపిస్తుంటారు.‘‘చాలామంది మగ పురోహితులు మంత్రాలను తప్పులు పలకడం గమనించాను. మా స్నేహితుల వివాహంలో నందిని చేస్తున్న వివాహంలో ఆవిడ సంస్కృత మంత్రాలను వివరించడం చూసి, నా వివాహం ఆమె చేత చేయించుకోవాలనుకున్నాను’’ అంటారు అర్క.

ఋగ్వేదంలో కన్యాదానం లేని వివాహాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. అందుకే నందిని... కన్యాదానం లేని వివాహాల గురించి ప్రచారం చేయడానికి నడుం బిగించారు. సంస్కృత పండితుడైన నృసింహప్రసాద్‌ భాదురి... మహిళలు పౌరోహిత్యం వహించకూడదని హిందూధర్మం ఎన్నడూ చెప్పలేదని, వేదాల గురించి జరిగిన చర్చలలో మహిళలు పాల్గొని ఆధ్యాత్మిక, తాత్విక అంశాలలో ప్రతిభను ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయని అంటారు. నందిని గురించి తెలుసుకున్న యువత ఇప్పుడు ఆమెను చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.
– జయంతి
 

మరిన్ని వార్తలు