8 పాయింట్స్

26 Apr, 2015 23:08 IST|Sakshi
8 పాయింట్స్

నందనా సేన్
 
నమ్మకం
మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎవరికి మాత్రం ఉంటుంది? అందుకే  ఏ పని చేయాలన్నా  ఆత్మవిశ్వాసం ఉండాలి. చెప్పొచ్చేదేమిటంటే నమ్మకం అనేది పదం కాదు...విజయానికి అవసరమైన పెట్టుబడి.
కాలం
‘నా కెరీర్‌లో నిండా కూరుకుపోయాను’ అంటుంటారు. ఇది మంచిదా కాదా అనే విషయం పక్కనపెడితే ఎప్పుడూ ఒకే దిక్కు కాకుండా ఇతర దిక్కులపై కూడా దృష్టి సారించాలి. అప్పుడే సమాజానికి ఉపయోగపడే స్వచ్ఛందసేవా కార్యక్రమాలు చేయగలము.
ఎజెండా
అమలుపరిచే విధానం, సాధనం కంటే ‘ఎజెండా’ ముఖ్యమైనది. నాన్నగారు (అమర్త్యసేన్) తన భావాలను పంచుకోవడానికి ఆర్థికశాస్త్రం ఉకరణంగా ఉన్నట్లే, నా భావాలను పంచుకోవడానికి ‘కళ’ అనేది ఉపకరణం.
పరిమితి
మనకు మనమే పరిమితులు విధించుకుంటాం. బాంబేలో ‘బ్లాక్’ సినిమాలో నటిస్తున్నప్పుడు ‘మీరు హార్వర్డ్ టాపర్ కదా! సినిమాల్లో నటించడమేమిటి?’ అని ఆశ్చర్యంగా అడిగేవారు. నేను రచయితను, యాక్టివిస్ట్‌ను కూడా. ‘మీరు నటి కదా రాయడం ఎందుకు?’ అని అడిగిన వాళ్లు కూడా ఉన్నారు. అందుకే... ఒక ప్రతిభ మరో ప్రతిభను  నియంత్రించకూడదు అనుకుంటాను.
సహజం
‘నా ప్రతిభను గట్టిగా చాటుకోవాలి’ అని ఒకటికి రెండుసార్లు గట్టిగా అనుకుంటే ప్రతిభ మాట ఎలా ఉన్నా ఒత్తిడి అనేది రెక్కలు విరుచుకుంటుంది. ఏదైనా సహజంగానే జరగాలి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అంతగా ప్రతిభ చూపగలుగుతాము.
సంతృప్తి
 పిల్లల హక్కుల కోసం పనిచేయడం, పిల్లల్ని వినోదపరచడం కోసం రచనలు చేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చే పని. ‘లవ్ బుక్’ అనే పిల్లల పుస్తకం ఒకటి రాశాను.
వ్యూహం
‘నా కెరీర్ ఇలా ఉండాలి అలా ఉండాలి’ అని ఎప్పుడూ ఒక నిర్దిష్టమైన స్ట్రాటజీ ఏర్పర్చుకోలేదు. మూసదారిలో వెళ్లిపోకుండా కొత్తదనం కోసం ప్రయత్నించడమే నా నిజమైన స్ట్రాటజీ.
హ్యాపీలైఫ్
నా దృష్టిలో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం అంటే... నమ్ముకున్న విలువల కోసం నచ్చినట్లు బతకడం, సమాజం కోసం మనవంతుగా ఏదో ఒకటి చేయడం.

>
మరిన్ని వార్తలు