ఎవరితో పంచుకోకూడని 6 విషయాలు

15 Nov, 2018 17:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: మహిళలు వారి భర్తలతో కంటే ఆప్త మిత్రులతోనే అన్నీ విషయాలు పంచుకుంటారని తాజాగా చేసిన ఓ సర్వేలో తేలింది. ఇద్దరు మహిళలు మిత్రులైతే గొడవల నుంచి ముద్దుల వరకు వారి వ్యక్తిగత విషయాలన్నింటినీ షేర్‌ చేసుకుంటారని ఆ సర్వే వెల్లడించింది. తమ స్నేహితురాళ్లు చెప్పిన విషయాలను అబ్బాయిలు కూడా పాటిస్తారని తెలిసింది. అయితే అతిగా షేర్‌ చేసుకోవడం మంచిది కాదని, ఈసారి మీ వ్యక్తిగత విషయాలను మిత్రులతో పంచుకునేటపుడు కింది విషయాల్లో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

1. భాగస్వామితో జరిగిన గొడవలు.. 
రిలేషన్‌షిప్‌లో ఉన్న వ్యక్తితోగానీ, భాగస్వామితో జరిగిన ప్రతీ గొడవను, మనస్పర్థను మిత్రులతో పంచుకోకూడదు. అలా చెబితే వారు అతన్ని లేదా అమెను చులకన భావంతో చూసే అవకాశం ఉంది. గొడవ తర్వాత ఇద్దరూ కలసిపోయినా, అవి విన్న వారు మాత్రం ఆ విషయాన్ని మరచిపోకుండా భవిష్యత్తులో మీపై రుద్దే అవకాశం ఉంది. అత్యవసరమైనవి మాత్రమే పంచుకోవాలి. 

2. బాధపడిన ప్రతీసారీ...
ఏదైనా విషయంలో మీరు బాధపడిన ప్రతీసారీ మీ మిత్రులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పడానికి అలవాటు పడితే వారు దగ్గర లేని సమయంలో ఇబ్బంది వస్తే మరింత ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఒంటరిగానే సమస్యను ఎదుర్కొనేలా మారాలని నిపుణులు సూచిస్తున్నారు.

3. కుటుంబ సమస్యలు...
ప్రపంచంలోని ఏ కుటుంబానికి కూడా ఇబ్బందులు లేకుండా ఉండవు. కాబట్టి మీ కుటుంబంలో జరిగే మనస్పర్థలను, కలహాలను మిత్రులతో పంచుకోకపోవడమే మంచిది. కుటుంబంలో కనీసం ఒక్కరు కూడా వినే పరిస్థితిలో లేరు అనే సందర్భంలో మాత్రమే ఇతరులతో పంచుకోవాలి. అనుకోని పరిస్థితి ఎదురై మీ స్నేహితులు శత్రువులైతే కుటుంబ వ్యవహారాలు గుట్టురట్టయ్యే ప్రమాదం ఉంది.

4. చేసిన మంచి పనులు...
మనం ఇతరుల పట్ల చూపిన జాలి, సహాయం అందరికి చెప్పుకుంటూ ఉంటే అది దాని లక్ష్యాన్ని చేరుకోలేదు. మన గొప్పదనాన్ని మనం చెప్పుకునే కంటే మన క్రియలే దాన్ని రూఢిపరిస్తే అది మరింత గౌరవాన్ని అందిస్తుంది. కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలీకూడదు అన్న సామెతను మరచిపోకూడదు.

5. లైంగిక జీవితం...
లైంగిక జీవితంలో ఎదురయ్యే అనుభూతులు, సమస్యలను ఎవరితోనూ పంచుకోకూడదు. సమస్యలేమైనా ఉంటే సంబంధిత వైద్యులను కలవాలి తప్ప ఇతరుల సలహా అడగకపోవడమే మంచిది. అలా పంచుకోవడం వల్ల వేధింపులకు గురయ్యే ప్రమాదం లేకపోలేదు. ‍వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచుకోవడమే ఉత్తమం.

6. మిత్రుల విషయాలను..
మీ మిత్రుల గురించి ఏమైనా చెడుగా వింటే, వారితోనే చర్చించి తెలుసుకోండి. అవునో కాదో అని మధ్యవర్తులను ఆశ్రయించడం ఆ విషయాన్ని మరింతగా ప్రచారం చేయడమే అనే తెలుసుకోవాలి. మీరు తమ గురించి వాకబు చేస్తున్నారన్న విషయాన్ని వేరే వారి ద్వారా మీ మిత్రులు తెలుసుకుంటే మీ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోవచ్చు. అలాగే మీ మిత్రులు మిమ్మల్ని నమ్మి పంచుకున్న రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపెట్టవద్దు.

ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయన్న చందాన మీ మిత్రులు కూడా ఏదో ఒకరోజు శత్రువులైతే మీరు పంచుకున్న రహస్యాలే వారికి బ్రహ్మాస్త్రాలవుతాయన్న విషయం గుర్తుంచు​కోవాలి. ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే పలు సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తు‍న్నారు.

మరిన్ని వార్తలు