నమ్మదగని రోజులు

13 Nov, 2019 04:13 IST|Sakshi

‘‘అమ్మా! భవ్య వాళ్లింట్లో ఆడుకుంటా’’ అని పాపాయి అడిగిన వెంటనే తల్లి ‘‘అలాగే వెళ్లిరా! గోడలెక్కకు, చెట్ల కొమ్మలు పట్టుకుని వేళ్లాడకు. బొమ్మలతో ఆడుకుని వచ్చెయ్యి’’ అని జాగ్రత్తలు చెప్పి పంపించే రోజులు కావివి. పాపాయి వెళ్లే ఇంట్లో ఎవరెవరుంటారు? వాళ్ల ప్రవర్తన ఎలాంటిది? పాపాయిని ఒంటరిగా పంపించడం శ్రేయస్కరమేనా అని ఒకటికి పదిసార్లు తరచి చూసుకోవాల్సిన రోజులు దాపురించాయి. ఇందుకు వర్షిత, ద్వారక తాజా ఉదాహరణలు.

వర్షిత ఐదేళ్ల పాపాయి. చిత్తూరు జిల్లాలో ఓ గ్రామం. అమ్మానాన్నలతో పెళ్లికి వెళ్లింది. పెళ్లిలో ఒక వ్యక్తి పాపాయిని దగ్గరకు తీశాడు. చిన్న పిల్లలంటే ఇష్టం కాబోలనే అనుకున్నారు చూసినవాళ్లు. పాపాయితో సెల్ఫీలు తీసి, ఆ ఫొటోలను వర్షితకు చూపిస్తూ మాలిమి చేసుకున్నాడు. అతడి చేష్టలను ఏ మాత్రం అనుమానించకపోవడం వల్ల పాపాయి తల్లి కూడా కొద్దిసేపు దృష్టి మరల్చింది.

పిల్లలను కంటికి రెప్పలా చూసుకునే తల్లి రెప్పపాటు కాలం సమాజాన్ని నమ్మడమే ఒక అఘాయిత్యానికి దారి తీసింది. వర్షిత కనిపించడం లేదని గ్రహించి వెతికేటప్పటికే ఆమె విగతజీవిగా మారింది. అంతకంటే ముందు అత్యాచారానికి గురైంది. సమాజంలో నశించిపోయిన సున్నితత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ పసిప్రాణం గాల్లో కలిసిపోయింది.

ఓ కన్ను వేస్తే సరిపోదు
సమాజంలో నేరాలు పెరిగిపోతున్నాయి. ‘పోక్సో’ చట్టాన్ని పరిహసిస్తూ పసిపిల్లల మీద లైంగిక నేరాలు పెచ్చుమీరిపోతున్నాయి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నారని తెలిస్తే ‘హమ్మయ్య! ఓ గంట సేపు అల్లరిని భరించే కష్టం తప్పిపోతుంది’ అనుకుంటే అంతకంటే అవివేకం మరోటి ఉండదంటున్నారు ఆక్టోపస్‌ ఎస్‌పీ రాధిక. ‘‘ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకువస్తుందో ఊహించలేం.

పిల్లలు మనింట్లో ఆడుకుంటున్నప్పుడు వాళ్ల మీద ఒక కన్ను వేసి ఉంచితే సరిపోతుంది. బయట వేరే ఇళ్లలో ఆడుకోవడానికి వెళ్తే రెండు కళ్లూ వాళ్ల మీదనే ఉండాలి. ఆ వెళ్లే ఇంటి గురించి, ఆ ఇంటి మనుషుల గురించి తెలియకపోతే పిల్లల్ని ఒంటరిగా పంపించనేకూడదు. ఇలాంటి ప్రమాదాలు అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకూ తప్పడం లేదు’’ అన్నారు రాధిక.

ఎటు నుంచి అయినా!
వాచ్‌మన్‌ దగ్గర నుంచి డ్రైవర్, ఇంట్లో పనివాళ్లు, స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు ఇళ్లవాళ్లు, ట్యూషన్‌మాస్టర్, సహోద్యోగులు.. ఎవరినీ గుడ్డిగా నమ్మి పిల్లల్ని వాళ్ల చేతిలో పెట్టే పరిస్థితి నేడు లేదు. వీధి చివర ఉండే కిరాణా కొట్టులో పని చేసే కుర్రాళ్ల నుంచి ప్రమాదాలు ఎదురైన సంఘటనలూ ఉన్నాయి. ఇంట్లో పని వాళ్ల నుంచి అపార్ట్‌మెంట్‌ పనుల వరకు ఒక కొత్త వ్యక్తిని పనిలో పెట్టుకునేటప్పుడు వారి పూర్వాపరాలను విచారించుకోవాలి.

ముఖ్యంగా స్కూల్‌ యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డు నుంచి, బస్‌ క్లీనర్‌ నియామకం వరకు ఆచితూచి చూడాలి. నేరచరిత్ర ఉన్నవారిని, తాగుబోతులను ఇలాంటి ఉద్యోగాల్లో అస్సలే పెట్టుకోకూడదు. ప్రతిఘటించడానికి శక్తి లేని, ఏం జరిగిందో చెప్పలేని పసిపిల్లలనే కామాంధులు టార్గెట్‌ చేస్తున్నారు. విజయవాడలో ద్వారక అనే ఎనిమిదేళ్ల చిన్నారిని ఆ కుటుంబానికి తెలిసిన వ్యక్తే చంపేసిన ఘటనను.. పిల్లల విషయంలో ఎంత తెలిసిన వాళ్లనైనా నమ్మకూడదు అనే హెచ్చరికగా పరిగణించాలి.   
వాకా మంజులారెడ్డి

అంతకన్నా నేరం ఉండదు
‘‘చాలా మంది లైంగిక నేరగాళ్లు పిల్లలతో ముందుగా ఇలాంటి చనువు ఏర్పరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల్ని ఆడుకోవడానికి పంపించి పేరెంట్స్‌ టీవీ సీరియళ్లకు అతుక్కుపోతుంటే అంతకంటే పెద్ద నేరం మరొకటి ఉండదనే చెబుతాను. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ పిల్లలను వేరెవరి మీదనైనా వదలాల్సి వచ్చినప్పుడు కూడా సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలతో మాట్లాడుతూ వాళ్లు ఆటల్లో ఎవరెవరితో కలుస్తున్నారో తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలకు ఆస్తులు సంపాదించి పెట్టడం కోసం భార్యాభర్తలిద్దరూ సంపాదనలో పడిపోతున్నారు. పిల్లలకు అందమైన బాల్యాన్ని పదిలంగా పరిరక్షించగలిగితే అంతకు మించిన సంపద మరొకటి ఉండదు.
రాధిక జి.ఆర్‌.
ఎస్‌.పి. ఆక్టోపస్, ఏపీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా