ఆ కుటుంబంతో నాలుగు పదుల అనుబంధం మాది

2 Sep, 2016 17:13 IST|Sakshi
ఆ కుటుంబంతో నాలుగు పదుల అనుబంధం మాది

- వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల మండల సీనియర్ మహిళా నేత, రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ మాజీ ఛైర్‌పర్సన్ కృష్ణమ్మ
ఆయనకు గుండెధైర్యం ఎక్కువ. మనోనిబ్బరం గల మనిషి. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని నిలబడ్డ ధీమంతుడు. పూర్వం నుండి మా కుటుంబం కాంగ్రెస్‌లో కొనసాగుతూ, విద్యా సంస్థల అధినేత వీరారెడ్డికి అండగా నిలబడింది. కాలక్రమేణా ఆయన తెలుగుదేశంలోకి పోయినా మేము కాంగ్రెస్‌లోనే ఉండిపోయాము. వైయస్ రాజశేఖరరెడ్డి ‘రెడ్డి కాంగ్రెస్’ తరఫున పోటీ చేసి గెలుపొంది, తన వెంట ఆరేడుమంది ఎమ్మెల్యేలను తీసుకుని, పోరుమామిళ్లలో మా ఇంటికి వచ్చాడు.

మేము సాదరంగా స్వాగతం పలికాము. ‘మీరు కూడా నా వెంట వుండండి... ఎమ్మెల్యేలకు ఇస్తున్న గౌరవమే మీకు ఇస్తాను’... వైయస్ అన్న మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. అంతే ఆనాటి నుండి మా కుటుంబం ఆయన వెంట నడిచింది. వారి ఇంటి ఆడపడుచుగా నన్ను గౌరవించారు. నేను కూడా ఆయన్ను అన్నలా....తమ్మునిలా అభిమానిస్తూ, గౌరవిస్తూ రాఖీ కట్టేదాన్ని. క్రిస్మస్ వస్తే పులివెందులలో వారి ఇంటికి వెళ్లి పండుగలో పాల్గొనేవారం. ఆయన పులివెందులలో గృహప్రవేశం చేసినపుడు పుట్టింటి ఆడబిడ్డగా నేనే ఇంటిల్లిపాదికి దుస్తులు పెట్టాను. అంతటి అనుబంధం మాది. ఈ అనుబంధం ఆయన కనుమరుగయ్యేంత వరకు సాగింది. అదే ఆప్యాయత జగన్‌మోహన్‌రెడ్డితో సాగుతోంది.
* మర్రి చెన్నారెడ్డి తరువాత ముఖ్యమంత్రిగా వైయస్‌ను ఎంపిక చేస్తారని అందరం ఆశించాం. ఆయనైతే తనను కాదని వేరేవారిని ఎంపిక చేయరని గట్టిగా విశ్వసించారు. అయితే సీల్డ్ కవర్‌లో నేదురుమల్లి జనార్దనరెడ్డి పేరు రావడంతో మేమంతా నిరుత్సాహానికి లోనయ్యాం. ఊహించని ఈ పరిణామాన్ని ఆయన తట్టుకోలేడనుకున్నాం. అయితే ఆయనే మమ్మల్ని ఓదార్చడం మరచిపోలేము. నిజంగా ఆయన మేరునగధీరుడు. అనేక సందర్భాల్లో సలహాలు ఇచ్చాను. నేను చెప్పినవాటిని ఆయన ఏనాడూ చులకనగా తీసుకోలేదు. మా కుటుంబానికి ఇంట్లోనే కాదు రాజకీయంగా కూడా సముచితస్థానం ఇచ్చారు.
* పరిచయం వున్నవారిని గుర్తు పెట్టుకుని పలకరించడం ఆయనకు మాత్రమే సాధ్యం. రాష్ట్రం పట్ల ఆయనకు స్పష్టమైన అవగాహన వుంది. ప్రజలకు ఏమి చేయాలో ఆయనకే తెలుసు. పేదల కష్టాలపై ఆయనకు ఎన్నో ఆలోచనలు ఉండేవి. అందరూ తన వారేనని భావిస్తారు. అంతటి మహోన్నత వ్యక్తిని జీవితాంతం మరువలేం.

మరిన్ని వార్తలు