సొంతంగా రెండు చక్రాల సవారీ..

5 Jun, 2020 09:24 IST|Sakshi

లాక్‌డౌన్‌ ఎలాంటి వాళ్లకైనా చాలా పనులు సొంతంగా చేసుకునేలా నేర్పిస్తుంది. మున్నీ బాల సుమన్‌ కూడా అలా ఓ కొత్తపనికి శ్రీకారం చుట్టింది. మున్నీ వయసు 50 ఏళ్లు. జార్ఖండ్‌లోని ఔరంగాబాద్‌ నబీనగర్‌ రోడ్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో నర్సుగా విధులను నిర్వర్తిస్తుంది. తను నివాసం ఉండే బొకారో స్టీల్‌ సిటీలో నివసిస్తున్న మున్నీ తను ఉన్న చోటు నుంచి ఆరోగ్యకేంద్రానికి వెళ్లాలంటే కనీసం ఐదుకిలోమీటర్లు దూరం వెళ్లాలి. రోజూ బస్సులో వెళ్లే మున్నీ లాక్‌డౌన్‌ వల్ల ఎలాంటి రవాణా సదుపాయాలు లేకపోవడంతో 20 రోజులపాటు కాలినడకనే హాస్పిటల్‌కు వెళ్లింది.

ఈ సమయంలో సొంతంగా వాహనం ఉంటే బాగుండేది అనుకున్న మున్నీకి బైక్‌ కొనుగోలు చేసేంత డబ్బు లేదు. దాంతో సైకిల్‌ కొందామనుకుంది. లాకౌడౌన్‌ నిబంధనలు సడలించగానే రూ.4,600 పెట్టి సైకిల్‌ కొనుక్కుంది. చిన్నప్పుడు సైకిల్‌ తొక్కడం నేర్చుకోలేదన్న మున్నీ ఆసుపత్రి ప్రాంగణంలోనే మూడు రోజులపాటు సైకిల్‌ తొక్కడం నేర్చుకుని నాల్గవ రోజు నుండి తను ఉంటున్న ఆరోగ్య శిబిరం నుండి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి సైకిల్‌ తొక్కుకుంటూ వెళుతోంది  50 ఏళ్ల వయసులో సైకిల్‌ తొక్కడం నేర్చుకొని, మొదటిసారి సొంతంగా సైకిల్‌పై విధులకు వెళ్లడం చాలా ఆనందంగా ఉంద’ని చెబుతుంది మున్నీ.
 

మరిన్ని వార్తలు